
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం!
పరిశీలిస్తున్నామన్న సీఎల్పీ
- స్పీకర్ తమ హక్కులను హరిస్తున్నారని నేతల ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను, సంప్రదాయాలను గౌరవించని స్పీకర్ మధుసూదనా చారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రకటించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జి,చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తది తరులు సోమవారం అసెంబ్లీ వాయిదా అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ప్రజాస్వామ్య విలువలను, ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయాన్ని స్పీకర్ ఉల్లంఘించారని జానారెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుతగులుతూ, అవాంతరాలను కల్పిం చారని విమర్శించారు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభను ఆర్డరులో ఉంచుతూ, అడ్డుతగిలే సభ్యుడు అధికారపక్షానికి చెందినవారైనా నియంత్రించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంద న్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ కేసును సీబీఐకి అప్పగిం చాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిపై సభలోని అన్ని పార్టీల అభిప్రాయాలను స్పీకర్ తీసుకోకపోవడం అప్రజాస్వామికమన్నారు. స్పీకర్ తీరుపై ప్రశ్నించామని, దానికి సమాధానం ఇవ్వలేకపోయారని చెప్పారు. సభలో తమ అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇవ్వకపోవడంవల్లనే బహిరం గంగా చెప్పాల్సి వస్తుందని జానారెడ్డి అన్నారు. నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
వారి కనుసైగల మేరకు నడుపుతున్నారు: ఉత్తమ్
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అధికారపక్షంవైపు చూస్తూ.., వారి కనుసైగలకు అనుగుణంగా స్పీకర్ మధుసూదనాచారి సభను నడుపుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధికారపార్టీలో చేరారని, వారిపై చర్య తీసుకోవాలని కోరితే సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. శాసనసభలో నిరసన వ్యక్తంచేసే హక్కును హరించారని అన్నారు. ప్రతిపక్షసభ్యులు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు లేచి నిలబడితే మైకును ఇస్తున్నారన్నారు. శాసనసభలో మంత్రులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యవహరి స్తున్న అప్రజాస్వామిక తీరుపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ సభ్యులను కూడా సభలో మాట్లాడనివ్వడంలేదన్నారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకరుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామమన్నారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించినట్టుగా ఈ అసెంబ్లీని స్పీకర్ నడుపుతున్నారని విమర్శించారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత దొరికిన డైరీ, నగదు, రాజకీయపార్టీల నేతలతో సంబంధాల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.