International Buddhist Conference
-
స్ఫూర్తిదాయకంగా ‘బుద్ధవనం’
ఈ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌కు భారీ ప్రణాళికలున్నాయి ► రాష్ట్ర యువజన పర్యాటక శాఖ కార్యదర్శి డి.వెంకటేశం ► నగరంలో ముగిసిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బౌద్ధ చరిత్రను ప్రతిబింబించే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భారీ ప్రణాళికలున్నాయని, వాటిని నిజం చేసేందుకు బౌద్ధ దేశాల ప్రతినిధుల తోడ్పాటు అవసరమని రాష్ట్ర యువజన పర్యాటక శాఖ కార్యదర్శి డి.వెంకటేశం చెప్పారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆద్వర్యంలో బుద్ధవనం ప్రాజెక్టు నేతృత్వంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బౌద్ధ చరిత్రను వెలుగులోకి తేవడంలో భాగంగానే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలు గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బౌద్ధ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణ చారిత్రక బౌద్ధ ప్రదేశాల విశిష్టతను చాటేందుకు విదేశీ ప్రతినిధులతో బౌద్ధ క్షేత్రాల్లో పర్యటించి తెలంగాణ బౌద్ధ విలువలను ముందుయుగాలకు అందిస్తామని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. రెండో రోజు సదస్సులో నిర్వహించిన నాలుగు సెషన్లలో యునైటెడ్ కింగ్డమ్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, తైవాన్, షికాగో, కెనడా, శ్రీలంక, మయన్మార్ నుంచి వచ్చిన ప్రతినిధులు బౌద్ధంలోని వివిధ కోణాలను వివరించారు. ఆ««దlునిక సమాజంలో వాటి సహేతుకతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వీరు అభిప్రాయపడ్డారు. విద్యాభ్యాసంలో భాగం చేయాలి... మొదటి సెషన్ కు అధ్యక్షత వహించిన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. బుద్ధవనం ప్రాజెక్టును ఓ బృహత్తర కార్యక్రమంగా చేపట్టి, దానిని అమలు చేసేందుకు అంబేడ్కర్‌వాది, బౌద్ధ మేధావి మల్లెపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించడం హర్షణీయమని అన్నా రు. రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ అధ్యక్షతన నిర్వహించిన రెండో సెషన్ లో మానవీయతను పెంపొం దించే బౌద్ధ విలువలను విద్యావిధానంలో భాగం చేయాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కి చెప్పారు. అసమానతలను తరిమేసేందుకు బౌద్ధాన్ని స్వీకరించిన అంబేడ్కర్ వారసత్వం కారణంగానే ఇటువంటి సదస్సులను నిర్వహించగలుగుతున్నామని ఐఏఎస్ అధికారి ఉండ్రు రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. దళితులు, అంబేడ్కర్‌వాదులే బౌద్ధ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారన్నారు. మూడో సెషన్ లో బౌద్ధ క్షేత్రాలను ప్రోత్సహించి, విదేశీ బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వక్తలు చర్చించారు. నాల్గో సెషన్ లో బౌద్ధం, మయన్మార్‌లో శాంతి, శ్రీలంకలో బౌద్ధ అనుభవాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సెషన్ కు కేవై రత్నం అధ్యక్షత వహించారు. సదస్సు సందర్భంగా బౌద్ధవ్యాప్తికి ప్రపంచ బౌద్ధ భిక్షువులు ప్రతినబూనారు. సదస్సులో ఉస్మానియా ప్రొఫెసర్ చెన్న బసవయ్య, ఉస్మానియా వర్సిటీ ఓఎస్డీ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కొరివి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బౌద్ధ క్షేత్రాలకు తెలంగాణ నెలవు
అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో ప్రభుత్వం ♦ నాలుగు రోజులపాటు సదస్సు ♦ విదేశీ ప్రతినిధుల హాజరు సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే అద్భుత బౌద్ధ క్షేత్రాలకు తెలంగాణ నెలవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బౌద్ధ ఆరామాలు, చైత్యాలు, స్థూపాలు ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయని, బుద్ధుడు జీవించి ఉన్న సమయంలోనే ప్రత్యక్షంగా ఆయనను అనుసరించి బౌద్ధం వ్యాప్తికి కృషి చేసిన బావరి నడయాడిన నేల ఇది అంటూ విదేశీ ప్రతిని ధులకు వివరించింది. గురువారం నగరంలోని హరితప్లాజాలో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు 15 దేశాల నుంచి 63 మంది ప్రతినిధులు సహా జాతీయ, స్థానిక ప్రతినిధు లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీఎం రాకపోవడంతో ప్రభుత్వ ప్రతినిధిగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సదస్సును ప్రారం భించారు. పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో బుద్ధుడి బోధనలను ఆయన బతికుండగానే ప్రారంభించిన బావరి, అతని అనుచరులు పుట్టిన బాదన్‌కుర్తి కూడా తెలం గాణలోనే ఉండటం విశేషమని వక్తలు అన్నా రు. ఇటీవలే ఇక్కడ దాని సాక్ష్యాలు కూడా వెలుగుచూడటం, బౌద్ధ గ్రంథం సుత్తనిపాతం లో బాదన్‌కుర్తి ప్రస్తావన ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. తెలంగాణలో ఎన్నో బౌద్ధ క్షేత్రాలున్నాయని, వాటిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. బుద్ధుడు చూపిన శాంతి మార్గంలోనే సీఎం చంద్రశేఖర్‌రావు ఉద్యమించి తెలంగాణ సాధించారన్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు: మంత్రి చందూలాల్ తెలంగాణలో ప్రధాన బౌద్ధ క్షేత్రాలను కలిపి బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి చందూలాల్ ప్రకటించారు. ఇప్పటికే బుద్ధవనం పేరుతో అంతర్జాతీయ స్థాయిలో నాగార్జునసాగర్ పరిసరాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. బుద్ధుడి బోధనలను అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా జయించొచ్చని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. తెలంగాణలో వెలుగు చూసిన 28 బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గుడ్‌మార్నింగ్ వద్దు... గుడ్‌మార్నింగ్ బదులు, బుద్ధుడు బోధించినట్టుగా సుఖీహోతూ అని పరస్పరం పలకరించుకోవాలని మలేషి యా నుంచి వచ్చిన బౌద్ధ ప్రతినిధి ఆనంద కుమార సెరీ పిలుపునిచ్చారు. యూరో పియన్ సంస్కృతిని విడనాడి సనాతన బౌద్ధ ఆచారాలను అనుసరించటం మంచి దన్నారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రశేఖర్ రావు శ్రమిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. బౌద్ధ క్షేత్రాల పునరుద్ధరణే కాకుండా, వాటి ఔన్నత్యాన్ని జనాల్లోకి తీసుకెళ్లే తాత్వికత అవసరమని ఆయన అన్నారు. కాగా, సదస్సులో శుక్రవారం విదేశీ ప్రతినిధుల ప్రసంగాలుంటాయి. శని, ఆదివారాల్లో పలు బౌద్ధ క్షేత్రాల పర్యటన ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.