కందకాలు తవ్వుదాం.. కదలిరండి
► జల సిరుల కోసం ‘సాక్షి’ ఉద్యమం
► రేపు మదనపల్లె, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు సదస్సులు
► నిపుణులు, అనుభవజ్ఞుల ద్వారా సూచనలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయ క్షేత్రాల్లో జల సిరుల సంరక్షణే లక్ష్యంగా ‘సాక్షి’ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రైతులను సమీకరించి వర్షపు నీటి పరిరక్షణకు దోహదపడే కందకాల తవ్వకాలపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కలిగిం చి ఆ దిశగా అన్నదాతలను కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం మదనపల్లి, తంబళ్లపల్లెలో ప్రత్యేక రైతు అవగాహన సదస్సులను నిర్వహించనుంది. వర్షపునీటి సంరక్షణలో అనుభవజ్ఞులు, రిటైర్డ్ ఇంజినీర్లతో రైతులకు తగిన సూచనలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసింది.
చిత్తూరు జిల్లాలో సాగు యోగ్యమైన భూమి 7,12,093 ఎకరాలు ఉంది. ఇందులో నీటిపారుద ల సౌకర్యం ఉన్న భూ విస్తీర్ణం 6,35,163 ఎకరా లు. చెరువుల, బోర్లకింద సాగయ్యే పొలాలే ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా సాలీనా సగ టు వర్షపాతం 934 మి.మీ. వర్షం రూపేణా కురిసే నీరు 49515 హెక్టారు మీటర్లు కాగా, ఇందులో 40 శాతం నీరు ఆవిరై పోతుంది. ఏటా భూమిలో ఇంకే నీరు మాత్రం 5447 హెక్టారు మీటర్లేనని జల వనరులు, భూగర్భ జల శాఖల గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో పడమర మండలాలైన మదనపల్లి, తంబళ్లపల్లి ప్రాంతాల్లో టమాట ఇతరత్రా వాణిజ్య, కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. సరైననీటి సదుపాయం లేక, భూగర్భ జలాలు అందుబాటులో లేక రైతులు విలవిల్లాడుతున్నారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ ప్రాంతాలకు సాగునీటి సదుపాయం లభించే వీలుంది. ఈ నేపథ్యంలో దిగాలుపడ్డ రైతున్నల్లో భరోసా నింపి అధిక దిగుబడుల సాధన దిశగా వీరిని ప్రోత్సహించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. జిల్లాలు, మండలాలవారీగా రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి చేను కింద కందకాల ఆవశ్యకతను వివరిస్తోంది. ముందుకొచ్చిన రైతులకు దగ్గరుండి కందకాల తవ్వకంలో సహకారం అందించనుంది.