సీఎం ఇచ్చిన హామీల్లో కొన్నింటికే మోక్షం
ఏడాది గడిచినా తీరని సమస్యలు
పరిష్కారం కోసం ప్రజల ఎదురుచూపులు
భూపాలపల్లి: సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోలేదు. వరాల జల్లులు కురిపించి ఏడాది కావస్తున్నా అభివృద్ధి మాత్రం కానరావడం లేదు. 2015 జనవరి 9న గణపురం మండలంలోని చెల్పూరు కేటీపీపీ ఆవరణలో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ రాష్ట్ర, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం మూలంగా పలు పనులు నత్తనడకన సాగుతుండగా మరికొన్ని నేటికి ప్రారంభానికి నోచుకోలేదు.
అమలుకు నోచుకోని హామీలు...
భూపాలపల్లిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తానని, సమావేశం మ రుసటి రోజే ప్రతిపాదనలు పంపాలని అప్పటి జిల్లా కలెక్టర్ కిషన్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయ ఏర్పాటుకు సంభందించిన ఫైలు నేటికీ హైదరాబాద్‌కే పరిమితమైందని సమాచారం.
భూపాలపల్లి పట్టణంలో 11 ప్లాట్‌ఫాంలతో కూడిన బస్టాండ్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఏడాది జూన్ 29న బస్టాండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కాగా నేటికి పనులు ప్రారంభం కాలేదు. అలాగే నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బస్‌షెల్టర్లు నిర్మించి ఇవ్వాలని సింగరేణి సీఎండీ శ్రీధర్, మండల కేంద్రాల్లో బస్టాండ్లు నిర్మించేందుకు సహకరించాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌కు సీఎం సూచించారు. ఇందుకు వారు అంగీకరించగా మే నెలలోపు నిర్మాణాలు పూర్తి చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. అయితే ఈ పనులు నత్తనడకనే సాగుతున్నాయి.
నియోజకవర్గంలోని గణపురం, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్ళపల్లి మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం 58 కిలో మీటర్లకు రూ. 35 కోట్లను కేటాయించారు. ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. అలాగే కరీంనగర్ జిల్లా మంథని నుంచి చిట్యాలకు రోడ్డు, బ్రిడ్జిల నిర్మాణ నిమిత్తం రూ. 22 కోట్లు కేటాయించగా ఆ పనులు అటకెక్కాయి.
శాయంపేట మండలంలోని జోగంపల్లి-కొప్పుల, గణపురం మండలంలోని వెల్తుర్లపల్లి-వెంకటాపురం మండలం గుర్రంపేట, మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి-వేములపల్లి, గణపురం-ధర్మారావుపేట గ్రామాల మధ్య గల వాగులపై హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 30 కోట్లు కేటాయించారు. ఆ పనులు కాగితాలకే పరిమితమయ్యాయి.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోయినప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకై భూపాలపల్లి, చిట్యాలలో ట్రాన్స్‌ఫార్మర్ స్టాక్ పాయింట్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. అయితే పాయింట్‌లు ఏర్పాటు చేసినప్పటికీ అందులో ట్రాన్స్‌ఫార్మర్‌లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైతులకు తిప్పడం తప్పడం లేదు.
నత్తనడకన పనులు... భూపాలపల్లి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం నత్తనడకన కొనసాగుతుండగా చిట్యాలలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం టెండర్ దశలో ఉంది. అంతర్గత రోడ్ల ఏర్పాటు నిమిత్తం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి రూ. 15 లక్షలు, శివారు గ్రామాలకు రూ. 10 లక్షల చొప్పున రూ. 33.15 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారు. ఆ పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా రాష్ట్ర సీఎం కేసీఆర్ సంభందితాధికారులను ఆదేశించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
కానరాని అభివృద్ధి
Published Tue, Jan 5 2016 1:12 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM
Advertisement
Advertisement