
మూగజీవులపై ప్రతాపం
జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు.
పశువులను కబేళాకు తరుముతున్న కరువు
పశ్చిమ మండలాల్లో ఎండిన బోర్లు
తాగునీటికి..గ్రాసానికి కొరత
గత్యంతరం లేక కబేళాకు పశువులు
అల్లాడిపోతున్న పాడి రైతులు
జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. మనుషులకే తాగేందుకు నీళ్లు దొరక్క అవస్థలు పడేచోట మూగజీవాలు విలవిల్లాడుతున్నాయి. క్షామదేవత వికృత విన్యాసాలు చేస్తుంటే పాడిరైతులు అల్లాడిపోతున్నారు. వాగులు, వంకలు, భూగర్భజలాలు అడుగంటిపోయి చుక్క నీరు దొరకడం కష్టమైంది. పశ్చిమ మండలాల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఈనేపథ్యంలో చేసేది లేక రైతులు మనసు చంపుకుని పాలివ్వని పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ఆర్థికంగా అండ గా నిలిచిన గొడ్లను అమ్ముకుం టుంటే సొంతమనిషిని కోల్పోయినట్టుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం 100 టన్నుల పశుగ్రాసం కొరత ఉంది.
చిత్తూరు, సాక్షి: కరువు రక్కసి ప్రభావం పశ్చిమ మండలాల్లోనే అధికంగా ఉంది. పూట గడవడమే కనాకష్టమయ్యే సమయంలో పశుపోషణ భారమవుతోంది. చేసేది లేక పశువులను తెగనమ్ముకుంటున్నారు. పాలిచ్చేవాటిని రక్షించుకోడానికి వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి గడ్డి తెచ్చుకుంటున్నారు. మండలా ల్లో ఇప్పటికే వేలాది బోర్లు ఎండిపోయాయి. కాసిన్ని నీళ్లు విదిల్చే బోర్లపై ఆధారపడి గ డ్డిని పెంచుకుంటున్నారు. ఇవి కూడా ఈనెలాఖరుకు ఎండిపోయే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. జీవాలకు మేత దొరక్క జిల్లా మొత్తం తిరుగుతున్నామని మ దనపల్లి మండలం గొల్లపల్లికి చెంది న నాగరాజన్న చెప్పారు. రెండు నెలల నుంచి తిరుగుతున్నా గడ్డి ఉన్నవాటిని ఎలా రక్షించుకోవాలో అర్థం కాలేదన్నారు.
ఏప్రిల్, మేలో ఎలా..?
మార్చి నెలలోనే ఇలా ఉంటే భాను డు విశ్వరూపం చూపే ఏప్రిల్, మేనెలల్లో పశుపోషణ ఎలా అని అన్నదాత దిగులు చెందుతున్నారు. ఖరీఫ్, రబీలో పంటలు చేతికందకపోవడంతో గడ్డిపోచ దొరకడం కూడా మృగ్యమైంది. ఉన్న కొద్దిపాటి గడ్డి ధర చుక్కలను తాకుతుండటంతో కొనే స్థితిలో లేమని పాడి రైతులు అంటున్నారు. జనవరిలో టన్ను గడ్డి ధర‡ రూ.1,500లు ఉండగా ఇప్పుడు రూ.2,500లు నుంచి రూ.3,000లు వరకు పలుకుతోంది. తూర్పు మండలాలల్లో తగినంత గడ్డి ఉన్నా అక్కడకూడా పాడి రైతులు అధికంగా ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్న జిల్లా వెనుకబడే అవకాశం ఉంది. మేత దొరక్క ఇప్పటికే రెండు పశువులను అమ్ముకున్నామని రామసముద్రం మండలం వనగానిపల్లెకు చెందిన రమణారెడ్డి చెప్పారు. తాగేందుకే నీరు దొరక్క ఇబ్బందులు పడుతుంటే గొడ్లకు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
మేలుకోని ప్రభుత్వం
జిల్లాలో కరువు వల్ల పశుగ్రాసం దొరకని పరిస్థితులు ఏర్పడ్డా ఇంతవరకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. కొన్నిచోట్ల గడ్డి విత్తనాలు పంచినా నీరు లేకపోవడంతో ఉపయోగించుకోలే ని స్థితి. తీవ్ర పశుగ్రాస కొరతను ఎదుర్కొనడానికి రూ.29 కోట్లు కేటాయిం చాలని జిల్లా పశుసంవర్ధ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు.