రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద గోపాల్ కుటుంబం
లింగసముద్రం : ‘ఊళ్లో ఉంటే గోపాలరావు, అతని అనుచరులు మమ్మల్ని బతకనివ్వరు.. అందుకే ఊరి విడిచి వచ్చాం.. ఎక్కడికెళ్లాలో తెలియడం లేదు.. ’ అంటూ ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు గోపాల్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద తల దాచుకుని భయంభయంగా గడుపుతున్నారు. లింగసముద్రం మండలం మొగిలిచర్లలో గత ఆదివారం దిబ్బ విషయంలో వివాదం చెలరేగి టీడీపీ నేత వేముల గోపాలరావుతో పాటు అతని అనుచరులు చేసిన దాడిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గోరంట్ల గోపాల్ బంధువైన బొల్లినేని లక్ష్మీకాంతమ్మ గాయపడింది.
చికిత్స కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మంగళవారం రాత్రి ఆమె తన ఇంటికి చేరుకుంది. మళ్లీ గోపాలరావు అనుచరులైన చినమాలకొండయ్య, వెంకాయమ్మతో పాటు మరికొందరు మహిళలు బుధవారం ఒక్కసారిగా గోరంట్ల గోపాల్ ఇంటికెళ్లి ఆయన భార్య గీత, అత్త లక్ష్మీకాంతమ్మలపై దాడి చేశారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి వారిని వారించి అక్కడి నుంచి పంపించేశారు. గ్రామంలో ఉంటే గోపాలరావు, అతని అనుచరులు తమను బతకనివ్వరని గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద తల దాచుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారని, భయమేస్తోందంటూ గోపాల్ భార్య కన్నీళ్లపర్యంతమయ్యారు. తాము వైఎస్సార్‌సీపీకి ఓటు వేయడాన్ని గోపాలరావు జీర్ణీంచుకోలేకపోతున్నాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment