నీటిబొట్టు..విడిచిపెట్టు!
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: విస్తారంగా వర్షాలు కురిస్తే ఆ మేరకు భూగర్భ జలాలు పెరగడం సహజం. అయితే, మన దౌర్భాగ్యమేమిటో కానీ, సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైనా.. భూగర్భ జల మట్టాలు పెరగకపోగా, తరిగిపోవడం గమనార్హం. ఈ ఏడాది జూలై నెలాఖరు వరకు నరగంలో 280 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం (200 మి.మీ.) కంటే 80 మి.మీ. అధికం. కానీ వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అవసరమైన రీచార్జి పిట్స్ తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలాలు ఆశించిన మేరకు పెరగలేదు.
గతేడాది సగటున 7.8 మిల్లీ మీటర్ల లోతున జల సిరి లభ్యం కాగా.. ఈసారి 7.39 మీటర్ల లోతునకు వెళ్లాయి. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్‌లో 60 శాతం మేర వర్షపు నీరు వృథాగా పోతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షపు నీరు వరద రూపం లో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో అదనంగా మరో 20 శాతం నీరు వృథా అవడం శాపంగా మారుతోంది. ఈ నీటిని భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో మూడు మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది. కానీ, ఆ నీటిని చేతులారా వదులుకున్న పాపం జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాలదే.
తగ్గిన భూగర్భ జలమట్టాలు..
గ్రేటర్ పరిధిలోని పలు మండలాల్లో గతేడాది జూన్ నెలాఖరుతో పోలిస్తే ఈ ఏడాది జూన్ చివరి నాటికి భూగర్భ జలమట్టాలు మరింత లోతునకు పడిపోయాయి. అమీర్‌పేట్ మండలంలో గతేడాది 18 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభించగా, ఈ సారి 18.85 మీటర్ల లోతునకు తవ్వాల్సిన పరిస్థితి. మిగతా ప్రాంతాల్లోనూ అంతే. ఉప్పల్, సైదాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లో స్వల్పంగా పెరగడం ఒకింత ఊరటనిస్తోంది.
పాతాళగంగ పడిపోవడానికి కారణాలివే..
గ్రేటర్ పరిధిలో అపార్ట్‌మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. కానీ వర్షపు నీరు భూగర్భంలో ఇంకేందుకు అందుబాటులో ఉన్న రీచార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంతలు) పాతిక వేలు కూడా లేవు. దీంతో 60 శాతం వర్షపు నీరు వృథా అవుతోంది.
భూగర్భ జలమట్టాలు పెంచేందుకు గతేడాది జీహెచ్‌ఎంసీ 10 వేలు, జల మండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటు చేసేందుకు వినియోగదారు ల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టా యి. కానీ తవ్వింది ఐదు వేలే. ఆయా శాఖల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట.
మహానగరంలో ప్రతి ఇళ్లు, కార్యాలయానికీ రీచార్జింగ్ పిట్స్ లేకపోవడంతో భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి.
ఇంకుడు గుంత ఇలా ఉండాలి..
200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర, 1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీయాలి. ఇందు లో 50 శాతం మేర 40 ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం ఇసుకను నింపాలి. మిగతాది ఖాళీగా ఉంచాలి. వ ర్షపు నీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేయాలి. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుంది.
జల కళ లేని జంట జలాశయాలు
ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పటికీ జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు పెద్దగా నీరు రాలేదు. ఈ జలాశయాల్లో నీటి మట్టాలు గతేడాదితో పోలిస్తే ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న 84 గ్రామాల పరిధిలో ఆక్రమణలు పెరిగిపోవడం, ఇసుక తవ్వకాల నేపథ్యంలో ఇన్‌ఫ్లో బాగా తగ్గుముఖం పట్టడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు నాగార్జున సాగర్, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి మట్టాలు అనూహ్యంగా పెరగడంతో గ్రేటర్ తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులోకి వచ్చిందని జలమండలి వర్గాలు చెబుతున్నాయి.