నిత్యం.. నీటి యుద్ధం! | water froblom in moinabad area | Sakshi
Sakshi News home page

నిత్యం.. నీటి యుద్ధం!

Published Thu, Mar 24 2016 2:32 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నిత్యం.. నీటి యుద్ధం! - Sakshi

నిత్యం.. నీటి యుద్ధం!

మొయినాబాద్ మండలంలో 35 మీటర్ల లోతున నీళ్లు
పైపులైన్లు వేసి ఐదేళ్లయినా అందని మంజీరా నీళ్లు
ఎండిన గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలు


గండిపేట, హిమాయత్‌సాగర్‌లు చెంతనే ఉన్నాయి.. ఈసీ, మూసీ వాగులూ అతి సమీపంలోంచి వెళ్తున్నాయి.. కానీ చుక్కనీరు దొరక్క మొయినాబాద్ ప్రాంత ప్రజలు విలవిల్లాడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు తీవ్రమవుతున్న కొద్దీ నీటి సమస్య ఉధృతమవుతోంది. నిత్యం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడం లేదు.     - మొయినాబాద్

ఇరుపక్కల జంట జలాశయాలు.. ఎన్ని బోర్లు వేసినా నీటికి కరువే. ప్రస్తుతం ఎండలు ముదరడంతో గ్రామాల్లో ఈ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. బొట్టుబొట్టూ నీటిని ఒడిసి పట్టాల్సిన పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలు పడాల్సి వస్తుంది. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్లి మోసుకురావాల్సిన దుస్థితి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇస్తామని ప్రభుత్వం  చెబుతున్నా ప్రస్తుతం మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది.

 

 మండలంలో 21 గ్రామ పంచాయతీలు, 16 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో నీటి సమస్య ఉంది. ప్రధానంగా శ్రీరాంనగర్, పెద్దమంగళారం, సురంగల్, మొయినాబాద్, రెడ్డిపల్లి, మేడిపల్లి, చిన్నమంగళారం, చందానగర్, హిమాయత్‌నగర్, కనకమామిడి, అప్పారెడ్డిగూడ, తోలుకట్ట, నక్కపల్లి, ముర్తూజగూడ, ఎనికేపల్లి, బాకారం, అమ్డాపూర్ తదితర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల్లో నీటి సరఫరా బోర్లు పూర్తి గా ఎండిపోయాయి. కొన్ని గ్రామాల్లో ప్రైవేటు బోర్లు, రైతు ల బోర్లు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇవి ఏమూలకూ సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. కొందరైతే.. వ్యవసాయ బోర ్ల నుంచి బైకులు, సైకిళ్లు, ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో సింగిల్‌ఫేజ్ మోటర్లు ఏర్పాటు చేయడంతో వాటిలో సన్నటి ధారగా వస్తున్న నీటిని పట్టుకోవడానికి మూడు నాలుగు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

  పైప్‌లైన్లు వేసి ఐదేళ్లైనా అందని మంజీరా..
మొయినాబాద్ మండలానికి మంజీరా నీటిని అందించేందుకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.13.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. శంకర్‌పల్లి నుంచి మొయినాబాద్ మండలంలోని సగం గ్రామాలకు నీళ్లు అందించేందుకు పైప్‌లైన్ పనులు చేపట్టారు. మండలంలోని మేడిపల్లి, వీరన్నపేట, చిన్నమంగళారం, ఎలుకగూడ, కుత్బుద్దీన్‌గూడ, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, చందానగర్, పెద్దమంగళారం, మొయినాబాద్, చిలుకూరు, అప్పోజిగూడ, దేవల్ వెంకటాపూర్, హిమాయత్‌నగర్, ఎనికేపల్లి, జీవన్‌గూడ, అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం గ్రామాలకు పైప్‌లైన్లు వేసే పనులు 2011లోనే పూర్తి చేశారు. ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేసుందుకు అప్పోజిగూడ సమీపంలో వాటర్‌ట్యాంక్‌ను సైతం నిర్మించారు. ఈ పనులన్నీ జరిగినా మంజీరాల్లో నీళ్లు లేవని, జలమండలి అమనుమతులు ఇవ్వడం లేదనే సాకులతో ఇప్పటి వరకు చుక్క నీటిని వదల్లేరు.

  35 మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టం..
మండలంలో భూగర్భజలాల నీటి మట్టం 35 మీటర్ల లోతుకు పడిపోయింది. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటి పోతుండడంతో రెండు నెలల కాలంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రూ. లక్షలు ఖర్చు చేసి వందకు పైగా కొత్త బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. దీంతో మండలంలో ప్రతి రోజూ వంద ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

  ఎండిన జంట జలాశయాలు...
మొయినాబాద్ మండలానికి ఇరుపక్కల ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇవి కాస్త ఎండిపోయాయి. హిమాయత్‌సాగర్‌లో ఉన్న కొద్ది పాటి నీటితో మండలానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఒక వేళ వర్షాలతో జలాశయాల్లోకి నిండి ఉంటే.. ఎగువ ప్రాంతాల్లోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగేవి. తద్వారా నీటి సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
హిమాయత్‌నగర్ గ్రామం గండిపేట చెరువుకు ఆనుకుని ఉన్నా నీటికి మాత్రం ఇబ్బంది తప్పడం లేదు. మూడు నెలలుగా భూగర్భజలాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు నీటి సరఫరా బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. రైతుల బోర్ల నుంచి నీళ్లు తీసుకుని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. అయినా గ్రామంలో సరిపోవడంలేదు. - మల్లేష్ యాదవ్, సర్పంచ్, హిమాయత్‌నగర్

మంజీర నీళ్లు ఇస్తే..
మంజీర నీళ్లు ఇస్తామని గ్రామాల్లో పైప్‌లైన్లు వేశారు. ఐదేళ్ల నుంచి ఇప్పటికీ నీరివ్వలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మంజీర నీరు ఇచ్చుంటే మండలంలోని సగం గ్రామాలకు నీటి సమస్య తీరేది. ఇప్పుడైతే గ్రామంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. - గీతా వనజాక్షి, సర్పంచ్, పెద్దమంగళారం

అడుగంటిన భూగర్భ జలాలు
మండలంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. 35 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. దీంతో కొత్తగా బోర్లు వేసినా నీరు రావడం లేదు. గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాము. పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని గ్రామాల్లో వ్యవసాయ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. -  శారద, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, మొయినాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement