సుండుపల్లి: ఇసుక రీచ్ ఇచ్చి తమ కడుపు కొట్టొద్దని ప్రజలు అధికారులను వేడుకున్నారు. వైఎన్‌పాలెం గ్రామ పంచాయతీలోని బహుదా నదిలో ఇసుక రీచ్ పరిశీలనకు గనుల శాఖ అధికారులు శుక్రవారం వచ్చారు. దీంతో వైఎన్ పాలెం కుప్పగుట్ట ప్రజలు కుప్పగుట్టపల్లిలో అధికారుల వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుండుపల్లి, రాయవరం ప్రాంతాల్లో రీచ్ ఏర్పాటు చేయడం వల్ల పైప్రాంతమైన కుప్పగుట్ట వైఎన్‌పాలెం, అడవిపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన ఇసుకంతా తరలిపోతుందని తెలిపారు.
రోజురోజుకు భూగర్భజలం అడుగంటిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగే పైప్రాంతంలో ఝరికోన ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో కింది ప్రాంతాలకు ఇసుక వచ్చే పరిస్థితి లేదని అన్నారు. వంకల్లో సైతం చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయడం వల్ల.. అక్కడి నుంచి ఇసుక రాదని తెలిపారు. కొండ, గుట్ట ప్రాంతాల్లో ట్రంచ్‌లు ఏర్పాటు చేయడం వల్ల కొద్ది మేర కూడా నదిలోకి రాదని పేర్కొన్నారు. ఇసుక లేకపోతే నదిలో నీరు నిల్వ ఉండదని, బోర్లు అన్నీ ఎండిపోతాయని అన్నారు. ఇప్పటికి బాగానే ఉన్నామని, రీచ్ ఇస్తే తమకు కష్టాలు మొదలైనట్లేనని అన్నారు. ఈ మేరకు వైఎన్‌పాలెం సర్పంచ్ రామునాయక్ ఆధ్వర్యంలో ప్రజలు గనుల శాఖ ఏడీ కొండారెడ్డికి అర్జీ ఇచ్చారు. ఇందులో మహాజన సోషలిస్టు పార్టీ మండలాధ్యక్షుడు వెంకటరమణ, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు నాగరాజ పాల్గొన్నారు.