వడదెబ్బతో స్పీకర్‌కు అస్వస్థత
చిట్యాల: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో వడదెబ్బ మృతుల సంఖ్య దాదాపు 40కి చేరుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సైతం వడదెబ్బకు గురయ్యారు. రెండు రోజులుగా తన నియోజకవర్గం భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సమీక్షల్లో పాల్గొంటున్న ఆయన శుక్రవారం ఒక్కసారిగా అస్వస్థతతకు గురయ్యారు. దీంతో అధికారులు, కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం రెండు చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించిన స్పీకర్ ఆతర్వాత చిట్యాల మండలంలోని ఒడితలలో సీసీరోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపేటలో టీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో మధ్యాహ్నం భోజనం ముగించుకుని చల్లగరిగెలోని నల్లకుంట చెరువు పనులను ప్రారంభించి, చిట్యాలలో 50 పడకల సామాజిక వైద్యశాల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు. కొద్దిసేపటికే కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో సివిల్ ఆస్పత్రి వైద్యులు బీపీ చెక్ చేశారు. బీపీ ఎక్కువగా ఉంది. వెంటనే షుగర్ పరీక్ష చేసి, ఈసీజీ తీయించారు. అరగంట పాటు విశ్రాంతి కల్పించి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
అక్కడి నుంచి స్పీకర్ హైదరాబాద్‌కు బయలుదేరగా.. పరకాల వరకు వచ్చే సరికి మరోసారి కళ్లు తిరుగుతున్నాయని స్పీకర్ చెప్పడంతో పార్టీ నాయకులు వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు. ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, రాత్రికి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా, గతేడాది వేసవిలోనూ స్పీకర్ మధుసూదనాచారి వడదెబ్బకు గురయ్యారు.