శ్రీసూర్యనారాయణా..కూల్‌ కూల్‌!  | The Water in the Reservoirs is Evaporated | Sakshi
Sakshi News home page

శ్రీసూర్యనారాయణా..కూల్‌ కూల్‌! 

Published Mon, May 13 2019 1:51 AM | Last Updated on Mon, May 13 2019 10:31 AM

The Water in the Reservoirs is Evaporated - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుపెన్నడూ లేనంతగా.. ఈసారి సూర్యనారాయణుడు రౌద్రరూపాన్ని చూపిస్తున్నాడు. భగభగా మండుతూ.. రాష్ట్రంలో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. దీంతో మండుతున్న ఎండలు.. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో దాదాపు 80 శాతం కరువుఛాయలు కనిపిస్తున్నాయని.. భూగర్భజల మట్టం దారుణంగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఈ నెలాఖరుకు భూగర్భజలాలు మరింత తగ్గిపోయి రాష్ట్రంలో సగటున 15 మీటర్ల లోతుకు వెళతాయని అంచనా. ఠారెత్తిస్తున్న ఎండలతో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆవిరైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

భూగర్భజలాలు తగ్గిపోతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో కూడా తాగునీటికి ఇబ్బందులు తప్పడంలేదు. పశువులకు తగినన్ని నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పాలదిగుబడి తగ్గిపోగా, గడ్డిరేటు రెట్టింపైంది. దీంతో వానలు వచ్చే వరకు రాష్ట్రంలో బతుకు వెళ్లదీయడం అత్యంత దుర్భరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి సమస్యలు ఒక ఎత్తయితే.. ఈ వేసవిలో భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 55 మంది ఎండదెబ్బకు ప్రాణాలు వదలడం గమనార్హం. 

28 జిల్లాల్లో పాతాళానికి గంగమ్మ 
ఎండల తీవ్రత భూగర్భజలాలపై ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ.. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో గంగమ్మ 28 జిల్లాల్లో పాతాళానికి చేరిపోయింది. ముఖ్యంగా మెదక్‌ జిల్లాలో 25.72 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు వెళ్లిపోయాయి. వికారాబాద్‌లో 20.46, సిద్దిపేటలో 20.04, సంగారెడ్డిలో 23.47 మీటర్ల లోతుకెళ్తే గానీ నీటిచుక్క కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాలో మాత్రమే 10 మీటర్లకు పైన నీళ్లున్నాయి. గతేడాదితో పోలిస్తే భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూగర్భజలాలు పెరిగాయి. అది కూడా ఒక మీటరులోపే. రాష్ట్ర సగటును పరిశీలిస్తే.. గత వేసవిలో ఈ సమయానికి 12.77 మీటర్ల లోతులో నీళ్లుంటే ఇప్పుడు 1.37 మీటర్ల లోతుకు వెళ్లి 14.14 మీటర్లకు చేరాయి. 

16% లోటు వర్షపాతం 
రాష్ట్రంలో జూన్, 2018 నుంచి ఏప్రిల్‌ 2019 వరకు 16% లోటు వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లాలో 42% లోటు కనిపిస్తుండగా, సంగారెడ్డిలో అత్యధికంగా 45% లోటు వర్షపాతం నమోదయింది. మెదక్‌లో కూడా సాధారణంతో పోలిస్తే 41శాతం తక్కువ వర్షం పడింది. రాష్ట్రం మొత్తం మీద సగటు వర్షపాతం 877.31 మిల్లీమీటర్లు కాగా, పడింది కేవలం 737.40 మిల్లీమీటర్లే. 

సాగర్‌ నీటిమట్టం ఆందోళనకరం 
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 511 అడుగుల నీటి మట్టం ఉంది. ఇందులో మన అవసరాలకు వాడుకునే వీలున్నది 1.2 టీఎంసీలు మాత్రమే. అదే గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 512.90 అడుగుల మేర నీళ్లున్నాయి. అప్పుడు అవసరాలకు వినియోగించుకునే నీళ్లు 3 టీఎంసీలుగా ఉంది. 2017–18లో ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజి స్థాయికి వెళ్లింది. ఆ ఏడాది మేలో 508 అడుగులకు చేరింది. 505 అడుగులకు చేరే వరకు నీటి వినియోగం జరిగింది. 2016–17లో ఈ సమయానికి 510 అడుగుల కనీస స్థాయిలో నీళ్లున్నాయి.

అయితే, ఈసారి మిషన్‌భగీరథ అవసరాలకు నిల్వ ఉంచి మిగిలిన నీటిని మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈమేరకైనా నీళ్లున్నాయి. ఆవిరి నష్టాలను కూడా ముందుగానే గుర్తించిన అధికారులు కొంతమేర నివారించే ప్రయత్నం చేశారు. మార్చి–ఏప్రిల్‌ నెలల్లో ఆవిరి నష్టం నెలకు 0.75 టీఎంసీ నుంచి 1 టీఎంసీ వరకుంటుంది. ఇది ఒకనెల హైదరాబాద్‌ తాగునీటి అవసరాలతో సమానం. కాగా, మే నెలలో ఈ ఆవిరి నష్టం 1.5 టీఎంసీలకు చేరడం ఆందోళనకరం. జూరాల నుంచి సాగర్‌కు 3 టీఎంసీల నీరు విడుదల చేస్తే సాగర్‌ ప్రాజెక్టు చేరింది 1.1 టీఎంసీలే. ఇందులో 1 టీఎంసీ నీటి ప్రయాణ నష్టం కాగా, మరో టీఎంసీ ఆవిరి అయిపోవడం గమనార్హం. 

శ్రీశైలందీ అదే పరిస్థితి! 
శ్రీశైలంలో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 885 అడుగులు కాగా ఇప్పుడు 807.80 అడుగులకు చేరింది.  ఈ ప్రాజెక్టులో గత మూడేళ్లతో పోలిస్తే  ఫరవాలేదనే స్థాయిలో నీళ్లున్నాయి. సింగూరు ప్రాజెక్టు పరిస్థితి  దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టులో 21.91 టీఎంసీల గరిష్ట నీటిసామర్థ్యానికిగాను కేవలం 0.68 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. అదే గత ఏడాది 8 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ఏడాది మహా రాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాలేదు. నిజాంసాగర్‌లో ఈ ఏడాది 0.63 టీఎంసీల నీరుం డగా, గతేడాది ఇదే సమయానికి 2.61 టీఎంసీలున్నాయి.

సింగూరు నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఇక్కడా నీళ్లు లేకుండా పోయాయి. ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు గాను 6.26 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే గతేడాది ఇది 6.81 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి కొంత ఇన్‌ఫ్లో ఉండడంతో ఆ కొద్దిమేరనైనా నీళ్లున్నాయి. లేదంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అధికారులు చెపుతున్నారు. మొత్తం మీద మనం ఎక్కువగా ఆధారపడే సాగర్, సిం గూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీలలో నీటి నిల్వలు అధమస్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

సాగు తక్కువే 
రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, 29.70 లక్షల ఎకరాల్లో సాగైనట్లు (89%) వ్యవసాయశాఖ నివేదిక తెలిపింది. అత్యధికంగా పప్పుధాన్యాల సాగయ్యాయి. పప్పుధాన్యాల రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 3.22 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రబీ వరి సాధారణ విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 17.50 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు నివేదిక తెలిపింది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, 3.22 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. ఇక కీలకమైన పప్పుధాన్యాల సాగు 103% నమోదు కావడం గమనార్హం. ఇక నూనెగింజల సాధారణ సాగు విస్తీర్ణం 4.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.30 లక్షల (74%) ఎకరాల్లో సాగు జరిగింది.

అందులో కీలకమైన వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, 2.80 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా 126% రబీ పంటలు సాగయ్యాయి. అక్కడ సాధారణ సాగు విస్తీర్ణం 49 వేల ఎకరాలు కాగా, 62 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇదిలావుంటే రబీ మొక్కజొన్న పంటను కత్తెరపురుగు దెబ్బతీసింది. దీని ప్రభావంతో 8 జిల్లాల్లో మొక్కజొన్న దిగుబడి చాలా తగ్గింది. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్‌ (అర్బన్‌), వరంగల్‌ (రూరల్‌), నిర్మల్, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్‌ జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెరపురుగు వ్యాపించింది. అకాల వర్షాలకు గాను మామిడి, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. రబీ నాటికి 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 

విద్యుత్‌ తెగ ఖర్చవుతోంది 
రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తుండడంతో గృహ అవసరాలకుగానూ విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. మే నెలలో గత 10 రోజుల్లోనే దాదాపు 900 మెగావాట్ల  విద్యుత్‌ వినియోగం పెరిగింది. మే 1వ తేదీన రాష్ట్రంలో 7,221 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ రాగా, 10వ తేదీన 8,147 మెగావాట్లకు చేరింది. 11న కొంత మేరకు తగ్గి 8,053 మెగావాట్లకు చేరింది. అయితే, వ్యవసాయ పనులు లేకపోవడంతో కొంత డిమాండ్‌ తగ్గినట్టు కనిపిస్తున్నా.. వ్యవసాయ వినియోగం సగటు 3,500 మెగావాట్లను కలిపితే అది 11,500 మెగావాట్లు దాటనుంది. అయితే, రాష్ట్రంలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 10,500 మెగావాట్లు మాత్రమే ఉంది. కానీ, మే నెలలో ఏకంగా వ్యవసాయ వినియోగం లేకుండా 8,147 మెగావాట్లకు చేరడం గమనార్హం.

భానుడు దంచేస్తున్నాడు 
►రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎంతగా అంటే గ్రామాల్లో నీటిచెల్మలు కూడా లేక పక్షులు చనిపోతున్నాయి. ఇతర మూగజీవాలు నీళ్ల కోసం తండ్లాడుతున్నాయి. చాలా జిల్లాల్లో భూగర్భజలాలు పడిపోతుండటం తో నీళ్లు రావడమే గగనమైపోయింది. పట్టణాల్లోని అపార్ట్‌మెంట్లలో ఉన్న బోర్లు వట్టిపోతున్నాయి. 

►ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల కారణంగా జిల్లాలో రోజుకు 4లక్షల లీటర్ల పాల దిగుబడి తగ్గిపోయింది. మూగజీవాలకు నీళ్లు కరువయ్యాయి. గడ్డి తగ్గిపోయింది. ట్రాక్టర్‌ గడ్డి రూ.5వేల నుంచి రూ.8వేలకు పెరిగింది. 

►ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమను ఎండలు ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. భానుడి ప్రతాపానికి తాళలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని 50% పౌల్ట్రీ ఉత్పత్తులు ఈ జిల్లా నుంచే ఉండడం గమనార్హం. 

►గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కూడా 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే10వ తేదీన హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా 3,102 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. గతంలో 2018 మే30న 2,958 మెగావాట్ల డిమాండ్‌ రికార్డు కాగా, ఇప్పుడు 104 మెగావాట్లు పెరిగింది. ఫీడర్లు ట్రిప్‌ అవుతుండడంతో విద్యుత్‌ సరఫరా>కు అంతరాయం కలుగుతోంది. 

►మహబూబ్‌నగర్‌లో ట్రాక్టర్‌ గడ్డి రూ.15వేలు పలుకుతోంది. వలస కార్మికులు నిలువ నీడ లేని పరిస్థితుల్లో పనులు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

►రంగారెడ్డి జిల్లాలో 191 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదయింది. భూగర్భజలాలు 18.43 మీటర్ల లోతుకు వెళ్లాయి. 24 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 200 గ్రామాలు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లాయి. 

►నల్లగొండ జిల్లాలో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ భూగర్భజలాలు 14.89 మీటర్లకు పడిపోగా, వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. ప్రస్తుత నల్లగొండ జిల్లాలో 31 మండలాలుండగా, 25 మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. ట్రాక్టర్‌ గడ్డి రూ.8వేల నుంచి 12వేలు పలుకుతోంది. 

►ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ వేసవిలో వడదెబ్బకు 55 మంది వరకు చనిపోయారు. ఇక్కడ 43–46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

►ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయినప్పటికీ భూగర్భ జలాలు లోపలికి వెళ్లాయి. గత ఏడాదితో పోలిస్తే అరమీటరుకు పైగా ఎక్కువగానే గంగమ్మ పాతాళంలోకి చేరింది. 

►నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం 1015.7 మిల్లీమీటర్లు కాగా, కురిసింది కేవలం 850.9 మిల్లీమీటర్లే. ఇక భూగర్భజలాలు గతేడాది 15.32 మీటర్ల లోతున ఉంటే ఇప్పుడు 17.05 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 

►వరంగల్‌ జిల్లాలో పది మీటర్లకు అటు ఇటుగా భూగర్భజలాలున్నాయి. అయితే, వర్షపాతం మాత్రం 70 శాతం కూడా నమోదు కాలేదు. పెద్ద ఎత్తున బోర్లు ఎండిపోయే పరిస్థితుల్లో గ్రామాల్లో తాగునీటికి కూడా కష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement