పోలీసులతో వాగ్వాదం చేస్తున్న కొండపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి
ఒంగోలు అర్బన్: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకుని.. నిస్సిగ్గుగా శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలో సవలం సుధాకర్ భార్య హనుమాయమ్మ(48) అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన సవలం కొండలరావు(బుజ్జి) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటాడు.
కొన్నేళ్లుగా వీరి మధ్య భూ తగాదా ఉంది. అతను వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో హనుమాయమ్మ సోమవారం తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. కొండలరావు తన ట్రాక్టర్ నాగేలు అడ్డతో ఆమెను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె కింద పడటంతో వెనుక టైరుతో తొక్కించాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి.. హనుమాయమ్మ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఒంగోలు జీజీహెచ్ వద్ద మంగళవారం హైడ్రామా నడిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ హడావుడి చేశారు. పాత కక్షలు, కుటుంబ తగాదాలతోనే సదరు మహిళను హత్య చేశారని ఆ గ్రామ ప్రజలంతా స్పష్టంగా చెబుతున్నా, రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు.
చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు
ఆందోళన చేస్తున్న వారి వద్దకు స్వయంగా వచ్చిన ఆర్డీవో, టంగుటూరు తహశీల్దార్‌లు.. మానవతా దృక్పథంతో వీలైనంత మేర ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయినా టీడీపీ నేతలు వినిపించుకోకుండా నానా యాగీ చేశారు. టీడీపీ నేతల వైఖరిని కళ్లారా చూసిన వారంతా.. ఇదేం రాజకీయం అంటూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, మహిళ మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి భర్త తన అన్న భార్యపై కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తూ.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment