ప్రస్తుత సాగర్ నీటిమట్టం 508 అడుగులు
ముందు తాము వాడుకుంటామంటున్న తెలంగాణ ప్రభుత్వం
మంచినీటి కోసం ఎదురుచూస్తున్న
కుడికాలువ పరిధి ప్రజలు
1న నీరు వదిలితేనే కోటప్పకొండ తిరునాళ్లకు సరఫరా
నరసరావుపేట వెస్ట్ మంచినీటి అవసరాల నిమిత్తం తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు రెండూ 12 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఇప్పటికే ఎడమ కాలువకు, కృష్ణాడెల్టా అవసరాలకు నీరు విడుదల చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాల ప్రజల మంచినీటి అవసరాల కోసం 6 టీఎంసీల నీరు అవసరమని ఎన్‌ఎస్పీ అధికారులు ప్రభుత్వానికి సిఫార్స్ చేశారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి మున్టిపాల్టీల పరిధిలోని రిజర్వాయర్లు నీరు లేక ఒట్టిపోయాయి.
ఆయా మున్సిపాల్టీల్లో రోజు మార్చి రోజు, మూడు రోజులకు ఒకమారు, వారానికి ఒక మారు మంచినీరు సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లకు నీరు అందడం లేదు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 508 అడుగులు ఉంది. ఈ మట్టం 495 అడుగులకు తగ్గితే హైదరాబాద్‌కు నీటి సరఫరా సాధ్యం కాదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆ మట్టం వరకు ముందుగా తాము వినియోగించుకుంటామని, ఆ తర్వాత మీరు వాడుకోవచ్చని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య సందిగ్ధత నెలకొనడంతో ఫిబ్రవరి నెలాఖరుకు విడుదల కావాల్సిన నీరు ఆగిపోయింది.
కోటప్పకొండ తిరునాళ్ల నాటికైనా నీరు చేరేనా..?
ప్రస్తుతం రెండు టీఎంసీలకు పైగా నీటినిల్వకు ఆస్కారం ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్ ఒట్టిపోయింది. సాగర్ నుంచి నీరు విడుదలైతే బుగ్గవాగు రిజర్వాయర్ నిండేసరికే రెండు నుంచి మూడురోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి నరసరావుపేటకు చేరుకునేసరికి మరో రెండు మూడురోజులు పడుతుంది. కాలువ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి మోటార్లతో తోడేందుకు నరసరావుపేట మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంతరాలను అధిగమించి మార్చి ఒకటిన నీరు విడుదల చేస్తే కోటప్పకొండ తిరునాళ్లకు రెండురోజుల ముందుగా మాత్రమే నీరు అక్కడకు చేరే అవకాశం ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా భక్తులు ఇబ్బందిపడతారు. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తక్షణ సాగర్ నీరు వచ్చేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.