తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ కట్టుబడి ఉందని ఏఐసీసీ ఆధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఏమాత్రం అవసరం లేదని, ఈ విషయంలో పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ కట్టుబడి ఉందని ఏఐసీసీ ఆధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఏమాత్రం అవసరం లేదని, ఈ విషయంలో పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగినదంతా తాము ముందునుంచి ఊహించినదేనని సింఘ్వీ అన్నారు. ఇదే సమయంలో ఆయన బీజేపీ వైఖరిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు పలుకుతుందా లేదా అన్నది అనుమానమేనని ఆయన అన్నారు.
ఇక తెలంగాణ బిల్లు విషయంలో, ఇది నైతికతకు సంబంధించిన అంశం కాదని, తాము రాజ్యాంగ పద్ధతుల ప్రకారం నడుచుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. అంతేతప్ప.. కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి గురించి, ఆయన అధిష్ఠానాన్ని ధిక్కరించడం గురించి మాత్రం సింఘ్వీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణపై బీజేపీ మొసలికన్నీరు కారుస్తోందని, ఆ పార్టీ నిజ స్వరూపమేంటో పార్లమెంట్‌లో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.