అమ్మో ఆర్సెనిక్‌! | Arsenic Attack In Telugu States | Sakshi
Sakshi News home page

అమ్మో ఆర్సెనిక్‌!

Published Mon, Apr 5 2021 5:26 AM | Last Updated on Mon, Apr 5 2021 5:27 AM

Arsenic Attack In Telugu States - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలపై ఆర్సెనిక్‌ పంజా విసురుతోంది. భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటంవల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్‌ మూలాలు కన్పిస్తున్నాయి. బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) ప్రమాణాల ప్రకారం లీటర్‌ నీటిలో 0.01 మిల్లీ గ్రాముల్లోపే ఆర్సెనిక్‌ మూలాలు ఉండొచ్చు. కానీ.. గుంటూరు జిల్లాలోని రెండుచోట్ల.. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోచోట, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల భూగర్భ జలాల్లో బీఐఎస్‌ ప్రమాణాల కంటే అధికంగా ఆర్సినిక్‌ మూలాలున్నాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గుర్తించింది. ఈ నీటిని తాగినా, ఆ నీటితో సాగుచేసిన పంటల ఉత్పత్తులను తిన్నా మనుషులు, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ అతలాకుతలమవుతుందని.. బోన్‌మ్యారో (ఎముక మజ్జ), చర్మ క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో అధికం 
1980లో పశ్చిమ బెంగాల్‌లోని భాగీరథి నదీ తీరంలో సీడబ్ల్యూసీ నిర్వహించిన అధ్యయనంలో ఆర్సెనిక్‌ మూలాలు తొలిసారి బయటపడ్డాయి. దాంతో దేశవ్యాప్తంగా సీడబ్ల్యూసీ వీటిపై క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తోంది. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. లీటర్‌ నీటిలో 0.01 నుంచి 0.05 మిల్లీగ్రాముల వరకూ ఆర్సెనిక్‌ విషమూలాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. 

బోరు బావుల నీటితో అధ్యయనం 
ఇక ఏపీలో 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీటిని సేకరించిన సీడబ్ల్యూసీ.. వాటిలో ఆర్సెనిక్‌ మూలాలపై లోతుగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ.. 
► గుంటూరు రూరల్‌ మండలం ఎటుకూరులో బోరు బావుల నుంచి సేకరించిన నీటిలో ఒక లీటర్‌లో 0.01 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలింది. చేబ్రోలు మండలం వడ్డమూడిలో 0.02 మిల్లీ గ్రాములున్నట్లు వెల్లడైంది. 
► అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరాటంపాడులో 0.03 ఉన్నట్లు గుర్తించారు. 
► కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రత్న గ్రామంలో 0.02 మీల్లీ గ్రాములు ఉంది. 
► ఇక తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివ్వేముల మండలం కుడాకుడా, సూర్యాపేటలలో సేకరించిన బోరు బావుల నీటిలో లీటర్‌లో 0.01, 0.02 మిల్లీగ్రాముల ఆర్సినిక్‌ ఉన్నట్లు గుర్తించారు. 

ఉపరితల జలాలే సురక్షితం 
కాగా, ఆర్సెనిక్‌ మూలాలు బహిర్గతమైన ప్రాంతాల్లో భూగర్భ జలాలను తాగడానికి, పంటల సాగుకు వినియోగించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీడబ్ల్యూసీ సూచించింది. ఆ ప్రాంతాల్లో పంటల సాగుకు ఉపరితల, నదీ జలాలను సరఫరా చేయాలని కోరింది. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలను చేపట్టడం ద్వారా జలమట్టాన్ని పెంచవచ్చునని.. తద్వారా ఆర్సెనిక్‌  ప్రభావాన్ని తగ్గించవచ్చునని తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement