Garbage Dumps
-
Siddipet: తడి చెత్తతో సీఎన్జీ
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా తడి చెత్తతో సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) తయారు చేసే ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్వచ్ఛబడిని ఏర్పాటు చేసి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి, హానికరమైన చెత్తను సేకరిస్తున్నారు. ఇప్పటికే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నా, అంచనాలకు మించి చెత్త రావడంతో బెంగళూరు తరహాలో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. మంత్రి ఆలోచన మేరకు మున్సిపల్ అధికారులు ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యయం.. రూ.4.7 కోట్లు సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.4.7 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షెడ్ నిర్మాణం చివరి దశకు చేరింది. స్వచ్ఛ భారత్ నిధులతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నారు. ఈ మున్సిపాలిటీలో 39,616 కుటుంబాల్లో 1.46 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ నిత్యం 25 టన్నుల తడి చెత్త సేకరిస్తున్నారు. ప్రాజెక్ట్ నమూనా చిత్రం గ్యాస్ తయారీ ఇలా ఇంటింటా సేకరించిన తడి చెత్తను తొలుత క్రషింగ్ చేస్తారు. అనంతరం దీనిని పైపు ద్వారా ఫ్రి డైజెస్టర్ అనే ట్యాంక్‌లోకి పంపిస్తారు. తర్వాత డైజెస్టర్ ట్యాంక్‌లోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి 14 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తు ఉన్న మరో ట్యాంక్‌లోకి ఇక్కడ తయారైన ద్రావణాన్ని పంపిస్తారు. అనంతరం ఆ ట్యాంక్‌లో మైక్రో ఆర్గాన్లను వేస్తారు. ఆ సమయంలో విడుదలయ్యే మిథేన్ గ్యాస్ నుంచి సీఎన్జీని వేరు చేసి సిలిండర్లలో నింపుతారు. నిర్వహణ బాధ్యత ప్రైవేటుకు గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపాలిటీతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. గ్యాస్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని 25 శాతం మున్సిపాలిటీ, 75 శాతం కంపెనీ తీసుకుంటాయి. ఆగస్టు చివరి వరకు పూర్తి ఆగస్టు చివరి నాటికి గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తవు తుంది. అనంతరం ప్రైవేట్ కంపెనీకి నిర్వహణ బాధ్య తలు అప్పగిస్తాం. దాదాపు ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. –రమణాచారి, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట -
చెత్త పేరుతో సంపద లూటీ!
సాక్షి, లింగసముద్రం(ప్రకాశం) : చెత్తతో సంపద తయారీ కేంద్రాల మాట ఎలా ఉన్నా ఆ పేరు చెప్పి మండలంలో అధికార పార్టీ నాయకులు బాగానే సంపాదించుకుంటున్నారు. చెత్త సేకరణ పేరుతో చేపట్టిన సంపద కేంద్రాల నిర్మాణాలు గ్రామస్థాయి నాయకులకు వరంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వర్మీ కంపోస్ట్ షెడ్లు టీడీపీ నాయకులు ఉపాధిగా మలుచుకుని లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇదీ..పరిస్థితి లింగసముద్రం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే సర్పంచ్ల పదవీ కాలం ముగియగానే టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షల నుంచి 9 లక్షల వరకు మంజూరు కావడంతో ఇదే అదునుగా భావించి నిర్మాణాలు మొదలు పెట్టారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లింపులు ఉండటంతో టీడీపీ నాయకులు ఆడిందే ఆటగా ఉంది. నిర్మాణాలు పూర్తి చేయకుండానే మొత్తం బిల్లులు కాజేశారు. నిరుపయోగంగా ఉన్న సంపద కేంద్రం షెడ్డు మండలంలో 16 గ్రామ పంచాయతీల్లో కొన్ని సంపద కేంద్రాలు పూర్తయ్యాయి. మిగిలిన సంపద కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటన్నింటికీ దాదాపుగా రూ.1.09 