
భూగర్భ జలాలకు ‘కరెంట్’ షాక్!
♦ 9 గంటల విద్యుత్‌తో భూగర్భ జలాలపై ఒత్తిడి
♦ అంతటా ఒకేసారి వినియోగిస్తుండడంతో తగ్గుతున్న మట్టాలు
♦ రెండు, మూడు గంటల్లోనే బోర్లు, బావుల్లో నీళ్లు బంద్
♦ తిరిగి రీచార్జి కావడానికి అవకాశం లభించని స్థితి
♦ మళ్లీ మరునాడే విద్యుత్ సరఫరా.. మళ్లీ అదే పరిస్థితి
♦ సరిగా నీరందక లక్షల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు
♦ మరోవైపు నీటిని విచ్చలవిడిగా తోడేస్తున్న పెద్ద రైతులు
♦ రాష్ట్రంలో అసాధారణంగా పెరిగిన విద్యుత్ డిమాండ్
♦ రెండు విడతలుగా విద్యుత్ ఇవ్వాలంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సరిగా నీరందక బోర్లు, బావుల కింద పంటలు ఎండిపోతున్నాయి.. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లేక కాదు.. విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉండడం వల్ల! ఆశ్చర్యంగా అని పించినా... ఇదే వాస్తవమని నిపుణులు చెబుతు న్నారు. వర్షాలు సరిగా కురవకపోవడం, ఎండలతో భూగర్భ జలాలు తగ్గిపోవడంతోపాటు వ్యవసాయా నికి 9 గంటల నిరంతర సరఫరా వల్ల కూడా బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయని చెబుతు న్నారు.
ఒకే దఫా విద్యుత్ సరఫరాతో అంతటా ఒకేసారి బోర్లు, బావుల నుంచి భూగర్భ జలాలను తోడేస్తున్నారని, దాంతో కొద్దిసేపటికే నీరు అందడం లేదని చెబుతున్నారు. అదే రెండు దఫాలుగా విద్యుత్ సరఫరా చేస్తే.. ఆ మధ్య సమయంలో బోర్లు, బావుల్లో జలాలు రీచార్జి అవుతాయని, దాంతో పంట లకు సరిగా నీరు అందుతుందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే 1.56 లక్షల ఎకరాల్లో..
వ్యవసాయ బోర్లు, బావులు ఎండిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్‌లో బోర్లు, బావుల కింద 1.56 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అందులో 1.52 లక్షల ఎకరాలు వరి పంటే కావడం గమనార్హం. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో భూ గర్భ జలాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయి జల మట్టాలు పడిపోతున్నాయి. దీంతో నీరందక పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల మేలు కోసమే..!
గతంలో వ్యవసాయానికి రెండు మూడు విడతల్లో 4 గంటల నుంచి 6 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగేది. దాంతో పంటల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల బోర్లు, బావుల కింద పంటలు పండించే రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది నుంచి వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేపట్టింది. ఇక గతేడాది రాష్ట్రంలో సాధారణ వర్షపాతం(862 మిల్లీమీటర్లు) కన్నా అధికంగా 1,104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పుష్కలంగా భూగర్భ జలాలు లభిస్తాయని ఆశించిన రైతులు.. రబీలో సాధారణ విస్తీర్ణానికి మించి పంటలు వేశారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 12.09 లక్షల హెక్టార్లుకాగా.. ఈ సారి 27% అధికంగా 15.36 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతోంది.
కొందరు విచ్చలవిడిగా తోడేస్తుండడంతో..
ఒకే విడతలో 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో రైతులంతా బోర్లు, బావుల నుంచి ఒకేసారి నీటిని తోడేయాల్సి వస్తోంది. దీంతో భూగర్భ జల మట్టాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. సాధారణంగా రైతులకు 7.5 హార్స్‌పవర్‌లోపు సామర్థ్యం గల మోటార్లకే అనుమతి ఉంది. కానీ కొందరు పెద్ద రైతులు 10 హెచ్‌పీ, 15 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్లతో భూగర్భ జలాలను తోడేస్తున్నారు. నిబం ధనలకు విరుద్ధంగా మూడు కంటే ఎక్కువ విద్యుత్ కనెక్షన్లతో విచ్చలవిడిగా భూగర్భ జలాలను వెలికి తీస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా రైతుల కు చెందిన తక్కువ లోతు, తక్కు వ సామర్థ్యమున్న మోటార్లతో కూడిన బోర్లలో నీరు రావడం లేదు. వాటి కింద సాగు చేస్తున్న పంటలు ఎండిపోతు న్నాయి. అంతేకాదు తమ బోర్లు ఎండి పోవడంతో అక్కడక్కడా చిన్న రైతులు దగ్గర్లోని పెద్ద రైతుల బోర్ల నుంచి నీళ్లు కొనుక్కుంటుండడం గమనార్హం.
నీటి రీచార్జింగ్‌కు సమయం
గతంలో వ్యవసాయానికి రెండు మూడు విడతల్లో కలిపి 4 నుంచి 6 గంటల పాటు విద్యుత్ సరఫరా జరిగేది. ఓ విడతలో బోరులోని నీటిని తోడేసినా మరో విడత విద్యుత్ సరఫరా అయ్యే సమయానికల్లా బోరులో భూగర్భ జలాలు రీచార్జి అయ్యేవి. దాంతో రెండు విడతల విద్యుత్ సరఫరాతో చాలా ప్రయోజనమూ ఉండేది. కానీ ప్రస్తుతం 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో.. చాలా చోట్లలో తొలి మూడు గంటలకే బోర్ల నుంచి నీళ్లు రావడం ఆగిపోతోంది. మళ్లీ మరుసటి రోజే విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో నీళ్లు సరిపోక పంటలు ఎండిపోతున్నాయి.
పెరిగిన విద్యుత్ వినియోగం!
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ ఏడాది మార్చి 31న రాష్ట్ర విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 9,191 మెగావాట్లుగా నమోదైంది. 2016లో అత్యధిక వినియోగం 7,720 మెగావాట్లుకాగా.. 2015లో 7,035 మెగావాట్లు మాత్రమే.
భూగర్భ జలాలు రీచార్జి కానివ్వాలి..
‘‘9 గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చినా.. చిన్న, సన్నకారు రైతులు మూడు గంటలకు మించి వాడుకోలేరు. తక్కువ లోతు బోర్లు, తక్కువ సామ ర్థ్యమున్న మోటార్ల కారణంగా వారి బోర్ల నుంచి నీళ్లు ఆగిపోతాయి. కొంత విరామం తర్వాతే మళ్లీ నీళ్లు వస్తాయి. పెద్ద రైతులు బాగా ఖర్చు చేసి బోర్లు లోతుగా వేయిస్తారు, అధిక సామర్థ్యం గల మోటా ర్లు వినియోగిస్తారు. దీంతో నీళ్లంతా వాళ్లకు వెళ్లిపో తాయి. ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై మాత్రమే కాకుండా భూగర్భ జలాల పరిస్థితిపై కూడా దృష్టి పెట్టి ఉంచాలి. వ్యవసాయ, విద్యుత్, భూగర్భ జల శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ.. పంటల సాగు విషయంలో రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం మంచింది..’’
– ఎం.వేణుగోపాలరావు,
సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కో–ఆర్డినేటర్
పశువుల మేతకే పనికొచ్చింది..
‘‘రెండెకరాలు కౌలుకు తీసుకుని రూ.25 వేలు అప్పు చేసి వరి పంట సాగు చేశా. బోరులో నీళ్లు రాక చేతికి వచ్చే పంట ఎండి పోయింది. ఇప్పుడు పశు వుల మేతకు మాత్రమే పనికొస్తోంది. అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు..’’
– కొమురయ్య, కౌలురైతు, వెల్దుర్తి, మెదక్ జిల్లా
వరి ఎండింది.. మొక్కజొన్నా పోయింది..
‘‘వెల్దుర్తి శివారు హల్దివాగు పరీవాహకంలో ఎకరన్నర పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. రూ.16 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన. వాగులో రింగుల బావి ఎండిపోయింది. పొలంలోని బోరు నుంచి నీళ్లు వస్తలేవు. నాకున్న ఎకరం పొలంలో రూ.10 వేలు అప్పు చేసి మొక్కజొన్న సాగు చేసిన. కానీ చేతికి వచ్చే సమయంలో నీరందక ఎండిపోతుం డడంతో పశువుల మేతకు అమ్ముకున్నా..’’
– నాగులు, కౌలు రైతు, శేరిల, మెదక్ జిల్లా