రబీ ‘సాగే'నా? | Rabi 'sagena? | Sakshi
Sakshi News home page

రబీ ‘సాగే'నా?

Published Wed, Nov 19 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

రబీ ‘సాగే'నా?

రబీ ‘సాగే'నా?

నెల్లూరు (అగ్రికల్చర్) : రబీ సీజన్ ప్రారంభమైనా సాగు సన్నాహాలు పూర్తిస్థాయిలో కానరావడం లేదు. ఖరీఫ్ పంటకు మద్దతు ధర లేకపోవడం, పెట్టుబడి వ్యయం పెరగడం, నీళ్లు లేక పంటలు ఎండిపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర కష్ట, నష్టాలను చవి చూశారు. ఒక పక్క జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కావడం, మరో పక్క రుణమాఫీ అమలు కాక అప్పుల భారం పెరగడంతో రైతుల్లో వ్యవసాయంపై నిర్లిప్తత నెలకొంది. మెట్టపైర్ల సాగు కూడా ఆశించిన స్థాయిలో ప్రారంభం కావడం లేదు.   

ఈ ఏడాది రబీ ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,50,247 హెక్టార్లు ఉంటే అనేక కారణలతో 1,46,961 హెక్టార్లల్లో మాత్రమే పంటలు సాగయినట్లు అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ గత నెల నుంచే ప్రారంభమైనప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంత వరకు సన్నాహాలే ప్రారంభం కాలేదు. డెల్టా ప్రాం తంలో వరి నార్లు పోసుకున్నా, నాన్ డెల్టాలో వర్షం లేకపోవడంతో కనీసం నారుమడులు కూడా ఏర్పాటు చేసుకోలేదు. మినుము, వాణిజ్య పంటల సాగు సైతం సానుకూలంగా సాగడం లేదు.

పెసర మాత్రమే సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేస్తున్నారు. రుణమాఫీతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం రోజుకో నిర్ణయంతో కాలం వెళ్లదీస్తోంది. ఖరీఫ్ రుణాల రీషెడ్యూల్‌కు, పంటల బీమాకు సైతం నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో రబీ పంటలు వేయడానికి రైతుల చేతుల్లో డబ్బులు లేక, అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో అన్నదాతలు సాగుపై ఆశలు వదులుకున్నారు. జిల్లాలో 2,76,425 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి 32,794 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.  

 పడిపోతున్న భూగర్భజలాలు
 జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే జిల్లాలో తక్కువ శాతం నమోదైంది. సోమశిల ప్రాజెక్టులో 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ 47.254 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్‌లో 67 టీఎంసీలకు గాను 25.302 టీఎంసీలు, సర్వేపల్లి రిజర్వాయర్‌లో 12 అడుగులకు 7.3 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. కనిగిరి రిజర్వాయర్‌లో 21.45 అడుగులకు 17.5, నెల్లూరు చెరువులో 16.30కు 12.6 అడుగులు మాత్రమే నీరు నిల్వ ఉంది.

నాన్‌డెల్టా ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో క్రమంగా పడిపోతున్న భూగర్భజల మట్టాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, రాపూరు, తదితర మండలాల్లో భూగర్భజలం 10 మీటర్ల లోతుకు చేరుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మండలాల్లో ఖరీఫ్‌లో వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రబీసాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు.
 
 రబీ సాగు విస్తీర్ణం :

 పంట            సాధారణ విస్తీర్ణం            {పస్తుత విస్తీర్ణం
                         హెక్టార్లు
 1.వరి              1,98,295                   12029
 2.జొన్న                   961                          30
 3.సజ్జ                        38                            0
 4.రాగి                        81                           0
 5.మొక్కజొన్న        1056                       42
 6.కంది                      202                      56
 7.పెసర                    3686                4137
 8.మినుము             27316           12,189
 9.ఉలవ                          94                      0
 10.వేరుశనగ              4910                     0
 11.నువ్వులు                 891                  16
 12.పొద్దుతిరుగుడు      2257                   33
 13.పచ్చిశనగ           10070                     0
 14.అలసంద                  106                   30
 15.పత్తి                        1751                  35
 16.మిరప                    1396                502
 17.చెరకు                     7106                    0
 18.ఆనియన్                       1                    0
 19.పొగాకు                11334              3026
 20.కూరగాయలు          1921               618  
 21.ఇతర పంటలు          2953                 56
 మొత్తం                   2,76,425         32,794

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement