ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?
► ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు ‘సుప్రీం’ ప్రశ్న
► వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ ఉత్తర్వులు
► వచ్చే నెల 8వ తేదీకి విచారణ వాయిదా
► ఆదేశాలను వెంటనే అమలు చేయాలి: ఎమ్మెల్యే సంపత్
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఎప్పటిలోగా పరిష్కరిస్తారని శాసన సభాపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వారంరోజుల్లో సమాధానం చెప్పాలంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిరాయిం పుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ శాసన సభాపతికి పిటిషన్ సమర్పించామని.. కానీ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సుప్రీం లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత ప్రతివాదుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తమ తరఫు సీనియర్ న్యాయవాది, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందుబాటులో లేరని... స్పీకర్‌కు, ఇతర ప్రతివాదులకు నోటీసులు కూడా అందనందున కొంత సమయం కావాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిని పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తప్పుబట్టారు. ఈ కేసులో జాప్యం చేసేందుకు ప్రతివాదులు ప్రయత్నిస్తున్నారని, నోటీసులు అందలేదనడంలో వాస్తవం లేదని కోర్టుకు వివరించారు. పిటిషనర్ స్వయంగా స్పీకర్‌కు శాసనసభలోనే నోటీసులు అందజేశారని.. దానిపై ప్రసార సాధనాలు వార్తలు కూడా ప్రసారం చేశాయని తెలిపారు.
అంతేగాకుండా గతేడాది ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించినప్పుడు స్పీకర్ అనర్హత పిటిషన్లను త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నదని.. కానీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లేదని చెప్పారు. దీంతో జస్టిస్ కురియన్ జోసెఫ్ స్పందిస్తూ.. ‘అనర్హత పిటిషన్లను పరిష్కరించేందుకు ఎంత సమయం కావాలో వారం రోజుల్లో ఐదో ప్రతివాది (స్పీకర్) సమాధానం చెప్పాలి..’’ అని ఆదేశించారు. తగిన సూచనలు తీసుకుని విచారణకు రావాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులకు సూచిస్తూ విచారణను నవంబర్ 8కి వాయిదా వేశారు. కాగా టీడీపీ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా.. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కోసం అప్పట్లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ స్వయంగా తానే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
సాగదీత యత్నాలకు కోర్టు చెక్: సంపత్
సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ‘‘టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ నుంచి ఏడుగురిని, మిగతా పార్టీలన్నింటి నుంచి 24 మందిని లాక్కుంది. డబ్బు సంచులు, పదవులు ఎరచూపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ విప్‌గా వివిధ స్థాయిల్లో న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు నుంచి ఈరోజు చక్కటి ఆదేశాలు వెలువడ్డాయి. వాయిదాలతో జాప్యం చేసే కుయుక్తులకు ఇదొక పరిష్కారం. సాగదీత ప్రయత్నాలను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నోటీసులు అందలేదని ప్రతివాదులు చేసిన వాదనలను కూడా నమ్మలేదు. నైతిక విలువలపై నమ్మకముంటే ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి..’ అని సంపత్ పేర్కొన్నారు. 2014లో ఎన్నికలు జరిగితే అదే ఏడాది ఆగస్టులో అనర్హత పిటిషన్ వేశామని.. కానీ స్పీకర్ పరిష్కరించలేదని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ పేర్కొన్నారు. హైకోర్టుకు వెళితే త్వరితగతిన పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిందని... అయినా స్పీకర్ ఇప్పటివరకు పరిష్కరించలేదని చెప్పారు. తాజాగా సుప్రీంకోర్టు మా పిటిషన్‌లో ఐదో ప్రతివాది అయిన స్పీకర్‌కు ఆదేశాలు జారీచేసిందని.. ఇది ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు.