సార్వత్రిక భేరి
సాక్షి, విజయవాడ : మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక సార్వత్రిక ఎన్నికల సమరం మొదలుకానుంది. శనివారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని బందరు, విజయవాడ పార్లమెంట్, 16 అసెంబ్లీ స్థానాలకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను ఏర్పాటుచేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయాన్ని గొల్లపూడిలో ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు నియోజకవర్గానికి సంబంధం లేకుండా మైలవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు.
ఎన్నికల ప్రక్రియ ఇలా..
శనివారం నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
13, 14, 18 తేదీలు సెలవురోజులు.
21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
మే ఏడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.
మే 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
జిల్లాలో దాదాపు 32,77,113 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మరో 54,961 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 1088, గ్రామీణ ప్రాంతాల్లో 2459 పోలింగ్ కేంద్రాలు.. మొత్తం 3547 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 1433 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్‌కాస్టింగ్‌తో పాటు ఇతర భద్రత చర్యలు తీసుకోనున్నారు.
అత్యధికంగా ఖర్చుపెట్టే నియోజకవర్గాలుగా పెనమలూరు, గన్నవరం, మైలవరం, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్నికల విధులకు 22,938 మంది సిబ్బందిని, 700 మైక్రోఅబ్జర్వర్స్‌ను, 323 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు తుది కసరత్తు చేస్తున్నాయి.ఇప్పటికే సీపీఎం ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, తెలుగుదేశం ఐదు స్థానాలకు ప్రకటించింది. మిగిలిన పార్టీలు ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
రిటర్నింగ్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రకియ మొదలుకానుంది. ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలుచేయనున్నారు. జిల్లాలోని 11 నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద కూడా 144 సెక్షన్ అమలుతోపాటు ఎన్నిలక కమిషన్ ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఎస్పీ ప్రభాకరరావు సాక్షికి తెలిపారు.