రభసలోనే ప్రకటన | TDP government to declare on Capital of andhra pradesh while on attack in assembly | Sakshi
Sakshi News home page

రభసలోనే ప్రకటన

Published Fri, Sep 5 2014 2:32 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

రభసలోనే ప్రకటన - Sakshi

రభసలోనే ప్రకటన

* రాజధానిపై ప్రజాస్వామ్య బద్ధ చర్చ కోసం ప్రతిపక్ష నిరసనలతో అట్టుడికిన అసెంబ్లీ
* జగనోక్రసీ, ఫ్యాక్షనిజం అంటూ విపక్షంపై అధికార పక్షం ఎదురు దాడి
* ప్రకటనకు ముందే చర్చ చేపట్టాలని విపక్షం వాయిదా తీర్మానం.. స్పీకర్ తిరస్కరణ
* ప్రభుత్వం నోటీసు ఇచ్చినందున తర్వాతే చర్చించవచ్చన్న స్పీకర్
* ప్రకటన చేశాక చర్చలో అర్థమేముంటుందని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నిరసన
* 1953లో రాజధాని నగరంపై ఐదు రోజుల చర్చ జరిగిందని గుర్తుచేసిన వైనం
* జగన్, వైఎస్ విభజనకు కారణమయ్యారంటూ టీడీపీ సభ్యుల అసంబద్ధ ఆరోపణలు
* పరుష పదజాలంతో విపక్షంపై దాడి.. జగన్‌ను దూషిస్తూ బాబును పొగుడుతూ ప్రసంగాలు
* గందరగోళంలోనే ‘ముహూర్తం’ పేరుతో రాష్ట్ర రాజధానిపై ప్రకటన చేసిన సీఎం

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై గురువారం రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. రాజధాని ప్రాంతాన్ని ప్రకటించే ముందే ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరగాలన్న ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడే అస్త్రంగా ప్రయోగించింది. ముందుగా చర్చించటానికి ససేమిరా నిరాకరించింది. ప్రకటన తర్వాతే చర్చ అంటూ ప్రతిపక్ష వినతిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇదెక్కడి పద్ధతి అని ప్రశ్నించిన విపక్షంపై.. రాష్ట్ర విభజనకు కారకులు మీరేనంటూ అర్థంలేని అసంబద్ధ ఆరోపణలతో విరుచుకుపడింది.
 
 ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా అని ప్రతిపక్ష నేత ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. ఆయన అసెంబ్లీలో జగనోక్రసీ నడిపిస్తున్నారని, ఫ్యాక్షనిజాన్ని నడుపుతున్నారంటూ అధికారపక్షం అడ్డగోలు విమర్శలకు తెరతీసింది. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతూ.. ముందుగా చర్చ జరగాలని నినాదాలు చేస్తుంటే.. అధికార టీడీపీ సభ్యులు వారిపై ఆరోపణలు, ప్రతినినాదాలు చేయటంతో సభ హోరెత్తింది. నినాదాలు, అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఈ గందరగోళంతో రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షం నిరసనల హోరు మధ్యే సీఎం చంద్రబాబు ముహూర్తం ప్రకారం ఉదయం 11:11 గంటలకు రాజధాని ప్రాంతంపై ప్రకటన చేసి పంతం నెగ్గించుకున్నారు.
 
 చర్చకోసం వాయిదా తీర్మానం తిరస్కరణ...
 గురువారం ఉదయం సభ ప్రారంభంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జి.శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్నట్టు ప్రకటిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబును మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఒక్కుదుటున లేచి వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తే ఎలాగని స్పీకర్‌ను అడిగారు. దీనిపై ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో ప్రకటన ఇవ్వబోతున్నారని, ఇక చర్చ అవసరం లేదని స్పీకర్ బదులిచ్చారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్తూ పోడియంలోకి వెళ్లారు. రాజధానిపై తొలుత చర్చ చేపట్టాలని, ఆ తర్వాత ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. ప్రకటన ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చేసేదేమీ లేదని, ఏమైనా అభ్యంతరాలుంటే అప్పుడు చెప్పాలని పేర్కొన్నారు.
 
 యనమల క్షమాపణ చెప్పాలి...
 వైఎస్సార్ సీపీ శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. ‘‘యనమల ఇజాలు (వాదాలు) మాట్లాడుతున్నారు. గతంలో నన్ను రెండుసార్లు అవమానపర్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రతిపక్ష నేత జగన్‌ను అవమానపర్చేలా మాట్లాడుతున్నారు. ఈ ఇజాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మేధో సంపత్తి నుంచేనా? మేమూ ప్రజామోదంతోనే వచ్చాం. మీలాగా దొడ్డిదోవన వచ్చి, నాయకుని ప్రాపకంతో మంత్రి పదవులు అనుభవించడం లేదు. యనమల వ్యాఖ్యలను మీ (స్పీకర్) విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. రికార్డులను పరిశీలించి అగౌరవపర్చే వ్యాఖ్యలుంటే తొలగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ గొడవ మధ్యనే మంత్రులు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యల్ని ఖండించారు. యనమల దొడ్డిదారిన రాలేదని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను తెలుసుకుని మెలగాలంటూ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పరిస్థితి అదుపుతప్పడంతో స్పీకర్ కోడెల ఉదయం 9.35 గంటల సమయంలో సభను తొలివాయిదా వేశారు.
 
 సభ తిరిగి ప్రారంభమైనా అదే హోరు...
 శాసనసభ 40 నిమిషాల తర్వాత 10.20 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. స్పీకర్ పోడియం ముందు ప్ల కార్డులతో నిరసన తెలిపింది. సభ్యుల నినాదాలు, ప్రతినినాదాల మధ్యనే అధికార టీడీపీ సభ్యులు గొల్లపల్లి, గోరంట్ల, తెనాలి శ్రావణకుమార్, కాలువ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, మంత్రులు పి.సుజాత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు మాట్లాడారు. విపక్షాన్ని, ప్రతిపక్ష నేత జగన్‌ను విమర్శిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. చట్టసభలో ధర్నాలు, బైఠాయింపులు, ప్లకార్డులతో నిరసనలు చేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారంటూ నిందారోపణలకు దిగారు.
 
 ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?: జగన్
 ఈ సందర్భంలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ స్పందిస్తూ ‘‘రాష్ట్ర రాజధాని అనేది ప్రాధాన్యతాంశం. మొదట చర్చ, ఆ తర్వాత ఓటింగ్, ఆపైన ప్రకటన వెలువడాలి. ఇది సంప్రదాయం. దీన్ని పక్కనబెట్టి ‘ముహూర్తం టైం అయిపోతోంది.. ప్రకటన చేస్తాం.. ఆ తర్వాత చర్చిస్తాం..’ అంటే సరిపోతుందా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అన్న అనుమానం వస్తోంది. ఇది అన్యాయం’’ అని నిరసన తెలిపారు.
 
  దీనిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మాట్లాడుతూ 1953లో రాజధాని లేదని, ఏదో ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ నాయకుడు ప్రకటన చేస్తారని, ఆ తర్వాత చర్చించుకోండన్నారు. దీనికి వైఎస్సార్ సీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ, ఓటింగ్ తర్వాతే ప్రకటన చేయాలని పదేపదే కోరినప్పటికీ సభావ్యవహారాల మంత్రి యనమల మాత్రం.. ప్రతిపక్షం నిబంధనలకు అనుగుణంగా తీర్మానం కూడా ఇవ్వలేదని, ప్రకటన చేయడం ప్రభుత్వ హక్కని పేర్కొన్నారు. అప్పటికి సమయం 11.11 గంటలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేసేందుకు లేవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
 
 మంత్రుల ఎదురుదాడి..
 ఓ పక్క ఈ వివాదం నడుస్తుండగానే మంత్రులు రావెల కిషోర్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, అడ్డగోలు విభజనకు కారణమయ్యారని, అనైక్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని లేనిపోని ఆరోపణలకు దిగారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఎన్ని గంటల చర్చకైనా తాము సిద్ధమని, ఎన్ని సూచనలు, సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు జగన్, ఆయన తండ్రి కారకులంటూ.. అందుకు క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ దశలో స్పీకర్‌కు, విపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం నడిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూను మాట్లాడాలని స్పీకర్ కోరినప్పటికీ ఆయన తిరస్కరిస్తూ తాము ప్రకటనకు ముందు చర్చకు పట్టుబడుతున్నామని, అదే తమ డిమాండ్ అని స్పష్టంచేశారు. ఇలా దాదాపు 15 నిమిషాల పాటు సభలో గందరగోళం చెలరేగింది.
 
 అప్పటి పరిస్థితులు వేరు: స్పీకర్
 అప్పటి (1953 నాటి) పరిస్థితులు వేరని, ఇప్పటి పరిస్థితులు వేరని, రూల్ నంబర్ 338 కింద ముఖ్యమంత్రి లేదా మంత్రి ప్రకటన చేసే అధికారం ఉందని స్పీకర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కావాలనుకుంటే ప్రతిపక్షం వివరణ కోరవచ్చన్నారు. అనంతరం సభావ్యవహారాల శాఖ మంత్రి యనమల మాట్లాడుతూ ప్రతిపక్ష నేత అయినా, ముఖ్యమంత్రి అయినా నిబంధనలను పాటించేలా విధివిధానాలున్నాయని, సభలో ప్రజస్వామ్యం ఉందే గానీ జగనోక్రసీ (జగన్‌వాదం) లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరుగుతుందని చెప్పారు. విధివిధానాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష సభ్యులు అల్లరి చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. యనమల వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా యనమల మాట్లాడలేదని, ప్రకటన చేసేందుకు ప్రభుత్వానికి విశేషాధికారం ఉందని స్పీకర్ అనడంతో మళ్లీ గొడవ జరిగింది. ఈ దశలో యనమల తిరిగి మాట్లాడుతూ తిరస్కరించిన వాయిదా తీర్మానంపై మాట్లాడేదేమీ ఉండదని, ప్రభుత్వం ప్రకటన ఇచ్చేదాక ఓపిక పట్టి ఆ తర్వాత చెప్పదల్చుకున్నది చెప్పాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement