తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత కాలవ్యవధిలో చర్యలు తీసుకొనేలా స్పీకర్ కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది.
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి 22 నెలలు కావస్తున్నా స్పీకర్ ఇంత వరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వివేక్ తన్కా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం స్పీకర్‌కు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం పిటిషనర్ తరఫు మరో న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనేలా స్పీకర్‌ను ఆదేశించాలని గతంలో వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాం. కోర్టు సానుకూలంగా స్పందించి దస్తీ నోటీసులు జారీ చేసింది’’ అని చెప్పారు. ఇదే కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబె ల్లి దయాకర్‌రావు (టీఆర్‌ఎస్‌లో చేరక ముందు) దాఖలు చేసిన పిటిషన్ కూడా కలసి ఉండడంతో అందరికీ నోటీసులు జారీ కానున్నాయి. ఇప్పుడు ఎర్రబెల్లి కూడా పార్టీ మారడం గమనార్హం.