
స్పీకరా... మజాకా..?
శాసనసభ సమావేశాలు వీక్షించడానికి వెళ్లాలంటేనే ఎంతో తతంగం...పాసు తీసుకోవాలి...అదీ గంట సేపు మాత్రమే ఉండాలి.
శాసనసభ సమావేశాలు వీక్షించడానికి వెళ్లాలంటేనే ఎంతో తతంగం...పాసు తీసుకోవాలి...అదీ గంట సేపు మాత్రమే ఉండాలి. కానీ, శాసనసభాపతి ఎస్.మధుసూదనా చారి నియోజకవర్గం వారికో బంపర్ ఆఫర్ తగిలింది. స్పీకర్ నియోజకవర్గం కావడంతో భూపాలపల్లికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ప్రతీరోజు శాసనసభా సమావేశాలను వీక్షించడమే కాదు ఎంచక్కా భోజనాలు చేసి మరీ వెళుతున్నారు. అంతేకాదు వీరికి వీఐపీ గ్యాలరీలో కూర్చొని సమావేశాలను చూడటానికి అనుమతి ఇస్తున్నారు.
వీరికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అసెంబ్లీలోనే ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేల క్యాంటీన్‌లో వీరికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు వర్కింగ్ లంచ్ ముగిసిన తర్వాత అదే క్యాంటీన్‌లో వీరికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు భోజనాలు చేసేదాకా భూపాలపల్లి నుంచి వచ్చిన సందర్శకులు అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో నిరీక్షిస్తున్నారు. వీరి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను చేయడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించారు.