♦ పురుగు మందు తాగి రైతు బలవన్మరణం
♦ లింగారెడ్డిపేటలో ఘటన
తూప్రాన్ : భూగర్భ జలాలు అడుగంటడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి తుడిచి పెట్టుకుపోయింది. చేతికంద లేదు. దీంతో అప్పులు తీర్చలేక మనో వేదనకు గురై రైతు పురుగు మందు తాగి మంగళవారం తనువు చాలించాడు. ఎస్‌ఐ సంతోష్‌కుమార్ కథనం మేరకు.. మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు పిట్ల మల్లేశం (65) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పొలంలో రెండు బోరుబావులను తవ్వించాడు. ఇందుకోసం సుమారు రూ.2 లక్షలు అప్పు చేసి ఖర్చు చేశాడు. ఎకరంలో టామోటా, వరి నాటు వేశాడు.
భూగర్భ జలాలు అడుగంటడంతో నీరు లేక పొలం ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురయ్యాడు. ఇదిలా ఉండగా.. రుణదాతలు అప్పు తీర్చాలని ఒత్తిళ్లు చేశాడు. వీరికి మంగళవారం డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే వాయిదా సమీపంచడంతో అప్పులు తీర్చేమార్గంలేక ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున ఇంట్లో వారు లేచినప్పటికీ మల్లేశం నిద్ర నుంచి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించే సరికి అప్పటికే మల్లేశం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సుగుణమ్మ రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి.
అన్నదాత ఉసురు తీసిన అప్పులు
Published Wed, Apr 22 2015 2:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement