
స్ఫూర్తిదాయకంగా ‘బుద్ధవనం’
ఈ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌కు భారీ ప్రణాళికలున్నాయి
► రాష్ట్ర యువజన పర్యాటక శాఖ కార్యదర్శి డి.వెంకటేశం
► నగరంలో ముగిసిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బౌద్ధ చరిత్రను ప్రతిబింబించే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భారీ ప్రణాళికలున్నాయని, వాటిని నిజం చేసేందుకు బౌద్ధ దేశాల ప్రతినిధుల తోడ్పాటు అవసరమని రాష్ట్ర యువజన పర్యాటక శాఖ కార్యదర్శి డి.వెంకటేశం చెప్పారు. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆద్వర్యంలో బుద్ధవనం ప్రాజెక్టు నేతృత్వంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బౌద్ధ చరిత్రను వెలుగులోకి తేవడంలో భాగంగానే బుద్ధవనం ప్రాజెక్టును ప్రపంచ దేశాలు గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
బౌద్ధ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణ చారిత్రక బౌద్ధ ప్రదేశాల విశిష్టతను చాటేందుకు విదేశీ ప్రతినిధులతో బౌద్ధ క్షేత్రాల్లో పర్యటించి తెలంగాణ బౌద్ధ విలువలను ముందుయుగాలకు అందిస్తామని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. రెండో రోజు సదస్సులో నిర్వహించిన నాలుగు సెషన్లలో యునైటెడ్ కింగ్‌డమ్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, తైవాన్, షికాగో, కెనడా, శ్రీలంక, మయన్మార్ నుంచి వచ్చిన ప్రతినిధులు బౌద్ధంలోని వివిధ కోణాలను వివరించారు. ఆ««దlునిక సమాజంలో వాటి సహేతుకతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని వీరు అభిప్రాయపడ్డారు.
విద్యాభ్యాసంలో భాగం చేయాలి...
మొదటి సెషన్ కు అధ్యక్షత వహించిన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. బుద్ధవనం ప్రాజెక్టును ఓ బృహత్తర కార్యక్రమంగా చేపట్టి, దానిని అమలు చేసేందుకు అంబేడ్కర్‌వాది, బౌద్ధ మేధావి మల్లెపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించడం హర్షణీయమని అన్నా రు. రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ అధ్యక్షతన నిర్వహించిన రెండో సెషన్ లో మానవీయతను పెంపొం దించే బౌద్ధ విలువలను విద్యావిధానంలో భాగం చేయాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కి చెప్పారు. అసమానతలను తరిమేసేందుకు బౌద్ధాన్ని స్వీకరించిన అంబేడ్కర్ వారసత్వం కారణంగానే ఇటువంటి సదస్సులను నిర్వహించగలుగుతున్నామని ఐఏఎస్ అధికారి ఉండ్రు రాజశేఖర్ అభిప్రాయపడ్డారు.
దళితులు, అంబేడ్కర్‌వాదులే బౌద్ధ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారన్నారు. మూడో సెషన్ లో బౌద్ధ క్షేత్రాలను ప్రోత్సహించి, విదేశీ బౌద్ధ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వక్తలు చర్చించారు. నాల్గో సెషన్ లో బౌద్ధం, మయన్మార్‌లో శాంతి, శ్రీలంకలో బౌద్ధ అనుభవాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సెషన్ కు కేవై రత్నం అధ్యక్షత వహించారు. సదస్సు సందర్భంగా బౌద్ధవ్యాప్తికి ప్రపంచ బౌద్ధ భిక్షువులు ప్రతినబూనారు. సదస్సులో ఉస్మానియా ప్రొఫెసర్ చెన్న బసవయ్య, ఉస్మానియా వర్సిటీ ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కొరివి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.