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. గ్రామాలకు దూరంగా వీటిని నిర్మించడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేది స్పష్టమవుతోంది. ఈ సంపద కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు రాత్రిళ్లు వ్యభిచారం, పగలు పేకాట వంటివి జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాల్సి ఉన్నా టీడీపీ నాయకుల స్థలాలకు అనువుగా ఉంటాయన్న చోట ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రం లింగసముద్రం గ్రామానికి చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గ్రామానికి దాదాపు మూడు కిలో మీటర్ల దూరంలో నిర్మించారు. రూ.8 లక్షల వ్యయంతో ఈ సంపద కేంద్రాన్ని తాటాకుల కప్పుతో ఏడాది క్రితం నిర్మించారు. తాటాకుతో నిర్మించి ఏడాది కావడంతో తాటాకు లేచి పోయి శిథిలావస్థకు చేరింది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే మండలంలోని పంచాయతీల్లో చెత్త పేరుతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించినా అవి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. సంపద కేంద్రాల వినియోగించక పోవడంతో గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్తా చెదారం, మట్టి దిబ్బలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. చెత్తా చెదారం మురుగు కాలువల్లో పడి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్వహణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ దూతలు ఎక్కడా కనిపించడం లేదు. చెత్త సేకరణ రిక్షాల కొనుగోలు ఊసేలేదు. పంచాయతీల్లో రిక్షాలను కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నా అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. -
పంజాగుట్టలో ఇదేమీ ‘చెత్త’
స్వచ్ఛ హైదరాబాద్ పేరుకు మాత్రమే. నగరంలో మాత్రం ఎక్కడ చెత్త అక్కడ ’పేరు’కు పోయినా పట్టించుకునే నాథుడే కరువు. అది కూడా ఏ గల్లీలోనో, వీధిలోనే అనుకుంటే పొరపాటు. హైదరాబాద్ నగర నడిబొడ్డు..పంజాగుట్ట సర్కిల్లోనే. ప్రతిరోజు ఆ మార్గంలో వీఐపీల వాహనాలు రయ్యమంటూ దూసుకుపోతాయే...కానీ పక్కనే ఉన్న ’చెత్త’ను పట్టించుకునేదెవరు?. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా అంటూ జీహెచ్ఎంసీ ప్రకటనలతో ఊదరగొట్టినా....డో కేర్ అనేవాళ్లే. డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకోకుండా తమ షాపుల్లోని చెత్తను తెచ్చి దర్జాగా రోడ్డు మీదే వేసేస్తూ... నడక దారిని ’చెత్త’తో మూసేస్తున్నారు. పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద రెండు రోడ్లను కలుపుతూ నడక దారిన వెళ్లేవారికి...’గట్ట’లుగా చెత్తా చెదారం దర్శనమిస్తూ...నడిచేందుకు దారే లేకుండా పోయింది. గత కొద్ది రోజులుగా ఇదే దృశ్యం కనిపిస్తున్నా జీహెచ్ఎంసీ సిబ్బందికి మాత్రం చెత్త కనిపించకపోవడం విడ్డూరం. ఇక స్వచ్ఛనగరం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు ఎన్ని చర్యలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, పలు ర్యాంకులు సాధించినా నగరంలో ‘చెత్త’శుద్ధి కనిపించడంలేదు. చుట్టపక్కల హోటళ్లతో పాటు పలువురు ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన చెత్త కుమ్మరిస్తున్నారు. చెత్త సమస్యకు యాప్ పరిష్కారం అంటూ జీహెచ్ఎంసీ అధికారులు ...స్మార్ట్ ఫోన్లో ఫొటో తీసి జీహెచ్ఎంసీ ప్రత్యేక యాప్‌కు పంపితే చాలు చిటికెలో చెత్త మాయం అని చెబుతున్న అధికారులు ఈ సమస్యను ఎప్పటికి తీరుస్తారో చూడాలి మరి. -
జ్వరం.. భయం
- ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు - రోజూ వందల సంఖ్యలో జ్వర పీడితులు - 20కి పైగా డెంగీ అనుమానిత కేసులు - రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారం - చేతులెత్తేసిన పట్టణ ఆరోగ్య శాఖ - వర్షం వస్తే పరిస్థితి మరింత దయనీయం - ఆందోళన చెందుతున్న వైద్యులు ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఏ వీధిలో చూసినా పేరుకుపోయిన చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. రెండు వారాల నుంచి పడి ఉన్న వ్యర్థాలు విపరీతమైన దుర్గాంధాన్ని వెదజల్లుతున్నాయి. మురికి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో చాలా చోట్ల వీధుల్లో మురికి నీరు ప్రవహిస్తోంది. జనం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టగానే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మరో వారం కొనసాగితే ఇంటికో రోగి ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు తీవ్రంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పట్టణంలో వీధులన్నీ మురికి మయం కావడంతో డయేరియా, మలేరియా జ్వరాలు కూడా తీవ్రతరమవుతున్నాయి. పది రోజుల క్రితం వరకూ జిల్లా ప్రభుత్వాసుపత్రికి సాధారణ కేసులు మాత్రమే వచ్చేవి. జలుబు, స్త్రీల వ్యాధులు, వృద్ధుల కేసులు, ఒళ్లు నొప్పులు లాంటి వ్యాధులతో ప్రజలు ఆస్పత్రికి వచ్చేవారు. ప్రతి రోజూ 400 దాకా ఓపీ ఉండేది. వారం రోజులుగా ఓపీ భారీగా పెరిగింది. ప్రతి రోజూ 600 మంది ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో మలేరియా జ్వరాలతో సుమారు 100 మందికి పైగా వస్తున్నారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నాలుగైదు రోజుల నుంచి ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో 20-25 మంది దాకా ఉంటున్నారు. మిగతా వారందరూ వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రికి వస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందడం వల్లే జ్వరాలు అధికమవుతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కాగా, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. పరీక్షల కోసం వచ్చిన వారితో ల్యాబ్‌లు కిక్కిరిశాయి. పలువురికి డెంగీ అనుమానిత జ్వరాలు పట్టణంలో ఐదారు రోజులుగా డెంగీ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో కూడా నాలుగు రోజుల నుంచి ప్రతి రోజూ ఒకటి, రెండు కేసులు డెంగీ అనుమానిత కేసులు వస్తున్నట్లు వైద్యులు చెప్పారు. రెండు రోజుల క్రితం రెడ్డిగారి వీధికి చెందిన ఆరేళ్ల బాలిక ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరింది. జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో నివాసం ఉంటున్న ఏడేళ్ల బాలికకు ప్లేట్లెట్స్ తగ్గడంతో రెండు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. డీసీఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న బాషా అనే 23 ఏళ్ల యువకుడికి డెంగీ లక్షణాలు క న్పించడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. ఐదారు రోజుల్లో సుమారు 20కి పైగా డెంగీ అనుమానిత కేసులు నమోదైనట్లు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యుల సమాచారం. డెంగీ లక్షణాలున్న వారు కర్నూలు, తిరుపతిలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఇలాగే ఉంటే పరిస్థితి ప్రమాదకరం ఇప్పటికే కమలాపురం, కడప, పోరుమామిళ్ల, రాయచోటి, కొండాపురం ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయాయి. దీనికి తోడు వర్షం వస్తే మాత్రం దోమల సమస్య తీవ్రతరమవుతుంది. అదే జరిగితే డెంగీ కేసులు మరిన్ని నమోదయ్యే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దోమతెరలు తప్పనిసరిగా వాడాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. జ్వరమొస్తే సొంత వైద్యం మాని ఆస్పత్రికి రావాలి’ అని పట్టణంలోని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ బుసిరెడ్డి తెలిపారు.