తాటాకు లేచి శిథిలమవుతున్న సంపద కేంద్రం
సాక్షి, లింగసముద్రం(ప్రకాశం) : చెత్తతో సంపద తయారీ కేంద్రాల మాట ఎలా ఉన్నా ఆ పేరు చెప్పి మండలంలో అధికార పార్టీ నాయకులు బాగానే సంపాదించుకుంటున్నారు. చెత్త సేకరణ పేరుతో చేపట్టిన సంపద కేంద్రాల నిర్మాణాలు గ్రామస్థాయి నాయకులకు వరంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వర్మీ కంపోస్ట్ షెడ్లు టీడీపీ నాయకులు ఉపాధిగా మలుచుకుని లక్షలాది రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం దర్శనమిస్తోంది.
ఇదీ..పరిస్థితి
లింగసముద్రం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద కేంద్రాలు నిర్మించేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే సర్పంచ్‌ల పదవీ కాలం ముగియగానే టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ.4 లక్షల నుంచి 9 లక్షల వరకు మంజూరు కావడంతో ఇదే అదునుగా భావించి నిర్మాణాలు మొదలు పెట్టారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లింపులు ఉండటంతో టీడీపీ నాయకులు ఆడిందే ఆటగా ఉంది. నిర్మాణాలు పూర్తి చేయకుండానే మొత్తం బిల్లులు కాజేశారు.
నిరుపయోగంగా ఉన్న సంపద కేంద్రం షెడ్డు
మండలంలో 16 గ్రామ పంచాయతీల్లో కొన్ని సంపద కేంద్రాలు పూర్తయ్యాయి. మిగిలిన సంపద కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటన్నింటికీ దాదాపుగా రూ.1.09 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. గ్రామాలకు దూరంగా వీటిని నిర్మించడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేది స్పష్టమవుతోంది. ఈ సంపద కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు రాత్రిళ్లు వ్యభిచారం, పగలు పేకాట వంటివి జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాల్సి ఉన్నా టీడీపీ నాయకుల స్థలాలకు అనువుగా ఉంటాయన్న చోట ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రం లింగసముద్రం గ్రామానికి చెత్త సంపద తయారీ కేంద్రాన్ని గ్రామానికి దాదాపు మూడు కిలో మీటర్ల దూరంలో నిర్మించారు. రూ.8 లక్షల వ్యయంతో ఈ సంపద కేంద్రాన్ని తాటాకుల కప్పుతో ఏడాది క్రితం నిర్మించారు. తాటాకుతో నిర్మించి ఏడాది కావడంతో తాటాకు లేచి పోయి శిథిలావస్థకు చేరింది.
గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే
మండలంలోని పంచాయతీల్లో చెత్త పేరుతో సంపద తయారీ కేంద్రాలు నిర్మించినా అవి నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. సంపద కేంద్రాల వినియోగించక పోవడంతో గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్తా చెదారం, మట్టి దిబ్బలు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. చెత్తా చెదారం మురుగు కాలువల్లో పడి అస్తవ్యస్తంగా మారుతున్నాయి. చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్వహణకు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ దూతలు ఎక్కడా కనిపించడం లేదు. చెత్త సేకరణ రిక్షాల కొనుగోలు ఊసేలేదు. పంచాయతీల్లో రిక్షాలను కొనుగోలు చేశామని అధికారులు చెబుతున్నా అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment