సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వాహనచోదకులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఆదివారం నాటికీ ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.
అసలేం జరిగిందంటే...
బల్కంపేటకు చెందిన విద్యార్థి యాదగిరి (22) తన ద్విచక్ర వాహనంపై, తన సమీప బంధువు అనిల్‌తో (20) కలిసి ఉప్పల్ నుంచి వస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నాంపల్లి వాసి నవీన్ (31) తన బైక్‌పైప్రయాణిస్తూ రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నవీన్ వాహనాన్ని యాదగిరి వాహనం ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలూ దాదాపు వంద అడుగులు జారుకుంటూ వెళ్లాయి. దీంతో అనిల్, యాదగిరి తీవ్రంగా గాయపడగా... నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఆ కాస్త దూరం వెళ్లలేక...
తన వాహనంపై వస్తున్న నవీన్ ఘటనాస్థలి వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ రాజ్‌భవన్ వైపు వెళ్లాల్సి ఉంది. వేగంగా వస్తున్న అతడు దాన్ని దాటి కాస్త ముందుకు వచ్చేశారు. ఇలా జరిగినప్పుడు కేవలం 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా వరకు వచి్చ, అక్కడ యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంది. ఈ కాస్త దూరం ముందుకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహించిన అతడు తాను ప్రయాణిస్తు మార్గంలోనే రాంగ్ రూట్‌లో వెనక్కు వచ్చి నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి రాజ్‌భవన్ వైపు వెళ్లే రోడ్డులోకి రావాలని ప్రయత్నించారు.
పరిమితికి మించిన వేగం...
ఈ ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన పోలీసులు దాన్ని విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో యాదగిరి తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపినట్లు గుర్తించారు. సిటీ రోడ్లలో ఏ సమయంలోనైనా గరిష్టంగా గంటలకు 40 కిమీ వేగం మంచిది కాదు. అయితే ప్రమాద సమయంలో ఈ వాహనం గంటలకు దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వేగమని చెప్తున్నారు.
హఠాత్తుగా ఇటు రావడంతో...
ఇంత స్పీడుగా వస్తున్న వీరి దృష్టి యూ టర్న్ వద్ద రాజ్‌భవన్ వైపు నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే వాహనాలపై మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం అలానే రావాలి. అయితే నవీన్ అదే రోడ్‌లో, రాంగ్ రూట్‌లో వ్యతిరేక దిశలో వచ్చి యూ టర్న్ వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చి రాజ్‌భవన్ వైపు వెళ్లే మార్గంలో ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక నవీన్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ధాటికి ఆ వాహనం పెట్రోల్ ట్యాంక్ వద్ద వంగిపోయిందని పోలీసులు చెప్తున్నారు.
హెల్మెట్ వాడకపోవడంతోనే...
ప్రమాదానికి కారణమైన, ప్రమాదానికి గురైన రెండు వాహనాలపై ఉన్న చోదకులూ హెల్మెట్లు ధరించలేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రెండూ 220 సీసీ, 180 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలైనప్పటికీ చోదకులు హెల్మెట్లు ధరించలేదు. చిన్న పాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది వాహనచోదకులకు గుణపాఠం కావాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment