
రబీ పంట చేతికందేనా ?
ఈ నెలాఖరు వరకే సాగునీరు
అసలే పంటసాగులో ఆలస్యం
అడుగంటిన భూగర్భజలాలు
అయోమయంలో రైతులు
జిల్లాలో ఈ రబీ సీజను పంట రైతుల చేతికందేనా ? అనే సందేహం కలుగుతోంది. తెలుగుగంగ ద్వారా పంటలకు సాగునీరు ఈ నెలాఖరు వరకు మాత్రమే అందే పరిస్థితులు ఉన్నాయి. అంతేగాక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలను కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నారుు.
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రతి ఏటా రబీ సీజన్లో సాధార ణంగా 59,885 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేస్తారు. అయితే ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నారుు. జిల్లా వ్యాప్తంగా 934 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను ఇప్పటికీ 531 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. ఇందులో అధిక శాతం తూర్పు మండలాల్లోనే నమోదవడం గమనార్హం. ఈ క్రమంలో రైతులు జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజనుకుగాను 25,139 (42 శాతం) హెక్టార్లలో మాత్రమే పంటలు సాగుచేశారు. ప్రధాన పంటలైన వరి 36,338 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 16,416 హెక్టార్లలో, వేరుశెనగ 14,092 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 4,796 హెక్టార్లలో, కంది 61 హెక్టార్లకు గాను 3 హెక్టార్లలో, పెసర 255 హెక్టార్లకుగాను 59 హెక్టార్లలో, రాగి,సజ్జ మిగిలిన ఇతర పంటలు 760 హెక్టార్లకుగాను 11 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. అందులో తూర్పు మండలాల్లోనే అధికంగా దాదాపు 70 శాతం పంటలను సాగుచేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ రబీ సీజన్లో పంట సాగు గణనీయంగా తగ్గింది.
సాగునీరు అంతంత మాత్రమే
జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. తూర్పు మండలాలైన తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ, సత్యవేడు, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరులో సాగుచేస్తున్న 10,748 హెక్టార్ల పంటలకు తెలుగుగంగ నీటిని చెరువులకు మళ్లించి సాగునీరు అందిస్తున్నారు. ఈ చెరువుల్లో కూడా ఈ నెలాఖరు వరకు మాత్రమే పంటలకు అందించేందుకు సరిపడా నీరు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి తెలుగుగంగ నీటని చెరువులకు మళ్లించే పరిస్థితులు లేవని చెబుతున్నారు.
పంటలను వదులుకోవాల్సిందే
జిల్లాలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో రబీ పంటల సాగు కూడా ఆలస్యంగా మొదలయింది. దీంతో వరి, వేరుశెనగ పంటలు మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతుల చేతికి అందనున్నాయి. అయితే ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలకు నీటిని ఆశించిన మేరకు అందించలేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. తెలుగుగంగ ద్వారా తూర్పు మండలాల్లోని పంట పొలాలకు ఈ నెలాఖరు వరకు మాత్రమే నీరు అందించగలిగే పరిస్థితులు ఉన్నాయి. మరో రెండు నెలల పాటు నీరందితేనే పంటలు పండుతారుు. వాస్తవ పరిస్థితులు చూస్తుంటే పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక అర్ధాంతరంగా వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది.