పరిశ్రమల వ్యర్థాలు భూమిలోకి ఇంకడమే ప్రధాన కారణం
పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి
బెంగళూరు: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారిపోతున్నాయి. దీంతో మనిషికి సంజీవని లాంటి నీరే వ్యాధులను వ్యాపింపజేసే కారకంగా మారిపోతోంది. హానికారక రసాయనాలు భూగర్భజలాల్లో కలిసి పోతుండడంతో నగర జీవి ఆరోగ్యానికే ముప్పు వాటిల్లుతోంది. పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయకుండానే నగరంలోని సరస్సులలోకి వదులుతుండడం భూగర్భజలాలు విషతుల్యం కావడానికి ప్రధాన కారణమవుతోందని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. ఇదిలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో నగరంలోని భూగర్భ జలాలన్నీ పూర్తిగా గరళంగా మారి తాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. గార్డెన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో ప్రస్తుతం కాలుష్య భూతం తాండవమాడుతోంది. వాయు కాలుష్యం, శబ్దకాలుష్యం పెరిగిపోతున్నట్లుగానే పరిశ్రమల వ్యర్థాలు, సరస్సుల కబ్జాలతో భూగర్భ జలాలు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయి.
నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్, బెంగళూరు శాఖ జరిపిన పరిశోధనలో తేలింది. ప్రతి ఏడాది భూగర్భ జలాల పరిస్థితిపై సర్వే నిర్వహించే ఈ సంస్థ ఈ ఏడాది సైతం నగరంలోని భూగర్భజలాల పరిస్థితిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. భూగర్భ జలాల్లో ఏడాదికేడాదికి కాలుష్యం పెరిగిపోవడానికి భూ ఉపరితల కాలుష్యం పెరగడమే ప్రధాన కారణమని ఈ సర్వే వెల్లడించింది. తాగడానికి భూ ఉపరితల నీటిని కాకుండా భూ గర్భజలాల (భూమిలోపల పొరల్లో ఉన్న) పై ఎక్కువగా ఆధార పడటం వల్ల కూడా నగర జీవి మంచినీరు అనుకొని కాలుష్యంతో నిండిన నీటిని తీసుకుంటున్నట్లు సర్వే తెలిపింది.
పెరిగిన కాలుష్యం, తగ్గిన సరస్సులు...
పట్టణీకరణ పెరగడంతో ఐదేళ్ల కాలంలో నగర శివారు ప్రాంతంలో ఉన్న పలు పరిశ్రమలు జనావాసాల మధ్యకు వచ్చాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలి. ఈ వ్యర్థాలను జనావాసాలకు దూరంగా పారవేయాలి. ఇందుకు కర్నాటక కాలుష్య నియంత్రణ మండలి (కేపీసీబీ) నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించింది. అయితే నగరంలో ఈ నిబంధనలు అమలైన దాఖలాలు కనిపించడం లేదు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే బయటికి వదులుతున్నారు పరిశ్రమల యజమానులు. దీంతో అవి భూగర్భంలోకి ఇంకిపోయి, జలాలు అత్యంత విషతుల్యమౌతున్నాయి. కాగా, ఐదేళ్ల క్రితం వరకూ బీబీఎంపీ పరిధిలో 294 సరస్సులు ఉండేవి. క్లోరిఫికేషన్, స్ప్రింకలైజేషన్ తదితర పద్ధతులను ఉపయోగించి ఈ సరస్సుల నీటిని తాగునీరుగా మార్చి ప్రభుత్వం సరఫరా చేసేది. పట్టణీకరణ పెరగడం, రియల్ ఎస్టేట్ బూమ్ ఉండడంతో సరస్సులు కూడా ఆక్రమణకు గురయ్యాయి. దీంతో సరస్సులన్నీ మైదాన ప్రాంతాలుగా మారిపోయి అపార్ట్‌మెంట్‌లు వెలిశాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీబీఎంపీ కూడా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడానికి ఎక్కువగా భూ గర్భ జలాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులన్నింటి కారణంగా నగరంలోని భూగర్భజలాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎక్కువ పరిమాణంలో కాలుష్య కారకాలు చేరుకున్నాయి. గత ఏడాది ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ జరిపిన సర్వేలో ఎస్.జీ నగర్ ప్రాంతంలో ఒక లీటర్ నీటిలో 375మిల్లీగ్రాముల నైట్రేట్ నమోదు కాగా ఈఏడాది నైట్రేట్ పరిమాణం 402మిల్లీగ్రాములకు చేరుకుంది. అదే విధంగా బిదరహళ్లిలో ఒక లీటర్ నీటిలో 4.49మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉన్నట్లు నమోదు కాగా ఈ ఏడాది ఫ్లోరైడ్ పరిమాణం 5.97మిల్లీగ్రాములకు పెరిగింది.
కాలుష్య నియంత్రణ మండలి విఫలమైంది......
భూగర్భ జలాల పరిరక్షణలో కాలుష్య నియంత్రణ మండలి పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కాలుష్య నియంత్రణ మండలి తరచుగా నగరంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని పర్యావరణ నిపుణులు ఎస్.విశ్వనాథ్ తెలిపారు. ‘తరచుగా తనిఖీలు జరిగినపుడే పరిశ్రమల యజమానులు పరిశ్రమ వ్యర్థాలను జనావాసాల మధ్యకాక శుద్ధిచేసి దూరంగా పడేసేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రస్తుతం నగరంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. యజమాన్యాలు వ్యర్థాలను శుద్ధిచేయకుండానే దగ్గరలోని సరస్సుల్లోకి వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిశ్రమలపై, సరస్సుల కబ్జాపై దృష్టి సారించాలి. లేదంటే మరో 20 ఏళ్లలో భూగర్భ జలాలన్నీ విషంగా మారి తాగడానికి నీరే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది’ అని అన్నారు.