
బౌద్ధ క్షేత్రాలకు తెలంగాణ నెలవు
అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ప్రభుత్వం
♦ నాలుగు రోజులపాటు సదస్సు
♦ విదేశీ ప్రతినిధుల హాజరు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే అద్భుత బౌద్ధ క్షేత్రాలకు తెలంగాణ నెలవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బౌద్ధ ఆరామాలు, చైత్యాలు, స్థూపాలు ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయని, బుద్ధుడు జీవించి ఉన్న సమయంలోనే ప్రత్యక్షంగా ఆయనను అనుసరించి బౌద్ధం వ్యాప్తికి కృషి చేసిన బావరి నడయాడిన నేల ఇది అంటూ విదేశీ ప్రతిని ధులకు వివరించింది. గురువారం నగరంలోని హరితప్లాజాలో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు 15 దేశాల నుంచి 63 మంది ప్రతినిధులు సహా జాతీయ, స్థానిక ప్రతినిధు లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
సీఎం రాకపోవడంతో ప్రభుత్వ ప్రతినిధిగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సదస్సును ప్రారం భించారు. పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో బుద్ధుడి బోధనలను ఆయన బతికుండగానే ప్రారంభించిన బావరి, అతని అనుచరులు పుట్టిన బాదన్‌కుర్తి కూడా తెలం గాణలోనే ఉండటం విశేషమని వక్తలు అన్నా రు.
ఇటీవలే ఇక్కడ దాని సాక్ష్యాలు కూడా వెలుగుచూడటం, బౌద్ధ గ్రంథం సుత్తనిపాతం లో బాదన్‌కుర్తి ప్రస్తావన ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. తెలంగాణలో ఎన్నో బౌద్ధ క్షేత్రాలున్నాయని, వాటిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. బుద్ధుడు చూపిన శాంతి మార్గంలోనే సీఎం చంద్రశేఖర్‌రావు ఉద్యమించి తెలంగాణ సాధించారన్నారు.
బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు: మంత్రి చందూలాల్
తెలంగాణలో ప్రధాన బౌద్ధ క్షేత్రాలను కలిపి బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి చందూలాల్ ప్రకటించారు. ఇప్పటికే బుద్ధవనం పేరుతో అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్ పరిసరాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. బుద్ధుడి బోధనలను అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా జయించొచ్చని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. తెలంగాణలో వెలుగు చూసిన 28 బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
గుడ్‌మార్నింగ్ వద్దు...
గుడ్‌మార్నింగ్ బదులు, బుద్ధుడు బోధించినట్టుగా సుఖీహోతూ అని పరస్పరం పలకరించుకోవాలని మలేషి యా నుంచి వచ్చిన బౌద్ధ ప్రతినిధి ఆనంద కుమార సెరీ పిలుపునిచ్చారు. యూరో పియన్ సంస్కృతిని విడనాడి సనాతన బౌద్ధ ఆచారాలను అనుసరించటం మంచి దన్నారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రశేఖర్ రావు శ్రమిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. బౌద్ధ క్షేత్రాల పునరుద్ధరణే కాకుండా, వాటి ఔన్నత్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లే తాత్వికత అవసరమని ఆయన అన్నారు. కాగా, సదస్సులో శుక్రవారం విదేశీ ప్రతినిధుల ప్రసంగాలుంటాయి. శని, ఆదివారాల్లో పలు బౌద్ధ క్షేత్రాల పర్యటన ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.