
జనంపై జలభారం
గ్రేటర్ వాసులకు నీటి కష్టాలు ట్యాంకర్లే ఆధారం
ఒక్కో కుటుంబంపైసుమారు రూ.2 వేల అదనపు భారం
ఈ నెల 1 నుంచి 18 వరకు 30 వేల ట్రిప్పులకు బుకింగ్
{పైవేటు ట్యాంకర్ యజమానుల దోపిడీ
సిటీబ్యూరో: గ్రేటర్‌లో పెరుగుతున్న ఎండలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వట్టిపోతున్న బోరు బావులతో గ్రేటర్ శివార్లు తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధార పడాల్సిన దుస్థితి తలెత్తింది. జలమండలి పరిధిలో మార్చి ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఏకంగా 30 వేల ట్రిప్పులకు ట్యాంక్‌లు బుక్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇలా బుక్ చేసుకున్న వారిలో 15 వేల మందికి 24 గంటల్లోగా.. మరో పదివేల మందికి 48 గంటల్లోగా ట్యాంకర్ నీటిని సరఫరా చేస్తున్నట్టు జలమండలి వర్గాలు తెలిపాయి. మరో 2500 మందికి మాత్రం వారం రోజులైనా ట్యాంకర్ నీళ్లు అందకపోవడం గమనార్హం. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ ఆపరేటర్లు వినియోగదారుల అవసరాలను భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
జలమండలి ట్యాంకర్‌కు (ఐదువేల లీటర్ల నీటికి) రూ.450 వసూలు చేస్తుండగా.. ప్రైవేటు ఆపరేటర్లు ప్రాంతాన్ని, డిమాండ్‌ను బట్టి రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. ఇక బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన జలమండలి ట్యాంకర్లు సైతం పక్కదారి పడుతున్నాయి. పేదల గొంతు తడపాల్సిన నీటిని కొందరు ట్యాంకర్ యజమానులు హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లకు సరఫరా చేసి జేబులు నింపుకుంటున్నారు. కొన్ని బస్తీల్లో జలమండలి ఉచిత ట్యాంకర్ల వద్ద మహిళలు ఖాళీ బిందెలతో యుద్ధాలు చేస్తున్న దృశ్యాలు ఇటీవల బాగా పెరిగాయి. అదనంగా ట్యాంకర్ ట్రిప్పులను సరఫరా చేయని కారణంగానే ఈ పరిస్థితి తలెతోంది.
టాం్యకర్ల పక్క దారి... జలమండలి పరిధిలో నీటి సరఫరాకు 6,674 ట్యాంకర్లున్నాయి. ఇందులో బస్తీలకు ఉచితంగా సరఫరా చేయాల్సినవి 125 ఉన్నాయి. కొన్ని బస్తీలకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాల్సిన ట్యాంకర్లు పక్కదారి పడుతున్నట్లు ఇటీవల ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై బోర్డు అధికారులు దృషి ్టపెట్టి ట్యాంకర్ యజమానులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వేసవిలో అదనంగా 500 ట్యాంకర్లతో గ్రేటర్ శివార్లలో మంచినీటి పైప్‌లైన్లు లేని వెయ్యి కాలనీలు, బస్తీలు, ఎగువ ప్రాంతాలకు ఉచితంగా నీటిని సరఫరా చేయాలని కాలనీ సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
గొంతెండుతోంది... గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. ఎండలు తీవ్రమవుతుండడంతో నీటి సమస్య పెరుగుతోంది. మల్కాజ్‌గిరి, బోడుప్పల్, కాప్రా, శేరిలింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతునకు బోరుబావులు తవ్వినా నీళ్లు లేక బావురుమనాల్సి వస్తోంది. జలమండలి మంచినీటి సరఫరా నెట్‌వర్క్ లేని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో పానీపరేషాన్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒక ఇల్లు లేదా ఫ్లాట్ యజమాని నెలకు ట్యాంకర్ నీళ్లకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది.
ఇదీ లెక్క...
గ్రేటర్ పరిధిలోని అపార్ట్‌మెంట్లు:
సుమారు 25 వేలు
ఒక్కో ఫ్లాట్ లేదా ఇంటి యజమాని ట్యాంకర్ నీళ్ల కోసం నెలవారీ చేస్తున్న ఖర్చు: ప్రాంతాన్ని బట్టి సుమారు రూ.2వేలు
గ్రేటర్ పరిధిలోని మొత్తం భవంతులు:
సుమారు 20 లక్షలు
జలమండలి నల్లా కనెక్షన్లు: 8.64 లక్షలు
జలమండలి సరఫరా నెట్‌వర్క్ లేని కాలనీలు,
బస్తీలు: సుమారు వెయ్యి
జలమండలి ట్యాంకర్లు: 674
{పైవేటు నీటి ట్యాంకర్లు: సుమారు నాలుగు వేలు.
ఈ నెల 1 నుంచి 18 వరకు ట్యాంకర్ ట్రిప్పులు:
30 వేలు
వారం రోజులుగా పెండింగ్‌లో ఉన్న ట్రిప్పులు: 2500
{పైవేటు ట్యాంకర్ నీళ్లకు (ప్రతి ఐదువేల లీటర్లకు) చెల్లిస్తున్న ధర: రూ.750 నుంచి రూ.1000
జలమండలి ట్యాంకర్ నీటికి: రూ.450(గృహవినియోగానికి)