Underground water
-
Telangana: సచివాలయం కింద చెరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయం సకల హంగులతో సిద్ధమవుతోంది. భవనం భూగర్భంలో ఏకంగా ఓ మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. రెండున్నర లక్షల లీటర్ల సామర్ధ్యంతో ఈ స్టోరేజీ ట్యాంకును సిద్ధం చేశారు. మరోవైపు సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేయబోతున్నారు. ఇందుకోసం భవనం రూఫ్ టాప్‌లో భారీ సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సచివాలయం ప్రధాన ద్వారం ముందు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. వేయి అడుగుల పొడవుండే ఈ రోడ్డు చివరలో రెండు వరసల్లో ఏకంగా 300 కార్లను నిలిపి ఉంచేలా పార్కింగ్ వసతి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం వచ్చే నెల 17న ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలుండగా, ప్రాంగణంలోనూ మరిన్ని ప్రత్యేకతలు జోడించారు. వెరసి ఇదో ప్రత్యేక నిర్మాణంగా నిలవనుంది. వాన నీటిని ఒడిసిపట్టేలా.. వాన నీటిని ఒడిసి పట్టేందుకు వీలుగా సచివాలయం కింద రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని ఇందులోకి తరలించేందుకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయంలో దాదాపు 9 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పచి్చక బయళ్లుంటాయి. భవనం ముందు వైపు రెండు వైపులా మూడెకరాల చొప్పున రెండు, మధ్య కోర్ట్‌యార్డు, ఇతర ప్రాంతాల్లో కలిపి మరో మూడెకరాల మేర లాన్లుంటాయి. వాటి నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుంది. భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచి్చకబయళ్లకు వాననీటిని వాడే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. బయట రోడ్డు లెవల్ కంటే సచివాలయం ప్రాంగణం బేస్ ఐదడుగుల ఎత్తున ఉంటుంది. దాని మీద భవన నిర్మాణం జరిగింది. దీంతో ఎక్కడా వాననీరు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. పార్కింగ్‌కు వీలుగా రోడ్డు విస్తరణ సచివాలయ ప్రధాన ద్వారం ముందున్న రోడ్డును వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా ఫుట్‌పాత్‌పై ఉన్న దాదాపు 40 చెట్లను తొలగించనున్నారు. ఈ మేరకు సంబంధిత కమిటీ అనుమతి ఇచ్చింది. ఆ చెట్లను సంజీవయ్య పార్కులో (ట్రాన్స్‌లొకేట్) తిరిగి నాటనున్నారు. కాగా సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు లోపల విశాలమైన పార్కింగ్ యార్డులున్నాయి. అవి సరిపోని పక్షంలో, ఈ వంద అడుగుల రోడ్డు చివరలో నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సాయంత్రం వేళ సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు ప్రస్తుతం పార్కింగ్ ఇబ్బందులున్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ కొత్త రోడ్డులో రెండు వరుసల్లో 300 కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సౌర వెలుగులు పది లక్షల చదరపు అడుగుల సువిశాల భవనంలో వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వినియోగం ఉంటుంది. దీంతో కరెంటు ఖర్చు ఎక్కువే అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమేర పొదుపు చేసేందుకు సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భవనం రూఫ్‌టాప్‌లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవనాన్ని ప్రారంభించిన తర్వాత వీటి ఏర్పాటు మొదలు పెడతారు. ఇందుకోసం ఓ కన్సల్టెంటును కూడా నియమిస్తున్నారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
రాజధానిలోనే అధిక నీటి వినియోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తంలో రాజధాని హైదరాబాద్ భూగర్భ జలాల వినియోగంలో తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఏకంగా భూగర్భ జల వినియోగం 341 శాతంగా ఉంది. రాష్ట్ర సరాసరి వినియోగం 65 శాతం ఉండగా, దానికి ఐదింతలు ఎక్కువగా హైదరాబాద్‌లో వినియోగం ఉన్నట్లు భూగర్భజల శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో మల్కాజ్గిరి (94 శాతం), సిద్దిపేట (94 శాతం), మేడ్చల్ (92 శాతం), వరంగల్ అర్బన్ (91శాతం)గా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ భూగర్భ జల శాఖ, కేంద్ర జల వనరుల సంస్థల సమన్వయంతో రాష్ట్రంలో భూగర్భ జల వనరులు 2016–17 నీటి సంవత్సరానికి సంబంధించిన నివేదికను రూపొందించాయి. ఈ నివేదికను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్, భూగర్భజల శాఖ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మద్నూర్‌లు విడుదల చేశారు. రాష్ట్రాన్ని మొత్తంగా 502 గ్రౌండ్ వాటర్ బేసిన్లుగా విభజించి భూగర్భ జలాలను అంచనా వేశారు. ఇందులో 29 బేసిన్లు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నట్లు తేల్చారు. 8,584 మండలాలకు 70 మండలాలు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అత్యధిక నీటి వినియోగం ఉన్న ప్రాంతాలు, మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా జోషి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
అడుగంటుతున్న భూగర్భ జలాలు
జిల్లాల్లో భూగర్భ జల మట్టంవేగంగా పడిపోతోంది. బోరుబావులు బోరుమంటున్నాయి. తాగునీటి వనరులు అడుగంటిపోతున్నాయి. పల్లెల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే 4.22 మీటర్ల లోతులోకి పడిపోగా, గతనెలతో పోల్చితే 1.17 మీటర్ల లోతులోకి వెళ్లింది. కొల్చారం మండల పరిధిలోని రంగంపేట గ్రామంలో ఏకంగా 40.05 మీటర్ల లోతులోకి జలమట్టం పడిపోయింది. వ్యవసాయ బోరు బావులు వట్టిపోతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే చాలాచోట్ల రైతులు పంటపొలాలను పశువుల మేతకు వదిలేశారు. –మెదక్‌జోన్ వరుస కరువుకాటకాలతో నీటివనరులు అడుగంటాయి. సాగునీరుకాదు కదా తాగునీరు సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఎన్నడూ లేనివిధంగా జిల్లాపై నిప్పుల వాన కురుస్తోంది. ఏకంగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. భూగర్భజలాలు అందనంత లోతుకి పడిపోయాయి. అత్యధికంగా కొల్చారం మండలంలో ఏకంగా 40.01 మీటర్ల లోతులోకి నీటిమట్టం పడిపోయంది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 4.22 మీటర్ల లోతులోకి పడిపోగా గతనెలతో పోల్చితే 1.17 మీటర్ల లోతులోకి పడిపోయింది. జిల్లావ్యాప్తంగా 95 వేల బోరుబావులు ఉండగా ఇప్పటికే 80 శాతం బోర్లు మూలన పడ్డాయి. తాగునీటికి సైతం కష్టమొచ్చింది. పశుపక్షాదులకు సైతం నీరు దొరక్క అడవి జంతువులు రోడ్లపైకి వస్తూ ప్రమాదాలకు గురవుతూ మృత్యువాత పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,660 చెరువులు, కుంటలు ఉండగా ఒకటి రెండింటిలో కొద్దిపాటి నీరు తప్ప ఎందులోనూ చెప్పుకోదగ్గ నీరులేదు. ఈ యేడు రబీసీజన్‌లో కొన్ని మండలాల్లో బోర్ల నుంచి కొద్దిపాటి నీరురావడంతో వాటి ఆధారంగా 15,338 హెక్టార్లలో పంటలను సాగుచేశారు. పంటలు చేతికందే సమయంలో బోర్లలో పూర్తిగా నీరు ఇంకిపోవడంతో సాగుచేసిన పంటల్లో సగానికిపైగా ఎండిపోయాయి. ఫలితంగా రైతులకు పెట్టుబడిసైతం చేతికందని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరంకన్నా 4.47 మీటర్ల లోతులో.. గత సంవత్సరం మార్చి–ఏప్రిల్‌తో పోల్చుకుంటే 4.22 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి. గత ఏడాది కొల్చారం మండలం రంగంపేటలో 35.58 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా ఈఏడాది 40.05 మీటర్ల లోతులోకి పడిపోయాయి. మొత్తంగా జిల్లాలో మార్చి నెలలో 21.85 మీటర్ల లోతులో నీటిమట్టం ఉండగా ఏప్రిల్‌లో ఏకంగా 23.02 మీటర్లకు పడిపోయింది. ఈ లెక్కన 1.17 మీటర్ల లోతులోకి పడిపోయింది. ప్రమాదకరస్థాయిలో కొల్చారం మండలం భూగర్భజలాలు అత్యధికంగా పడిపోయిన వాటి లో అట్టడుగు స్థానంలో కొల్చారం మండలం ఉంది. ఈ మండల పరిధిలోని రంగంపేట గ్రామంలో ఏకంగా 40.05 మీటర్ల లోతులోకి నీరు పడిపోయింది. ఫలితంగా ఈ గ్రామంలో ఎక్కడ చూసినా తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో నీటిఊటలు అడుగంటి పోవడంతో వ్యవసాయం పూర్తిగా మానేయాల్సిన పరిస్థితి నెలకొంది. రెండో స్థానంలో టేక్మాల్, తూప్రాన్ మండలాలు ఉన్నాయి. టేక్మాల్ మండలంలో 38.19 మీటర్ల లోతులోకి నీటి ఊటలు పడిపోగా తూప్రాన్ మండలంలో 37.60 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. -
ఉపాధి పనుల జోరు
సాక్షి,మక్తల్ :ఐదు రకాల ఫాంపాండ్స్ ఏర్పాటుకు ఉపాధి పథకం పనులను చేపడుతుంది. ఇందులో 20–20 సైజ్‌కు రూ.1లక్ష40వేలు, 9.5–9.5 రూ.82వేలు, 8 బై 8 రూ.71వేలు, 6 బై 6కు రూ.42 వేలు, 2 బై 2కు రూ.24 వేలు డబ్బులు వెచ్చిస్తారు. రైతులు తమ పొలాల్లో అతి తక్కువ భూమి ఒక అర గుంటలో ఈ నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఈ నిర్మాణం పూర్తయితే దీని ద్వారా వర్షపు నీటిని నిలువ చేయవచ్చు. తద్వారా నీరు భూమిలో భాగా ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి. అదే పనిగా వర్షం కురిస్తే నీటిని నిలువ చేసుకోవచ్చు. దీంతో పొలానికి ఈ నీటిని వినియోగించుకోవచ్చు. అదే విధంగా పొలాల్లో క్రిమిసంహారక మందులను వేసేందుకు ఈ నీటి ద్వారా మందులను కలిపి పిచికారీ చేసి చల్లవచ్చు. దీంతో పాటు పశువుల దప్పికను తీర్చేందుకు ఈ నీటిని తాపవచ్చు. 15–20 రోజుల వరకు వర్షం పడని సమయంలో ఈ నీటిని పొలాలకు మల్లించుకోవచ్చు. ఇన్ని ప్రయాజనాలు ఉన్న ఫాంపాండ్లను రైతులు తప్పనిసరి తమ పొలాల్లో నిర్మించుకునేటట్లు ఉపాధి పథకం ద్వారా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు.. ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో 8,390 జాబ్‌కార్డులు, 629 శ్రమశక్తి సంఘాలున్నాయి. ఇందులో ఈ ఏడాది 5 వేల నుంచి 6 వేల మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఫాంపాండ్స్, ఫీడర్ చానల్స్, మ్యాజిక్ షోఫిట్స్, కామన్ షోఫిట్స్( ఇంకుడు గుంతలు), క్యాటిల్షెడ్స్(పశువుల పాకాలు), డంపింగ్‌యార్డుల నిర్మాణాలు, వైకుంఠధామాలు, గ్రామ కంఠాల్లో కంప చెట్ల తొలగింపు, చెట్లు నాటడం మొదలైన పనులు చేపడుతున్నారు. ఇంటింటికి ఇంకుడుగుంత.. భూగర్భజలాలు అడుగంటుతున్న నేపథ్యంలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి అయితే గ్రామాల్లో, పట్టణాల్లో భూగర్భజలాలు బాగా వృద్ది చెంది బోర్లల్లో నీరు వస్తుందనేది ప్రభుత్వ లక్ష్యం. నీటి వినియోగం బాగా పెరిగిన దృష్ట్యా ఇంకుడు గుంతలు ఎంతో సత్పాలితాలు ఇస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి ఈ ఏడాది నిర్మాణాలను చేపట్టింది. చేపల చెరువు.. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చేపల చెరువుల నిర్మాణమొకటి. చేపల చెరువులకు రూ.96,500 కేటాయించింది. ఈ పనుల్లో సాముహిక చేపల చెరువు, వ్యక్తిగత చేపల చెరువుల నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందులో రైతులు మత్స్యకారులు ముందుకు వస్తే నిర్మాణాలను ఉపాధి పథకం ద్వారా చేపడుతుంది. ఇందులో రైతుకు ఉన్న నీటి వనరుల ద్వారా ఈ చెరువులో నీటిని నింపుకోవచ్చు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చేపలతో ప్రయోజనం కలుగుతుంది. 3వేల మందికి ఉపాధి కల్పించాలి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీకి 150 మందికి, మండలంలో 3వేల మందికి ఉపాధి కల్పించాలి. ఫాంపాండ్స్ నిర్మాణాలు ఎక్కువ చేపట్టాలన్నారు. దీంతో పాటు డంపింగ్‌యార్డులను గ్రామాల్లో చేపట్టి, మూడు సంవత్సరాలు ఉపాధి పథకం ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులను నియమించుకోని వారికి దినసరి కూలీ చెల్లించి చెత్తను తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. – రమేష్‌కుమార్, ఎంపీడీఓ, నర్వ -
భూగర్భ శోకం
బతుకుదెరువుకు సాగు లేదు.. బతుకుదామంటే తాగునీరు లేదు. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఏ మండలంలో చూసినా కనుచూపుమేరలో నీటి ఛాయలు కనిపించడం లేదు. రెండేళ్లుగా చినుకు రాలకపోవడంతో భూగర్భజలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. అత్యధికంగా కొల్చారం మండలంలో 40.10 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూగర్భ జలాలు లేక గతేడాది నుంచి జిల్లాలో సాగు కనిపించడం లేదు. ఎలా బతకాలో తెలియక ఇప్పటికే పలువురు రైతులు వలసబాట పట్టారు. ఇదిలా ఉంటే పల్లెల్లో తాగునీరందించే మోటార్లకు సైతం నీరందక ఎండిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెదక్‌జోన్: జిల్లాను కరువు వీడటం లేదు. ఇప్పటికే వర్షాలు కురువక చెరువులు, కుంటలు ఇతర వనరులు నోళ్లు తెరిచి నీటికోసం ఎదురు చూస్తున్నాయి. దీనికితోడు భూగర్భ జలాలు ఊహించనంత దూరంలోకి వెళ్లడంతో మనుషుల మనుగడకే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోను అత్యధికంగా కొల్చారం మండలంలో 40.10 మీటర్ల లోతులో పాతళగంగ ఉన్నట్లు గుర్తించారు. గతేడాదితో పోల్చితే 10 మీటర్లు లోతులోకి వెళ్లిపోయాయి. ఫలితంగా జిల్లాకు తాగు, సాగునీటి కష్టమొచ్చింది. జనవరి నెలలో చందాయిపేటలో 20.20 మీటర్ల దూరంలో ఉండగా ఫిబ్రవరిలో 23.40 మీటర్ల లోతులోకి పడిపోయాయి. నెలవ్యవధిలోనే ఏకంగా 3.20 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి. కొల్చారం మండలంలో 40.10 మీటర్లలోతులోకి నీటిమట్టాలు పడిపోవటంవటంతో ఆ మండలంలో ఇప్పటికే 70శాతం బోర్లు మూలనపడ్డాయి. ఈ యేడు ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షపాతం 739.4 సెంటీమీటర్లు నమోదు కావల్సి ఉండగా కేవలం 491.4 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణం కన్నా 40 శాతం తక్కువగా వర్షం కురిసింది. ఫలితంగా జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. దీంతో చెరువులు, కుంటలు వట్టిపోయాయి. అలాగే 89వేల బోరుబావులు రాత్రిపగలు తేడాలేకుండా నడిపించటంతో సగానికిపైగా బోర్లు ఇప్పటికే మూలనపడ్డాయి. దీంతో సాగుచేసిన పంటలు ఎండిపోవటంతో వాటిని దక్కించుకునే ప్రయత్నంలో అన్నదాతలు లెక్కకుమించి బోర్లు వేస్తూనే ఉన్నారు. దీంతో వందబోర్లు తవ్వితే 10 బోర్లలో కూడా కొద్దిపాటిగా నీరువచ్చే పరిస్థితి లేకుండాపోయింది. తాగు నీటికి రోడ్డెక్కే పరిస్థితి.. ఈ ఏడాది రబీసీజన్‌లో సాధారణ సాగు 38 వేల హెక్టార్లు కాగా కేవలం 15 వేల హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. 23 వేల హెక్టార్లు తక్కువ సాగు నమోదైంది. ఈ పంటలు కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. సరైన వర్షాలులేక జలాశయాల్లో నీటి జాడలేక పోవడంతో రైతులు విచ్చలవిడిగా బోర్లు తవ్వి భూమిలోపల నుంచి నీటిని నిరంతరంగా బోర్ల ద్వారా తోడేయడంతో భూగర్భ జలాలు అందనంతలోతులోకి వెళ్లిపోయాయి. కొల్చారం మండలంలో 40.10, అల్లాదుర్గంలో 39.90, పాపన్నపేట 27.68, నార్సింగ్ మండలంలో 28.30, రామాయంపేట మండలంలో 25.70 టేక్మాల్ మండలంలో 34.79 తూప్రాన్ 38.65 నీటిమట్టాలు నమోదయ్యాయి. సింగూర్‌లోనూ తగ్గడంతో తాగునీటికి కష్టమొచ్చింది. ముఖ్యంగా అనేక గిరిజన తండాల్లో ఇప్పటికే నీటికోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. -
ప్రమాద ఘంటికలు!
నిజామాబాద్ : గణనీయంగా పెరిగిన భూగర్భ నీటిమట్టం తగ్గుదల షురువైంది. ఆయా ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ నీటి మట్టం పడిపోవడం ప్రారంభమైంది. గత నెల నవంబర్‌తో పోల్చితే కొన్ని మండలాల్లోనైతే తీవ్ర స్థాయిలో పడిపోవడం మళ్లీ ఆందోళనకు దారితీస్తోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో పాతాల గంగ పైపైకి వచ్చింది. అంతకు ముందు రెండేళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు 2016 సీజనులో కురిసిన వర్షాలకు భారీగా పెరిగాయి. ఏకంగా జిల్లా సగటున 7.10 మీటర్లకు పెరిగింది. గత నెలాఖరు (2016 డిసెంబర్) వరకు జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా నిజామాబాద్ డివిజన్లో 4.64 మీటర్లు ఉన్నాయి. ఆర్మూర్‌లో 6.57 మీటర్లు, బోధన్‌లో 10.95 మీటర్ల మేరకు నీటి మట్టం ఉంది. అంటే సగటున 7.10 మీటర్లకు పెరిగాయి. 2015 డిసెంబర్ జిల్లా సగటు 21.23 మీటర్లు ఉంది. అంటే 14.13 మీటర్లు పెరిగాయి. తాజాగా జిల్లాలో బోర్లు, బావుల్లో నీటి వినియోగం పెరిగింది. దీంతో పెరిగిన భూగర్భ జలాల మట్టం పడిపోవడం ప్రారంభమైంది. నిజామాబాద్ మండలం ముప్కాల్‌లో 2016 నవంబర్‌లో 9.88 మీటర్ల మేరకు నీటిమట్టం ఉండగా, డిసెంబర్ 31 నాటికి 11.40 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. అంటే ఒక్క నెలలోనే ఒకటిన్నర మీటర్లు పడిపోవడం గమనార్హం. అలాగే జక్రాన్‌పల్లి, వేల్పూర్, బోధన్, రెంజల్లలోనూ 1.5 మీటర్లకు పైగా పడిపోయాయి. భూగర్భ జల శాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 85 చోట్ల ఫీజో మీటర్లు ఏర్పాటు చేసి.. భూగర్భ జల మట్టాన్ని లెక్కిస్తోంది. వీటిలో ఐదు చోట్ల టెలీమీటర్లున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ టెలీ మీటర్లు ఉపగ్రహంతో అనుసంధానమై ఉంటాయి. ఎప్పటికప్పుడు భూగర్భ జలమట్టాన్ని కొలిచే ఈ టెలీమీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇలా జిల్లాలో ఐదు చోట్ల టెలీమీటర్లు పనిచేస్తున్నాయి. ఇప్పటికీ ప్రమాద ఘంటికలే.. జిల్లాలో మొత్తం 29 మండలాలు కాగా, ఎనిమిది మండలాల్లో భూగర్భ నీటిమట్టం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ఎనిమిది మండలాల్లో జిల్లా సగటు నీటి మట్టం కంటే భారీగా పడిపోయింది. జిల్లా సగటు 7.10 మీటర్లు కాగా, ఈ ఎనిమిది మండలాల్లో పది మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి. మండలాలవారీగా పరిశీలిస్తే.. మాక్లూర్ మండలంలో 10.8 మీటర్లు, కోటగిరిలో 15.60 మీటర్లు, ఎడపల్లిలో 14.20 మీటర్లు, రెంజల్లో 12.03 మీటర్లు, రుద్రూర్లో 14 మీటర్లు, మోర్తాడ్‌లో 12.82 మీటర్లు, వేల్పూర్‌లో 10.50 మీటర్లు, ముప్కాల్‌లో 11.40 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఎనిమిది మండలాల్లో.. భూగర్భ జల శాఖ అధికారులు మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల కింద కూడా నీటిమట్టాన్ని ప్రత్యేకంగా లెక్కిస్తున్నారు. ఈ పనులు చేపట్టిన చెరువుల కింద భూగర్భ జలాలు పెద్దగా పెరిగిన దాఖాలేవీ కనిపించడం లేదు. మిషన్ కాకతీయ ఫేజ్–1, ఫేజ్–2 కింద పనులు చేసిన మొత్తం తొమ్మిది చెరువుల కింద నీటి మట్టం వివరాలు అధికారులు సేకరించారు. రెండు నెలల క్రితం 2016 నవంబర్‌లో లెక్కించిన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ మండలం చేపూర్ చెరువులో మిషన్ కాకతీయ మొదటి విడత కింద పనులు చేపట్టారు. ఈ చెరువు కింద (టీఐఎన్) నీటి మట్టం 5.29 మీటర్లు ఉండగా.. ఇదే గ్రామంలో చెరువు ప్రభావం ఉండని ప్రాంతంలో(ఎన్ఐజెడ్)లో 5.96 మీటర్లు ఉంది. అంటే ఈ చెరువు పనులు చేసినా ఒక్క మీటరు కూడా నీటి మట్టం పెరగలేదని భూగర్భ జలశాఖ నివేదికలే చెబుతున్నాయి. నామమాత్రంగా 0.67 మీటర్లు మాత్రమే పెరిగాయి. మోర్తాడ్ మండలం దొన్కల్ పెద్ద చెరువు కూడా మొదటి విడతలో పనులు చేశారు. ఈ చెరువు కింద నీటిమట్టాన్ని పరిశీలిస్తే.. ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం (టీఐఎన్)లో 10.09 మీటర్ల లోతులో భూగర్భ నీటి మట్టం ఉంది. ఇదే గ్రామ శివారులో ఈ చెరువు ప్రభావితం లేని ప్రాంతంలో మాత్రం 9.76 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని భూగర్భ జలశాఖే నిర్దారించింది. అంటే ఈ చెరువు కింద ఉన్న ప్రాంతం కంటే ఈ చెరువు ప్రభావం లేని ప్రాంతంలో నీటి మట్టం పైపైకి రావడం గమనార్హం. ఈ రెండు ఉదాహరణలు చాలు జిల్లాలో మిషన్‌కాకతీయ పథకం ఏ మేరకు ఫలితాలనిచ్చిందో చెప్పడానికి.. -
భూగర్భ జలంగా ఎలా మారుద్దాం!
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో కురిసే ప్రతి వర్షపు బొట్టు భూగర్భ జలంగా ఎలా మార్చాలో సాంకేతిక నిపుణులు ఆలోచించాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ చెప్పారు. శనివారం డిస్ట్రిక్ట్ రీఛార్జి వెల్ ప్రాజెక్టుపై కలెక్టరేట్లో నిర్వహించిన టెక్నికల్ మీట్లో ఆయన మాట్లాడారు. భూగర్బ జలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నీరు–చెట్టు, పంట సంజీవిని, ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమాలను భారీ ఎత్తున అమలు చేస్తోందని పేర్కొన్నారు. మరిన్ని వినూత్న ఆలోచనలతో వర్షపు నీటిని భూగర్బ జలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. రుతు పవనాలు సకాలంలో రాకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టి భూగర్బ జలాలు అడుగంటుతున్నాయన్నారు. దీంతో తాగు, సాగునీటి అవసరం పెరిగిందన్నారు. పడుతున్న వర్షపు నీటిలో 90 శాతం సముద్రం పాలవుతోందని చెప్పారు. మరికొంత ఆవిరి కావడం వల్ల తాగు, సాగనీటికి అవస్థలు తప్పడం లేదన్నారు. ప్రత్యామ్నాయ పద్దతులను కనుగొనాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. భూమి నుంచి వెలికి తీసి ఉపయోగించుకుంటున్న నీటి పరిమాణం కంటే ప్రస్తుతం నీటిని భూమిలో ఇంకించడానికి చేస్తున్న కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయని వివరించారు. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జిల్లాలో 12 వేల ఫారంపాండ్లు నిర్మించామని తెలిపారు. చెరువుల్లో పూడికతీత, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెక్‌డ్యాముల నిర్మాణాల కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్బ జలమట్టం పెరిగిందన్నారు. పాపాఘ్ని నదిపై సబ్ సర్ఫేస్ డ్యాంల నిర్మాణం చేపడుతున్నామన్నారు. డిస్ట్రిక్ట్ రీఛార్జి వెల్ ప్రాజెక్టు కింద నీటి పరివాహక ప్రాంతాల్లో కొత్త పద్దతులతో ఏర్పాటు చేసి బోర్‌వెల్స్ విషయంపై మరింత విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సీనియర్ జియాలజిస్టు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ భూగర్బంలోని అంశాలను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలు బేరీజుతో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైవీయూ ప్రొఫెసర్ ఎంఆర్కే రెడ్డి మాట్లాడుతూ పాపాఘ్నిపై నిర్మించ తలిచిన సబ్ సర్ఫేస్ డ్యాంలను నీటి ప్రవాహపు వెడల్పు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మించడం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆర్‌డబ్లు్యఎస్ పర్యవేక్షక ఇంజనీరు సంజీవరావు, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీరు వరదరాజులు, జీఎన్ఎస్ఎస్ పర్యవేక్షక ఇంజనీరు వెంకటేశ్వరరావు, గ్రౌండ్ వాటర్ డెప్యూటీ డైరెక్టర్ వీర నారాయణ, ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ శంకర్‌రెడ్డి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ తిప్పేస్వామి, వ్యవసాయశాఖ జేడీ ఠాకూర్ నాయక్, ఏపీ ఎంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి, హార్టికల్చర్ డీడీ సరస్వతి, వైవీయూ ఎర్త్ సైన్స్ విద్యార్థులు, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. -
నీటిబొట్టు..విడిచిపెట్టు!
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: విస్తారంగా వర్షాలు కురిస్తే ఆ మేరకు భూగర్భ జలాలు పెరగడం సహజం. అయితే, మన దౌర్భాగ్యమేమిటో కానీ, సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనా.. భూగర్భ జల మట్టాలు పెరగకపోగా, తరిగిపోవడం గమనార్హం. ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు నరగంలో 280 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం (200 మి.మీ.) కంటే 80 మి.మీ. అధికం. కానీ వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అవసరమైన రీచార్జి పిట్స్ తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలాలు ఆశించిన మేరకు పెరగలేదు. గతేడాది సగటున 7.8 మిల్లీ మీటర్ల లోతున జల సిరి లభ్యం కాగా.. ఈసారి 7.39 మీటర్ల లోతునకు వెళ్లాయి. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్లో 60 శాతం మేర వర్షపు నీరు వృథాగా పోతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షపు నీరు వరద రూపం లో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో అదనంగా మరో 20 శాతం నీరు వృథా అవడం శాపంగా మారుతోంది. ఈ నీటిని భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో మూడు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. కానీ, ఆ నీటిని చేతులారా వదులుకున్న పాపం జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలదే. తగ్గిన భూగర్భ జలమట్టాలు.. గ్రేటర్ పరిధిలోని పలు మండలాల్లో గతేడాది జూన్ నెలాఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ చివరి నాటికి భూగర్భ జలమట్టాలు మరింత లోతునకు పడిపోయాయి. అమీర్‌పేట్ మండలంలో గతేడాది 18 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభించగా, ఈ సారి 18.85 మీటర్ల లోతునకు తవ్వాల్సిన పరిస్థితి. మిగతా ప్రాంతాల్లోనూ అంతే. ఉప్పల్, సైదాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లో స్వల్పంగా పెరగడం ఒకింత ఊరటనిస్తోంది. పాతాళగంగ పడిపోవడానికి కారణాలివే.. గ్రేటర్ పరిధిలో అపార్ట్మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. కానీ వర్షపు నీరు భూగర్భంలో ఇంకేందుకు అందుబాటులో ఉన్న రీచార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంతలు) పాతిక వేలు కూడా లేవు. దీంతో 60 శాతం వర్షపు నీరు వృథా అవుతోంది. భూగర్భ జలమట్టాలు పెంచేందుకు గతేడాది జీహెచ్ఎంసీ 10 వేలు, జల మండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటు చేసేందుకు వినియోగదారు ల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టా యి. కానీ తవ్వింది ఐదు వేలే. ఆయా శాఖల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. మహానగరంలో ప్రతి ఇళ్లు, కార్యాలయానికీ రీచార్జింగ్ పిట్స్ లేకపోవడంతో భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి. ఇంకుడు గుంత ఇలా ఉండాలి.. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర, 1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీయాలి. ఇందు లో 50 శాతం మేర 40 ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం ఇసుకను నింపాలి. మిగతాది ఖాళీగా ఉంచాలి. వ ర్షపు నీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేయాలి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుంది. జల కళ లేని జంట జలాశయాలు ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పటికీ జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు పెద్దగా నీరు రాలేదు. ఈ జలాశయాల్లో నీటి మట్టాలు గతేడాదితో పోలిస్తే ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న 84 గ్రామాల పరిధిలో ఆక్రమణలు పెరిగిపోవడం, ఇసుక తవ్వకాల నేపథ్యంలో ఇన్‌ఫ్లో బాగా తగ్గుముఖం పట్టడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు నాగార్జున సాగర్, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి మట్టాలు అనూహ్యంగా పెరగడంతో గ్రేటర్ తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులోకి వచ్చిందని జలమండలి వర్గాలు చెబుతున్నాయి.