కరువు కాలం | Drought in district continues | Sakshi
Sakshi News home page

కరువు కాలం

Published Fri, Aug 7 2015 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

కరువు కాలం

కరువు కాలం

చెరువు కింది పొలం బీడువోయింది ఆబాది జమ్మికుంటకు చెందిన దొడ్డె ముధునయ్య కొన్నేళ్లుగా స్థానిక నాయిని చెరువు కింద ఉన్న మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. చెరువు నిండినప్పుడు పంటలు బాగా పండేవి. ఈ సంవత్సరం వానల్లేక కౌలుకు తీసుకున్న పొలాన్ని బీడుగా వదిలేశాడు. గుండ్ల చెరువు కింద రెండెకరాలుండగా, అందులో ఎకరం పొలం సాగు చేసి, మరో ఎకరం బీడుగా ఉంచాడు. మరో చోట ఎకరం పత్తి వేస్తే మొక్కలు వాలిపోతున్నారుు. హైదరాబాద్‌లో చదువుతున్న కొడుకు అనూప్ ఖర్చుల కోసం అప్పు చేశాడు. ఇప్పటికే అప్పు రూ.3లక్షలు దాటిందని, ఇళ్లు గడవడం ఇబ్బందవుతోందని వాపోతున్నాడు.
 
- కనికరించని వరుణుడు
- అడుగంటిన భూగర్భజలాలు
- వెలవెలబోతున్న ప్రాజెక్ట్‌లు
- ఎండిపోతున్న పంటలు
- ఆగస్టుపైనే ఆశలు    

సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ అగ్రికల్చర్ : కరీంనగర్ జిల్లాను కాలం పగబట్టినట్లుంది. వానల్లేక వరి పైర్లు ఎండిపోతున్నాయి. మక్క పంటమాడిపోతోంది. సోయా సాగు పడకేసింది. పత్తి చేను నీళ్ల కోసం నోరు తెరిచింది. ఫలితంగా అన్నపూర్ణగా వినుతికెక్కిన కరీంనగర్ జిల్లాను కరవుఛాయలు కమ్మేస్తున్నాయి. అన్నదాత అరిగోస ఇక చెప్పనక్కర్లేదు. జూన్ మొదటి వారం నుంచి కార్తెలు కరిగిపోతున్నా వరుణదేవుడు కనికరించకపోవడంతో అన్నదాతలు ఆకాశంవైపు దిగాలుగా చూస్తున్నారు. వేలాది రూపాయలు అప్పులు తెచ్చి వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఖరీఫ్ సీజన్‌లో లక్షన్నర హెక్టార్లలో పంటలే వేయలేదు.

వేసిన వాటిలోనూ సగానికిపైగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. నెలాఖరులోగా వానలు పడకపోతే మిగిలిన వాటి పరిస్థితి ఆగమ్యగోచరమే. రైతులు పరిస్థితిని తలుచుకుంటూ ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. కొందరు ఆత్మహత్య బాట పడుతుండగా,  మరికొందరు ఉన్న ఊరును వదిలేసి బతుకు దెరువు కోసం వలసబాట పడుతున్నారు.
 
ఇదీ సాగు పరిస్థితి...
జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు 463 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 341 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సగటున 26 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో కాటారం, కమలాపూర్ మండలాల్లోనే అధిక వర్షం నమోదు కాగా, 18 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. 35 మండలాల్లో లోటు వర్షం నమోదయ్యింది. గంభీరావుపేట, మేడిపల్లి మండలాల్లో అత్యంత లోటు వర్షం కురిసింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణ సాగు 5,14,662 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 3,66,387 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన లక్షన్నర హెక్టార్లలో అసలు పంటే వేయలేదన్నమాట. ఇక పంటల వారీ వివరాలను పరిశీలిస్తే... ప్రధానంగా 54,288 హెక్టార్లలో వరి, 23,0431 హెక్టార్లలో పత్తి, 49,524 హెక్టార్లలో మొక్కజొన్న 10,941 హెక్టార్లలో సోయా తదితర పంటలు సాగులో ఉన్నాయి. వానల్లేకపోవడంతో సుమారు 20 వేల హెక్టార్లలో వరి, 15 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 5 వేల హెక్టార్లలో సోయా పంటలకు నష్టం కలిగింది.
 
ఆశలన్నీ ఆగస్టుపైనే...
పత్తి పంట పెరిగే దశలో చుక్క నీరందక సకాలంలో ఎరువులు వేయలేని దుస్థితి ఎదురయ్యింది. ఎకరాకు రూ.15వేల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. నేల ఎండిపోయి కలుపుతీయడానికి వీలుకావడం లేదు. మరోవైపు వరినార్లు ఎండిపోతుండగా, పొలాలు బీడువారిపోతున్నారుు. ఎర్రమట్టి, దుబ్బనేలలో పంటలు మరింత దయనీయంగా ఉన్నారుు. వ్యవసాయ బావుల కింద సాగు చేసిన వరి పొలాలు సైతం భూగర్భజలాలు లేక ఎండిపోయే దుస్థితి వచ్చింది. వానలు లేక మొక్కజొన్న పంటలు కూడా ఎండిపోయే దశకు చేరుకున్నారుు. పలు ప్రాంతాల్లో బిందెలతో నీళ్లు తెచ్చి పత్తి పంటకు నీళ్లు చల్లుతూ కాపాడుకుంటున్నారు. మరో పది రోజుల్లో వర్షాలు పడితే పత్తి పంట ఎదుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వానలు కురవకపోవడంతో ప్రత్నామ్నాయ పంటల వైపు మళ్లించడంలో జిల్లా వ్యవసాయ శాఖ విఫలమైంది. వర్షాల కోసం ఆగస్టు నెలపైనే భారం వేసిన రైతాంగం వరుణుడు మొఖం చాటేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. పశువులకు తాగునీరు, పచ్చి మేతకు కూడా కొరత ఏర్పడుతోంది.
 
ప్రాజెక్టులు వెలవెల...
జిల్లాకు ఆధారమైన ప్రాజెక్ట్‌లలో నీళ్లు లేక ఖరీఫ్ పంటలకు చుక్క కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలకు ప్రస్తుతం 7.13 టీ ఎంసీలుంది. గతేడాది ఇదే సమయానికి 23.93 టీఎంసీలుంది. ఎల్‌ఎండీలో 24 టీఎంసీలకు 4.041 టీఎంసీలుండ గా గతేడాది 9.255 టీఎంసీలుంది. ఇది కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాలకు తాగునీటికి సైతం సరిపోదు. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 7.1 టీఎంసీలుంది. నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరడంతో పాటు భూగ ర్భ జలాలు అడుగంటి పోయి జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సగటున 10.11 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడిపోయింది. అధికంగా గంగాధరలో 20.8 మీటర్ల లోతుకు పడిపోయాయి.
 
కరువు కాటుకు వలసలకు బాట
హుస్నాబాద్, వేములవాడ  సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతాంగం కరవు దెబ్బకు వలసబాట పడుతున్నారు. అప్పుతెచ్చి పంట వేసినా నీళ్లు లేక కళ్ల ముందే ఎండిపోతుండటంతో బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు తండాల్లో ఏ ఇంటికి వెళ్లినా తాళాలే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో కళకళలాడే గ్రామాలు నేడు జీవకళ లేక నిర్మాణుష్యంగా మారాయి.
 
నష్టపరిహారం చెల్లించాలి
నాకున్న నాలుగు ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. ఇప్పుడు రెండెకరాలకు మాత్రమే నీరు పారుతాంది. పెట్టిన పెట్టుబడులు నష్టపోవటమే అనిపిస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
- కొండం సంపత్‌రెడ్డి,
పెద్దపాపయ్యపల్లి, హుజూరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement