నిర్వహణ గాలికి..
వృథాగా పాలెం, తొర్తి ఎత్తిపోతల పథకాలు
రూ. 6.50 కోట్లతో నిర్మించినా నిరుపయోగమే..
వినియోగంలోకి తెస్తే ఆయకట్టు భూములు సాగులోకి..
మోర్తాడ్ : పెద్దవాగులోని భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా పాలెం, తొర్తిలలో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. పాలెం ఎత్తిపోతల పథకానికి రూ. 3 కోట్లు, తొర్తి ఎత్తిపోతల పథకానికి రూ. 3.50 కోట్లను కేటాయించి నిర్మించారు. ఎనిమిదేళ్ల కింద ఈ రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. పెద్దవాగులో బావులు తవ్వించి అందులోకి వచ్చిన ఊట జలాలను పంపుసెట్ల ద్వారా చెరువుల్లోకి తరలించి చెరువులను నింపడం వీటి ముఖ్య ఉద్దేశ్యం. ఈ రెండు పథకాలను ఒకేసారి చేపట్టి పూర్తి చేశారు. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో చెరువులను సమృద్ధిగా నింపారు. అయితే రైతులకు స్వాధీనం చేసి రైతులతో కమిటీ ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు ఎత్తిపోతల పథకాలను నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. వీటిని రైతులు నిర్వహించుకున్నా అధికారులు అజమాయిషీ చేయాల్సి ఉంది.
కానీ నాసిరకంగా ఉన్న పంపుసెట్లను అమర్చడంతో ఎత్తిపోతల నీరు ఒకటే సంవత్సరం అందింది. వాగు ప్రవహించినప్పుడు బావుల్లోకి ఎక్కువ మొత్తంలో నీరు చేరి పంపుసెట్లు చెడిపోయాయి. కంపెనీలు గ్యారెంటీ ఇచ్చినా నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పంపుసెట్లు పనికి రాకుండా పోయాయి. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యేక సబ్‌స్టేషన్‌లను సైతం నిర్మించారు. ఎత్తిపోతల అధికారులు పట్టించుకోకపోవడం, రైతుల కమిటీలు కూడా పనిచేయకపోవడంతో రెండు ఎత్తిపోతల పథకాలు వృథాగా మారాయి.
వినియోగంలోకి వస్తే సాగులో భూములు
తొర్తి, పాలెం ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వస్తే చెరువులు నిండడం వల్ల రెండు గ్రామాల్లోని 800 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. అలాగే బోరుబావుల కింద ఉన్న దాదాపు 2,500 ఎకరాల భూములకు పరోక్షంగా సాగునీరు లభ్యమవుతుంది. చెరువులు నింపితే భూగర్భ జలాలు అభివృద్ధి చెంది బోరుబావులకు సమృద్ధిగా నీరందుతుంది. అలాగే వేసవిలో నీటి ఎద్దడి ఉండదు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పంపుసెట్లు బాగు చేయించి చెరువులకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.