బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక ముందు గత నెల 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యతోపాటు ఆమె తాత మధుసూదనాచారి, బాబాయి పమ్మి రాజేష్ మృతిచెంది నెలన్నర కావొస్తున్నది. ఇక్కడ ప్రమాదాలు జరుగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సరిగ్గా నలభై రోజుల క్రితం మంత్రి కేటీఆర్ పర్యటించి నెల రోజుల్లో నివేదిక అందజేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
అయినా సంబంధిత అధికారులు ఇంతవరకు నివేదిక అందజేయలేదు. ఇక్కడున్న బాటిల్ నెక్ రోడ్డుతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గతంలోనే ట్రాఫిక్ పోలీసులు నివేదికలు అందించారు. శ్మశాన వాటిక ప్రహరీ ఆనుకొని ర్యాంప్ నిర్మించాలని, దీనివల్ల ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలుంటుందని, వాహనాల రద్దీ బాటిల్ నెక్ వద్ద తగ్గుతుందని నిర్ధారించారు. ఆ మేరకు ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా ఇక్కడ పర్యటించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు బుట్టదాఖలయ్యాయి. ఆ కొద్ది రోజులకే చిన్నారి రమ్య ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అనంతరం మంత్రి కేటీఆర్ ఇక్కడ పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన ఆదేశాలు కూడా బుట్టదాఖలయ్యాయి.
ఇంతవరకు ఇక్కడ ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదు. రోడ్డులో ఇంజనీరింగ్ లోపాలున్నాయని, మధ్యలో ఉన్న డివైడర్ ఎత్తు పెంచాలని, రోడ్డును వెడల్పు చేయాలని ప్రతిపాదించారు. అయితే రమ్య మృతి తరువాత మంత్రి కేటీఆర్ తప్పితే ఆ శాఖ అధికారులు ఒక్కసారి కూడా ఇక్కడ పర్యటించలేదు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం కూడా చేయలేదు. దీంతో రమ్య మృతి తరువాత సరిగ్గా అదే ప్రాంతంలో మరో నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఇంత జరిగినా అధికారుల్లో చలనం ఉండటం లేదు. మంత్రి ఆదేశిస్తే మాకేంటి అన్న చందంగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డుపై ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.