సదాశయంతో సర్కారు చేపట్టిన పథకం
రైతులకే తొలి {పాధాన్యమంటున్న అధికారులు
అయితే రియల్టర్లకే దక్కనున్న ప్రయోజనం
ఏది విత్తినా విరగపండే ‘నేలమ్మ కడుపు’లాంటి మాగాణాలే.. సేద్యానికి దూరమై, కేవలం ‘అమ్మకపు సరుకు’లా మారిపోతున్న రియల్ ఎస్టేట్ యుగం ఇది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’ పథకం.. మన్నును పచ్చని పైర్లకు వేదికగా మార్చి, మల్లెల రాశిలాంటి అన్నాన్ని సృష్టించే రైతులకు కాక.. భూమిని పచ్చనోట్లు ఉత్పత్తి చేసే కార్ఖానాగా మార్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఉపయోగపడనుంది.
రాజానగరం : భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు చెరువుల్లో నీటి నిల్వలను వృద్ధి చేయాలని, తద్వారా ఆయకట్టు భూములకు సాగు నీటిని పుష్కలంగా అందించాలని ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నీరు - చెట్టు’ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారనుంది. భూగర ్భ జ లాలతోపాటు పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ద్వారా పచ్చదనాన్ని వృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ఆశయం మంచిదే అయినా ఆచరణ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
40 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చెరువులను ఉపాధి పనుల్లో అభివృద్ధి చేసే అవకాశమున్నా అలాంటి వాటిని అభివృద్ధి చేసే కంటే 100 ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న చెరువుల పట్లే రియల్ ఎస్టేట్ వ్యా పారులు మక్కువ చూపిస్తారనేది వాస్తవం. అలాంటి చెరువుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు (లోతు చేయడం, చెరువు గర్భాన్ని విస్తరించడం) యంత్రాలను కూడా వాడవచ్చనే సవరణను ఈ వ్యాపారులు అనువుగా మలచుకుంటారని రైతులు అంటున్నారు.
రాజమార్గం అంటున్న రియల్టర్లు..
కాగా ఈ పనులకు నిర్దేశించిన నియమ, నిబంధనల్లో చెరువు విస్తీర్ణాన్ని బట్టి మట్టిని ఎంతవరకు తీయవచ్చో సంబంధిత ఇంజనీరింగ్ అధికారి నిర్ణయిస్తారు. దానిని అనుసరించి మట్టి తవ్వకాలు చేపట్టాలి. తమ లే అవుట్లను ఎత్తు చేసుకునేందుకు అవసరమైన మట్టిని చెరువుల అభివృద్ధి నెపంతో తమకు అవసరమైన మేరకు తవ్వుకునేందుకు ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటారని రైతు ప్రతినిధులు అంటున్నారు. వాస్తవానికి ఈ పథకంలో చెరువులను అభివృద్ధి చేసే సమయంలో వెలికి తీసే మట్టిని పొలాల్లో వేసుకునేందుకు రైతులకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. కాని ఆ విధంగా రైతులు మట్టిని తీసుకువెళ్లి పొలాలను మెరక చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఎక్కడా లేదు. లే అవుట్లు మారుమూల గ్రామాల్లో కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏటా రెండు పంటలు పండే భూములను సైతం మంచి ధర వస్తే అమ్ముకోవాలని చూస్తున్న రైతులు చెరువుల్లో మ ట్టిని తీసుకువెళ్లి పొలాలను మెరక చేసే అవకాశాలు లేవు. ఇంతవరకు లేఅవుట్లలో మట్టిని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు మామూళ్లు చెల్లించి అనధికారికంగా తీసుకుంటున్న తమకు ఈ పథకం నిజంగా రాజమార్గాన్ని చూపిస్తుందని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారే పేర్కొన్నారు. ఈ పను లు మండలస్థాయి కమిటీ పర్యవేక్షణ లో జరగవలసి ఉంది. ఆ కమిటీ సభ్యులు అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులే కావడంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ‘నీరు - చెట్టు’ పథకం నుంచి నిజమైన లబ్ధిని పొందుతారని జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కూడా అభిప్రాయపడ్డారు.
రూ.105.92 కోట్లతో 2,850 పనుల గుర్తింపు
జిల్లాలో ఈ పథకం ద్వారా రూ.105.92 కోట్ల వ్యయం కాగల 2,850 పనులు గుర్తించారు. వీటిలో 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న 324 భారీ సేద్యపు నీటి చెరువులు, 6,135 చిన్నతరహా సేద్యపు నీటి చెరువులు కూడా ఉన్నాయి. అలాగే 675 చెరువులకు మరమ్మతులతోపాటు 176 చెక్‌డ్యామ్‌లు, 400 మినీ ఇరిగేషన్ చెరువులు, 361 చిన్నపాటి చెరువులను అభివృద్ధి చేయనున్నామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. చెరువుల మట్టిని రవాణా చేసుకునేందుకు ట్రాక్టర్లు, లారీలకు నిబంధనల మేరకు అనుమతి అవసరమన్నారు. మొదటి ప్రాధాన్యం రైతులకే ఇస్తామని, వారు ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందవచ్చని అన్నారు. రియల్ ఎస్టేట్ లే అవుట్లకు ఈ మట్టిని తరలించడానికి వీలుందనే విషయాన్ని ప్రస్తావించగా వారిది ఆఖరు ప్రాధాన్యం మాత్రమేనన్నారు.
‘నీరు-చెట్టు’ మట్టి.. లే అవుట్లకే
Published Sat, Feb 21 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement