భూగర్భ జలంగా ఎలా మారుద్దాం!
కడప సెవెన్‌రోడ్స్:
జిల్లాలో కురిసే ప్రతి వర్షపు బొట్టు భూగర్భ జలంగా ఎలా మార్చాలో సాంకేతిక నిపుణులు ఆలోచించాలని కలెక్టర్ కేవీ సత్యనారాయణ చెప్పారు. శనివారం డిస్ట్రిక్ట్ రీఛార్జి వెల్ ప్రాజెక్టుపై కలెక్టరేట్‌లో నిర్వహించిన టెక్నికల్ మీట్‌లో ఆయన మాట్లాడారు. భూగర్బ జలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నీరు–చెట్టు, పంట సంజీవిని, ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమాలను భారీ ఎత్తున అమలు చేస్తోందని పేర్కొన్నారు. మరిన్ని వినూత్న ఆలోచనలతో వర్షపు నీటిని భూగర్బ జలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. రుతు పవనాలు సకాలంలో రాకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టి భూగర్బ జలాలు అడుగంటుతున్నాయన్నారు. దీంతో తాగు, సాగునీటి అవసరం పెరిగిందన్నారు. పడుతున్న వర్షపు నీటిలో 90 శాతం సముద్రం పాలవుతోందని చెప్పారు. మరికొంత ఆవిరి కావడం వల్ల తాగు, సాగనీటికి అవస్థలు తప్పడం లేదన్నారు. ప్రత్యామ్నాయ పద్దతులను కనుగొనాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. భూమి నుంచి వెలికి తీసి ఉపయోగించుకుంటున్న నీటి పరిమాణం కంటే ప్రస్తుతం నీటిని భూమిలో ఇంకించడానికి చేస్తున్న కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయని వివరించారు. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జిల్లాలో 12 వేల ఫారంపాండ్లు నిర్మించామని తెలిపారు. చెరువుల్లో పూడికతీత, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెక్‌డ్యాముల నిర్మాణాల కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్బ జలమట్టం పెరిగిందన్నారు. పాపాఘ్ని నదిపై సబ్ సర్ఫేస్ డ్యాంల నిర్మాణం చేపడుతున్నామన్నారు. డిస్ట్రిక్ట్ రీఛార్జి వెల్ ప్రాజెక్టు కింద నీటి పరివాహక ప్రాంతాల్లో కొత్త పద్దతులతో ఏర్పాటు చేసి బోర్‌వెల్స్ విషయంపై మరింత విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సీనియర్ జియాలజిస్టు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ భూగర్బంలోని అంశాలను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలు బేరీజుతో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైవీయూ ప్రొఫెసర్ ఎంఆర్‌కే రెడ్డి మాట్లాడుతూ పాపాఘ్నిపై నిర్మించ తలిచిన సబ్ సర్ఫేస్ డ్యాంలను నీటి ప్రవాహపు వెడల్పు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మించడం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆర్‌డబ్లు్యఎస్ పర్యవేక్షక ఇంజనీరు సంజీవరావు, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీరు వరదరాజులు, జీఎన్‌ఎస్‌ఎస్ పర్యవేక్షక ఇంజనీరు వెంకటేశ్వరరావు, గ్రౌండ్ వాటర్ డెప్యూటీ డైరెక్టర్ వీర నారాయణ, ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ శంకర్‌రెడ్డి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ తిప్పేస్వామి, వ్యవసాయశాఖ జేడీ ఠాకూర్ నాయక్, ఏపీ ఎంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి, హార్టికల్చర్ డీడీ సరస్వతి, వైవీయూ ఎర్త్ సైన్స్ విద్యార్థులు, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.