
సాక్షి, అమరావతి/కైకలూరు: అమర్‌నాథ్‌లో కుండపోత వాన, అకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్‌తో మాట్లాడారు. అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. ఆయన అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.
కైకలూరు యాత్రికులు క్షేమం..
ఏలూరు జిల్లా కైకలూరు నుంచి యాత్రకు వెళ్లిన 10 మంది శుక్రవారం అక్కడ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారు. ప్రసార మాధ్యమాల్లో వరదల వార్తలను చూస్తున్న వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1న కైకలూరు నుంచి బట్టు సీతారామయ్య, రెడ్డి, సింహాచలం, కోడూరు సుబ్బారావు, రాజు తదితరులు 10 మంది ఏజెంటు ద్వారా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బోలేనాథ్ గుహ వద్ద వరద ముంచుకొచ్చింది. దీనిపై అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సింహాచలం కుమారుడు నాని మాట్లాడుతూ టీవీల్లో ప్రమాదవార్తను తెలుసుకుని తన తండ్రికి ఫోన్ చేసినట్లు చెప్పారు. తాము కొండ పైభాగంలో ఉన్నామని, ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా కిందికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారని తెలిపారు. అందరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment