స్వచ్ఛ హైదరాబాద్ పేరుకు మాత్రమే. నగరంలో మాత్రం ఎక్కడ చెత్త అక్కడ ’పేరు’కు పోయినా పట్టించుకునే నాథుడే కరువు. అది కూడా ఏ గల్లీలోనో, వీధిలోనే అనుకుంటే పొరపాటు. హైదరాబాద్ నగర నడిబొడ్డు..పంజాగుట్ట సర్కిల్‌లోనే. ప్రతిరోజు ఆ మార్గంలో వీఐపీల వాహనాలు రయ్యమంటూ దూసుకుపోతాయే...కానీ పక్కనే ఉన్న ’చెత్త’ను పట్టించుకునేదెవరు?. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా అంటూ జీహెచ్‌ఎంసీ ప్రకటనలతో ఊదరగొట్టినా....డో కేర్ అనేవాళ్లే. డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకోకుండా తమ షాపుల్లోని చెత్తను తెచ్చి దర్జాగా రోడ్డు మీదే వేసేస్తూ... నడక దారిని ’చెత్త’తో మూసేస్తున్నారు. పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద రెండు రోడ్లను కలుపుతూ నడక దారిన వెళ్లేవారికి...’గట్ట’లుగా చెత్తా చెదారం దర్శనమిస్తూ...నడిచేందుకు దారే లేకుండా పోయింది. గత కొద్ది రోజులుగా ఇదే దృశ్యం కనిపిస్తున్నా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మాత్రం చెత్త కనిపించకపోవడం విడ్డూరం.
ఇక స్వచ్ఛనగరం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) అధికారులు ఎన్ని చర్యలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, పలు ర్యాంకులు సాధించినా నగరంలో ‘చెత్త’శుద్ధి కనిపించడంలేదు. చుట్టపక్కల హోటళ్లతో పాటు పలువురు ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన చెత్త కుమ్మరిస్తున్నారు. చెత్త సమస్యకు యాప్ పరిష్కారం అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ...స్మార్ట్ ఫోన్‌లో ఫొటో తీసి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక యాప్‌కు పంపితే చాలు చిటికెలో చెత్త మాయం అని చెబుతున్న అధికారులు ఈ సమస్యను ఎప్పటికి తీరుస్తారో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment