ప్రమాద ఘంటికలు! | A decrease in underground water | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘంటికలు!

Published Sat, Jan 7 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

ప్రమాద ఘంటికలు!

ప్రమాద ఘంటికలు!

నిజామాబాద్‌ : గణనీయంగా పెరిగిన భూగర్భ నీటిమట్టం తగ్గుదల షురువైంది. ఆయా ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో నీటి వినియోగం    పెరగడంతో భూగర్భ నీటి మట్టం పడిపోవడం ప్రారంభమైంది. గత నెల నవంబర్‌తో పోల్చితే కొన్ని మండలాల్లోనైతే తీవ్ర స్థాయిలో     పడిపోవడం మళ్లీ ఆందోళనకు దారితీస్తోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పాతాల గంగ పైపైకి వచ్చింది. అంతకు ముందు రెండేళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు 2016 సీజనులో కురిసిన వర్షాలకు భారీగా పెరిగాయి. ఏకంగా జిల్లా సగటున 7.10 మీటర్లకు పెరిగింది. గత నెలాఖరు (2016 డిసెంబర్‌) వరకు జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా నిజామాబాద్‌ డివిజన్‌లో 4.64 మీటర్లు ఉన్నాయి. ఆర్మూర్‌లో 6.57 మీటర్లు, బోధన్‌లో 10.95 మీటర్ల మేరకు నీటి మట్టం ఉంది. అంటే సగటున 7.10 మీటర్లకు పెరిగాయి. 2015 డిసెంబర్‌ జిల్లా సగటు 21.23 మీటర్లు ఉంది. అంటే 14.13 మీటర్లు పెరిగాయి. తాజాగా జిల్లాలో బోర్లు, బావుల్లో నీటి వినియోగం పెరిగింది. దీంతో పెరిగిన భూగర్భ జలాల మట్టం పడిపోవడం ప్రారంభమైంది. నిజామాబాద్‌ మండలం ముప్కాల్‌లో 2016 నవంబర్‌లో 9.88 మీటర్ల మేరకు నీటిమట్టం ఉండగా, డిసెంబర్‌ 31 నాటికి 11.40 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. అంటే ఒక్క నెలలోనే ఒకటిన్నర మీటర్లు పడిపోవడం గమనార్హం. అలాగే జక్రాన్‌పల్లి, వేల్పూర్, బోధన్, రెంజల్‌లలోనూ 1.5 మీటర్లకు పైగా పడిపోయాయి. భూగర్భ జల శాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 85 చోట్ల ఫీజో మీటర్లు ఏర్పాటు చేసి.. భూగర్భ జల మట్టాన్ని లెక్కిస్తోంది. వీటిలో ఐదు చోట్ల టెలీమీటర్లున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ టెలీ మీటర్లు ఉపగ్రహంతో అనుసంధానమై ఉంటాయి. ఎప్పటికప్పుడు భూగర్భ జలమట్టాన్ని కొలిచే ఈ టెలీమీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇలా జిల్లాలో ఐదు చోట్ల టెలీమీటర్లు పనిచేస్తున్నాయి.

ఇప్పటికీ ప్రమాద ఘంటికలే..
జిల్లాలో మొత్తం 29 మండలాలు కాగా, ఎనిమిది మండలాల్లో భూగర్భ నీటిమట్టం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ఎనిమిది మండలాల్లో జిల్లా సగటు నీటి మట్టం కంటే భారీగా పడిపోయింది. జిల్లా సగటు 7.10 మీటర్లు కాగా, ఈ ఎనిమిది మండలాల్లో పది మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి. మండలాలవారీగా పరిశీలిస్తే.. మాక్లూర్‌ మండలంలో 10.8 మీటర్లు, కోటగిరిలో 15.60 మీటర్లు, ఎడపల్లిలో 14.20 మీటర్లు, రెంజల్‌లో 12.03 మీటర్లు, రుద్రూర్‌లో 14 మీటర్లు, మోర్తాడ్‌లో 12.82 మీటర్లు, వేల్పూర్‌లో 10.50 మీటర్లు, ముప్కాల్‌లో 11.40 మీటర్ల లోతుకు పడిపోయాయి.

ఎనిమిది మండలాల్లో..
భూగర్భ జల శాఖ అధికారులు మిషన్‌ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల కింద కూడా నీటిమట్టాన్ని ప్రత్యేకంగా లెక్కిస్తున్నారు. ఈ పనులు చేపట్టిన చెరువుల కింద భూగర్భ జలాలు పెద్దగా పెరిగిన దాఖాలేవీ కనిపించడం లేదు. మిషన్‌ కాకతీయ ఫేజ్‌–1, ఫేజ్‌–2 కింద పనులు చేసిన మొత్తం తొమ్మిది చెరువుల కింద నీటి మట్టం వివరాలు అధికారులు సేకరించారు. రెండు నెలల క్రితం 2016 నవంబర్‌లో లెక్కించిన వివరాలిలా ఉన్నాయి.

ఆర్మూర్‌ మండలం చేపూర్‌ చెరువులో మిషన్‌ కాకతీయ మొదటి విడత కింద పనులు చేపట్టారు. ఈ చెరువు కింద (టీఐఎన్‌) నీటి మట్టం 5.29 మీటర్లు ఉండగా.. ఇదే గ్రామంలో చెరువు ప్రభావం ఉండని ప్రాంతంలో(ఎన్‌ఐజెడ్‌)లో 5.96 మీటర్లు ఉంది. అంటే ఈ చెరువు పనులు చేసినా ఒక్క మీటరు కూడా నీటి మట్టం పెరగలేదని భూగర్భ జలశాఖ నివేదికలే చెబుతున్నాయి. నామమాత్రంగా 0.67 మీటర్లు మాత్రమే పెరిగాయి.

మోర్తాడ్‌ మండలం దొన్కల్‌ పెద్ద చెరువు కూడా మొదటి విడతలో పనులు చేశారు. ఈ చెరువు కింద నీటిమట్టాన్ని పరిశీలిస్తే.. ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం (టీఐఎన్‌)లో 10.09 మీటర్ల లోతులో భూగర్భ నీటి మట్టం ఉంది. ఇదే గ్రామ శివారులో ఈ చెరువు ప్రభావితం లేని ప్రాంతంలో మాత్రం 9.76 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని భూగర్భ జలశాఖే నిర్దారించింది. అంటే ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం కంటే ఈ చెరువు ప్రభావం లేని ప్రాంతంలో నీటి మట్టం పైపైకి రావడం గమనార్హం. ఈ రెండు ఉదాహరణలు చాలు జిల్లాలో మిషన్‌కాకతీయ పథకం ఏ మేరకు ఫలితాలనిచ్చిందో చెప్పడానికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement