మరుగుదొడ్డి లేకుంటే రేషన్ కట్
ఆత్మకూరురూరల్: స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి కుటుంబం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, లేని పక్షంలో లబ్ధిదారుల రేషన్ నిలిపివే పరిస్థితులు వస్తాయని ఎంపీడీఓ నిర్మలాదేవి అన్నారు. మండల సమావేశ భవనంలో బుధవారం సర్పంచ్, కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల వారిగా మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాలు నిర్దేశించినట్లు కార్యదర్శులు కృషి చేసి త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోనే ఆత్మకూరు మండలాన్ని నెలాఖరులోపు 100 శాతం నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
హెక్టారుకు ఒక ఫాంఫాండ్ నిర్మించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వీధిదీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛభారత్, భూగర్భ జలాల అభివృద్ధి పథకాల అమలుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. సహకరించకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆయా వ్యక్తులకు నిలిపివేసే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ చంద్రశేఖర్, ఉపాధి ఏపీఓ మురళీధర్, సర్పంచులు రఘురామిరెడ్డి, మంతు యానాదిరెడ్డి, వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.