
ముగిసిన ‘మండలి’ పోలింగ్
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 38%
వరంగల్-ఖమ్మం- నల్లగొండలో 58% పోలింగ్
ఈ నెల 25న ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలి రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 38 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు దేవీప్రసాద్, రామచందర్‌రావులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యోగులు ఓటర్లుగా అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా... ఇది గతంలో (27.16 శాతం) కంటే 10.84 శాతం ఎక్కువ . ఈ నియోజకవర్గంలో 2,96,318 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,12,600 మందిఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా చూసినప్పుడు మహబూబ్‌నగర్‌లో 55 శాతం, రంగారెడ్డిలో 34 శాతం, హైదరాబాద్‌లో 29 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో పోలింగ్ శాతం కొంత ఫర్వాలేదనిపించింది. ఈ నియోజకవర్గంలో 53 శాతం పోలింగ్ నమోదైంది. 22 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. కాగా, 2,81,138 మంది ఓటర్లకు గాను 1,49,003 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, వరంగల్‌లో 51.36 శాతం, ఖమ్మంలో 50.01 శాతం, నల్లగొండలో అత్యధికంగా 58 శాతం పోలింగ్ నమోదైంది.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 25న జరగనుంది. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రత్యేక క మిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఆదివారం చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల పోలింగ్ వివరాలను ప్రకటించారు. ఎన్నికల కోసం మూడు జిల్లాల్లో 435 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 38 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 68,721 ఓట్లు ఉండగా 36,482 ఓట్లు వినియోగించుకున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 1,37,261 ఓట్లు ఉండగా 50,816 ఓట్లు, హైదరాబాదులో 90,336 ఓట్లు ఉండగా 26,142 ఓట్లను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 55 శాతం, రంగారెడ్డిలో 34 శాతం, హైదరాబాదులో 29 శాతం ఓట్లు నమోదైనట్లు పేర్కొన్నారు. 2009లో పట్టభద్రుల స్థానానికి మొత్తం మీద మూడు జిల్లాల్లో 27 శాతం నమోదు కాగా ఈ సారి ఓటర్ల శాతాన్ని భేరీజు వేసుకుంటే 11 శాతం పెరిగినట్లు వెల్లడించారు.
ఈ నెల 25న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని తెలియజేశారు. మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఒక్కో టేబుల్‌కు ముగ్గురు కౌంటింగ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు పనిచేస్తారని చెప్పారు. పెరిగిన పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని టేబుల్స్, సిబ్బందిని పెంచినట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఒకే రోజులో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి 23న ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు లేకపోవడం చేత కొంత ఆలస్యం కావచ్చని, ఆలస్యమైనా ఒకే రోజులో ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్‌లో ఏ అభ్యర్థికైనా 58 శాతం ఓట్లు మించకుంటే వారిని ఎలిమినేట్ చేయడం జరుగుతుందన్నారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు హైదరాబాద్ ఇస్సామియా బజార్‌లోని విక్టరీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు ఇక్కడ 20 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
దొంగ ఓటు వేసేందుకు యత్నించిన ఉపాధ్యాయుడి అరెస్ట్
దొంగఓటు వేసేందుకు యత్నించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఐఎస్‌సదన్ డివిజన్‌లోని జి.పద్మావతి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌నంబర్ 379లో జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మధుసూదన్‌గౌడ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటువేయడానికి యత్నిస్తుండగా, అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ నాయకుడు అడ్డుకున్నారు. స్థానికేతరుడైన మీరు ఇక్కడ ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయరాదని పేర్కొంటూ.. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు మధుసూదన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని 171 కేసు నమోదు చేశారు.