రక్తం మరిగిన రాళ్లు..
రక్తం మరిగిన రాళ్లు..
Published Wed, Jul 26 2017 7:09 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
♦ చీమకుర్తిలో మరణ మృదంగం మోగిస్తున్న గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు
♦ నిర్లక్ష్యంగా యాజమాన్యాలు.. స్పందించని అధికారులు
ప్రకాశం: గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. వాటిలో పనిచేస్తున్న కూలీల పాలిట శాపంగా మారింది. క్వారీలు, ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో పాటు అధికారులు తనిఖీలు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలకు గురవుతూ కార్మికులు మృత్యువాతపడుతున్నారు. గ్రానైట్ రవాణా సమయంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు. వీటికితోడు గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో అనుమానాస్పదస్థితిలో కూడా అనేక మంది కూలీలు చనిపోతుండటం విశేషం.
ఇటీవలే ముగ్గురు మృతి...
ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ నెల 21న హంస మినరల్స్ అండ్ ఎక్స్‌పోర్ట్‌లో గ్రానైట్ స్లాబులను కంటైనర్‌కు లోడుచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి బీహార్‌కు చెందిన బసంత్ సాహిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు మర్రిచెట్లపాలెంలో బీహార్‌కు చెందిన నీరజ్‌కుమార్‌సింగ్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతిచెందాడు. అదే గ్రామంలోని మరో గ్రానైట్ ఫ్యాక్టరీలో మిషన్ స్విచ్ ఆన్‌చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టి పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన ఇనగంటి నాగరాజు మరణించాడు. ఇలాంటి ప్రమాదాలు చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీల్లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సరాసరిన వారానికి ఒకరిద్దరు, నెలకు నలుగురైదుగురు, ఏడాదికి 60 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు.
రోడ్డు ప్రమాదాలూ అధికమే...
ఒంగోలు – కర్నూలు రోడ్డుపై చీమకుర్తి–ఒంగోలు మధ్య నిత్యం గ్రానైట్ రవాణాతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి కూలీలతో పాటు ప్రయాణికులు మృతిచెందుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థాని కులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. చీమకుర్తిలో కొత్తగా వేసిన బైపాస్ రోడ్డును ఇంకా ప్రారంభించలేదు. కానీ, దానిపై వారం రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్ర మాదంలో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
బూనూరి రమాదేవి, ఉప్పుచర్ల వెంకటేశ్వర్లు, దేవరపల్లి ఆదినారాయణమ్మలు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఈ ఘటన మరవకముందే రెండురోజుల క్రితం కర్నూలు రోడ్డులోని రామతీర్థం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్లామల్లికి చెందిన కేసర వీరారెడ్డి మృతిచెందాడు. ఆయనతో పాటు బైకుపై వచ్చి ప్రమాదానికి గురైన గురువులు తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరా డుతున్నాడు.
ఇలా చెప్పుకుంటూపోతే.. చీమకుర్తి పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య కొండవీటి చాంతాడంత ఉంది. నేరుగా ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్యే ఇలా ఉంటే.. మృతికి కారణం అంతుబట్టకుండా అనుమానాస్పదస్థితిలో మృతి చెందుతున్న వారూ అధికంగానే ఉంటున్నారు. సాగర్ కాలు వల్లో శవమై తేలడం, నిరుపయోగంగా ఉన్న గ్రానైట్ గుంతల్లో చనిపోయి పడి ఉండటం, కాలువ కట్టలు, రామతీర్థం పరిసరాల్లో ఉండే కొండలు, లోయల్లో మృతదేహాలై కనిపించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.
మూడొంతుల మంది ఇతర రాష్ట్రాల వారే...
పొట్టచేతబట్టుకుని పిడికెడు మెతుకుల కోసం రామతీర్థం, చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం పరిసరాల్లో ఉండే గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు అధికంగా వస్తుంటారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే. వాటిలో సహజంగా జరిగే ప్రమాదాలు కొన్నయితే.. ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రమాదాలు మరికొన్ని. ఉద్దేశపూర్వకంగా జరిగిన వాటిని కూడా సహజ ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులే ఇక్కడి ప్రమాదాల్లో ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు. వారి తరఫున ప్రశ్నించేవారు లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధిత కుటుంబానికి ఎంతోకొంత నగదు ముట్టజెప్పి సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement