- వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై చర్చకు ఎంఐఎం పట్టు
- రైతు సమస్యలకే పరిమితమవుదాం: సీఎం సూచన
- ఎజెండాలో రైతు ఆత్మహత్యలు అన్న పదం లేకపోవడంపై జానా అభ్యంతరం
- సమస్యపై చర్చల్లో ఏదైనా మాట్లాడొచ్చు: అధికారపక్షం
సాక్షి, హైదరాబాద్: రెండోరోజు శాసనసభా సమావేశాలు వాడివేడిగా ఆరంభమయ్యాయి. మంగళవారం సమావేశం ఆరంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల అంశంపై చర్చను ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ లేచి, తాము వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై వాయిదా తీర్మానం ఇచ్చామని, దీనిపై చర్చ జరపాలని కోరారు. 23న జరిగిన బీఏసీ సమావేశంలో ప్రశ్నోత్తరాలను రద్దుచేస్తామని చెప్పారే తప్ప, రైతుల ఆత్మహత్యలపై చర్చిస్తామనలేదన్నారు.
ఇప్పుడు ప్రశ్నోత్తరాలను రద్దు చేసినందున వికార్ ఎన్‌కౌంటర్‌పై చర్చిద్దామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకుంటూ ‘ఈ రోజు ఇతర అంశాలను చర్చ చేయలేం. కేవలం రైతు సమస్యలపై మాత్రమే చర్చిద్దామని చెప్పాం. రెండ్రోజులు దానిపైనే చర్చిద్దాం’ అన్నారు. సీఎం ప్రకటనపైనా అక్బరుద్దీన్ అభ్యంతరం చెప్పడంతో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని ప్రభుత్వ పక్షాన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అయినా అక్బరుద్దీన్ పట్టువీడక పోవడంతో కేసీఆర్ మరోమారు కల్పించుకొని ‘ వికార్ ఎన్‌కౌంటర్‌పై తర్వాత రోజున చర్చిద్దాం.. ప్రస్తుతానికి కూర్చోండి’ అని కోరడంతో అక్బర్ శాంతించారు. అనంతరం ప్రతిపక్షనేత కె.జానారెడ్డి లేచి ఎజెండాలో కేవలం రైతుసంక్షేమం అంశాన్నే చేర్చారని, ఆత్మహత్యలు, రుణమాఫీ,కరువు పరిస్థితులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ హరీశ్ స్పందిస్తూ, ‘గతంలోనూ నేరుగా రైతుల ఆత్మహత్యల అంశాన్ని ఎజెండాలో ఎక్కడా చేర్చలేదని చెప్పుకొచ్చారు. రైతు ప్రాధాన్యత దృష్ట్యా మొదటిరోజే చర్చకు పెట్టామని, దీనిపై మాట్లాడితే ఆత్మహత్యల పాపమంతా కాంగ్రెస్‌దే అని తేలుతుంది’ అని అన్నారు.
శాశ్వత పరిష్కారాలు వెతుకుదాం: సీఎం
పరస్పర నిందారోపణ కాకుండా సమస్యను లోతుగా చర్చించి శాశ్వతపరిష్కారాలు వెతుకుదామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సమస్యలపై చర్చలో ఎవరైనా ఏ అంశంపైనయినా స్వేచ్ఛగా మాట్లాడవచ్చని సూచించారు.
వాడివేడిగా అసెంబ్లీ
Published Wed, Sep 30 2015 3:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement