సాక్షి, హైదరాబాద్: మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. నిన్న విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్ చికిత్స పొందుతున్న హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఆయా హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. తాజా అగ్ని ప్రమాదాల సంఘటన నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు/కోవిడ్ కేర్ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన అన్ని ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల (హోటళ్ల)కు ఆదేశాలు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా హోటళ్లు ఏ మేరకు అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారన్న దానిపైనా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేయాలని యోచిస్తుంది.
(తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు)
త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఏర్పాట్లు...
రాష్ట్రంలో కోవిడ్ కేంద్రాలుగా 36 హోటళ్లు అనుమతి పొందినా, మరో 50–60 హోటళ్లలో ఇష్టానుసారంగా కరోనా రోగులను ఐసోలేషన్లో ఉంచుతున్నట్లు వైద్య వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో కొన్ని కనీసం ప్రమాణాలు కూడా పాటించడం లేదని బాధితులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పలువురు రోగులు ఇంట్లో అందరితో కలసి ఉండకుండా హోటల్ గదిలో సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లు క్వారంటైన్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఆయా హోటళ్లలో సుమారు మూడువేల మంది వరకు కోవిడ్ రోగులు ఉన్నట్లు సమాచారం.
అగ్ని ప్రమాదాల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలు
►ఆస్పత్రులు, హోటళ్లలో అగ్నిప్రమాద నివారణ కోసం జనరేటర్ అందుబాటులో ఉంచాలి. అగ్నిప్రమాదం జరిగితే విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేసి జనరేటర్‌ను ఆన్ చేస్తారు.
►హోటల్ లేదా ఆస్పత్రి బిల్డింగ్‌పై పెద్ద నీటి తొట్టిని ఏర్పాటు చేయాలి.
►ప్రతీ ఫ్లోర్‌కు నీటిని అందించేందుకు వీలుగా పెద్ద పైపును ఏర్పాటు చేయాలి.
►అగ్నిప్రమాదంలో చేపట్టాల్సిన చర్యలపై అప్పుడప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలి.
►ఆయా భవనాలకు రెండు వైపులా మెట్లుండాలి. అగ్ని ప్రమాదం జరిగితే రోగులు, ఇతరులు బయటకు రావడానికి వీలుగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment