Raj Bhavan Road
-
Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు అడిషనల్ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయన్నారు. సీటీఓ జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్‌పీఎస్ స్కూల్ ఔట్‌గేట్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎంటీఎస్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట, మెహిదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్లో రాకుండా అప్పర్ ట్యాంక్‌బండ్ పై నుంచి వెళ్లేందుకు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. రాజ్‌భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ (ఖైరతాబాద్) ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్ క్లోజ్ ఉంటుంది. పంజాగుట్ట రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్, మినిష్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్‌పురా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్‌నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల చేస్తారు. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అడిషనల్ సీపీ (నేరాలు, శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో నకిలీ మందుల కలకలం.. రూ.కోటి విలువైన మందులు స్వాధీనం -
ఒక్క ప్రమాదం.. ఎన్నో పాఠాలు.. ఆ కాస్త దూరం వెళ్లలేక!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వాహనచోదకులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఆదివారం నాటికీ ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అసలేం జరిగిందంటే... బల్కంపేటకు చెందిన విద్యార్థి యాదగిరి (22) తన ద్విచక్ర వాహనంపై, తన సమీప బంధువు అనిల్‌తో (20) కలిసి ఉప్పల్ నుంచి వస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నాంపల్లి వాసి నవీన్ (31) తన బైక్పైప్రయాణిస్తూ రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నవీన్ వాహనాన్ని యాదగిరి వాహనం ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలూ దాదాపు వంద అడుగులు జారుకుంటూ వెళ్లాయి. దీంతో అనిల్, యాదగిరి తీవ్రంగా గాయపడగా... నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కాస్త దూరం వెళ్లలేక... తన వాహనంపై వస్తున్న నవీన్ ఘటనాస్థలి వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ రాజ్‌భవన్ వైపు వెళ్లాల్సి ఉంది. వేగంగా వస్తున్న అతడు దాన్ని దాటి కాస్త ముందుకు వచ్చేశారు. ఇలా జరిగినప్పుడు కేవలం 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా వరకు వచి్చ, అక్కడ యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంది. ఈ కాస్త దూరం ముందుకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహించిన అతడు తాను ప్రయాణిస్తు మార్గంలోనే రాంగ్ రూట్లో వెనక్కు వచ్చి నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి రాజ్‌భవన్ వైపు వెళ్లే రోడ్డులోకి రావాలని ప్రయత్నించారు. పరిమితికి మించిన వేగం... ఈ ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన పోలీసులు దాన్ని విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో యాదగిరి తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపినట్లు గుర్తించారు. సిటీ రోడ్లలో ఏ సమయంలోనైనా గరిష్టంగా గంటలకు 40 కిమీ వేగం మంచిది కాదు. అయితే ప్రమాద సమయంలో ఈ వాహనం గంటలకు దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వేగమని చెప్తున్నారు. హఠాత్తుగా ఇటు రావడంతో... ఇంత స్పీడుగా వస్తున్న వీరి దృష్టి యూ టర్న్ వద్ద రాజ్‌భవన్ వైపు నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే వాహనాలపై మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం అలానే రావాలి. అయితే నవీన్ అదే రోడ్లో, రాంగ్ రూట్లో వ్యతిరేక దిశలో వచ్చి యూ టర్న్ వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చి రాజ్‌భవన్ వైపు వెళ్లే మార్గంలో ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక నవీన్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ధాటికి ఆ వాహనం పెట్రోల్ ట్యాంక్ వద్ద వంగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. హెల్మెట్ వాడకపోవడంతోనే... ప్రమాదానికి కారణమైన, ప్రమాదానికి గురైన రెండు వాహనాలపై ఉన్న చోదకులూ హెల్మెట్లు ధరించలేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రెండూ 220 సీసీ, 180 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలైనప్పటికీ చోదకులు హెల్మెట్లు ధరించలేదు. చిన్న పాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది వాహనచోదకులకు గుణపాఠం కావాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పరేడ్ నిర్వహించనున్న విజయసంకల్పసభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. కాగా, ప్రధాని మోదీ.. హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సభ అనంతరం ప్రధాని మోదీ.. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డును మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేష్టన్ వైపు వెళ్లే వాహనాలు.. లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్ మీదుగా దారి మళ్లించారు. ఉప్పల్, తార్నాక, చిలకలగూడ మీదుగా స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ మీదుగా బేగంపేట-పంజాగుట్ట రహదారిలో వాహనదారులు రావొద్దని పోలీసులు సూచించారు. సభ నేపథ్యంలో కార్లు, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాంతాలను కేటాయించారు. - జింఖానా గ్రౌండ్స్‌లో విఐపి పార్కింగ్. - పరేడ్ గ్రౌండ్స్ సభాస్థలి సమీపంలో వివిఐపి పార్కింగ్. - శామీర్‌పేట్, కరీంనగర్, సిద్దిపేట్ వారికి దోబిఘాట్‌లో పార్కింగ్. - నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సుచిత్ర, బాలనగర్ మీదుగా వచ్చేవారికి పోలోగ్రౌండ్స్‌లో పార్కింగ్. - వరంగల్, నల్గొండ, ఉప్పల్ నుండి వచ్చే వారికి రైల్ నిలయంలో పార్కింగ్. -మహాబూబ్ నగర్, రంగారెడ్డి, ట్యంక్ బండ్ వైపు నుండి వచ్చేవారికి నక్లెస్ రోడ్డులో పార్కింగ్. -
రాజ్‌భవన్ దారిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోనప్ప ఐలాండ్–వీవీ స్టాచ్యూ, పంజగుట్ట–రాజ్‌భవన్ క్వార్టర్స్ మధ్య ఉన్న మార్గాల్లో సాధారణ వాహన చోదకులను అనుమతించరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేట్ నెం.3–అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మధ్య పార్కింగ్ ఏర్పాటు చేశారు. మీడియా వాహనాలకు దిల్కుష గెస్ట్‌హౌస్‌లో, ప్రభుత్వ వాహనాలు, ప్రముఖుల వాహనాలకు ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్లో పార్కింగ్ కేటాయించారు. మిగిలిన వారి వాహనాలను మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్–వీవీ స్టాచ్యూ మధ్య మార్గంలో రోడ్డు పక్కన నిలుపుకోవచ్చు. -
ఆక్వా నైట్స్
డీజే: అభిషేక్ ఎక్కడ: ది పార్క్ హైదరాబాద్, రాజ్‌భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ ఎప్పుడు: జూలై 5 (శనివారం), రాత్రి 8 గంటలకు.. కేటగిరీ: క్లబ్స్/నైట్‌లైఫ్ ఫ్లీ అఫైర్ నిర్వహణ: ట్రి హగ్గర్స్ ఎక్కడ: లామకాన్, జీవీకే వన్ ఎదురుగా, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ ఎప్పుడు: జూలై 5 (శనివారం), ఉదయం 10.30 నుంచి 6.30 గంటల వరకు.. కేటగిరీ: ఫెస్టివల్స్/ఫెయిర్స్ -
వీవీఐపీ రోడ్లకు డబ్బుల్ ధమాకా
=వేసిన రోడ్లే మళ్లీ వేయడం =మిగతా వాటిపై తీవ్ర నిర్లక్ష్యం =ఏడు రహదారులపైనే మోజు! =ఇదీ జీహెచ్ఎంసీ తీరు.. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు.. కొత్త రోడ్ల పనులపై తాజాగా మరోమారు దృష్షి సారించారు. తొలి ప్రాధాన్యత క్రమంలో ఏడు రోడ్లను ఎంపిక చేశారు. ఈ ఏడు మార్గాల్లోని రహదారులను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంతో పాటు .. మార్గానికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, వరదనీటి కాలువలు, ఇతరత్రా సదుపాయాలతోపాటు పచ్చదనం పెంపు కార్యక్రమాలకూ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంత ఖర్చవుతుందో అంచనాలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలందాయి. ఆయా విభాగాలు ప్రస్తుతం ఆ పనిలో తలమునకలై ఉన్నాయి. ఈ రహదారులను తీర్చిదిద్దితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ.. గ్రేటర్‌లోని అన్ని రోడ్లలో ఇవే అంతో ఇంతో మెరుగ్గా ఉన్నాయి. వీటితోపాటు పరమ అధ్వానంగా ఉన్న మరికొన్ని రోడ్లకు ప్రాధాన్యం కల్పించి ఉంటే ప్రజలకు మేలు కలిగేది. అంతేకాదు, గత సంవత్సరం సీఓపీ సందర్భంగా ఈ మార్గాల్లోనే పనులు చేశారు. మళ్లీ ఇప్పుడు వాటికే కొత్తందాలు దిద్దేందుకు సిద్ధమవుతున్నారు. అప్పుడు సమయం లేనందున, హడావుడి కారణంగా ఫుట్‌పాత్‌ల వంటివి పూర్తి కాలేదని చెబుతున్నారు. వాటినిప్పుడు పూర్తి చేస్తామంటున్నారు. మిగతా ప్రాంతాలవి ఎందుకు పట్టించుకోవడం లేదంటే మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. సమగ్రంగా రహదారుల అభివద్ధి పనులు చేపట్టాలన్నది లక్ష్యమని, వాటిని ఎక్కడో ఒకచోట ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు వీటిని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. కానీ.. కారణం అందరికీ తెలిసిందే. ఇవన్నీ వీవీఐపీలు.. సంపన్నులు అధికంగా సంచరించే మార్గాలు. గ్రీన్‌ల్యాండ్స్ మార్గం సీఎం క్యాంప్ కార్యాలయానికి దారి తీసేది కాగా, రాజ్భన్కున్న ప్రాధాన్యత తెలిసిందే. ఇక అసెంబ్లీ.. సైఫాబాద్ప్రాంతాలు మంత్రులు, ఎమ్మెల్యేలు సంచరించే మార్గాలు. బంజారాహిల్స్ అమాత్యులతోపాటు బడాబడా సంపన్నులు తిరిగే మార్గాలు. అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి తీసేవి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఆరాంఘర్ మార్గాలు. అవి ఎవరి కోసమో తెలిసిందే. ఇలా.. వీఐపీలను ఆకట్టుకోవడానికి అత్యంత శ్రద్ధ చూపుతున్న అధికారులు.. సామాన్య జనం సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రేటర్ ప్రజలంతా ఆస్తిపన్ను చెల్లిస్తున్నప్పుడు అధికారులు కొందరికి మాత్రమే అదనపు సదుపాయాలు సమకూర్చడం.. సామాన్యుల మార్గాలు కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. 20 శాతం సంపన్నులపైనే శ్రద్ధ చూపుతూ 80 శాతం సాధారణ ప్రజల్ని విస్మరించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మూణ్నాళ్లకే మళ్లీ పనులు పై ఏడు మార్గాల్లో ఒకటీ రెండూ మినహా మిగతా మార్గాలన్నింటిలో గత సంవత్సరం సీఓపీ సందర్భంగానూ పనులు చేశారు. అప్పుడు చేసిన పనుల్లో పూర్తికానివి ఇప్పుడు పూర్తి చేస్తామంటున్నారు. అప్పట్లో పనులు చేయని కాంట్రాక్టర్లకు తిరిగి పనులివ్వమని చెబుతున్నారు. ఫుట్‌పాత్‌లు.. వరదనీటి కాలువలు తదితరమైనవి వేరేవారికి అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. రహదారులు చేసిన వారే తిరిగి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున వాటిని మాత్రం సీఓపీ సందర్భంగా చేసిన వారితోనే చేయిస్తామని చెబుతున్నారు. ఇవి ఏమేరకు ఆచరిస్తారో సంబంధిత అధికారులకే తెలియాలి. కోట్లాది రూపాయలు వెచ్చించి చేసిన పనులనే తిరిగి మూణ్నాళ్లకే చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. కొత్త సోకులు వీటికే... 1. రాజ్‌భవన్ రోడ్డు 2. గ్రీన్లాండ్స్ రోడ్డు 3. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ 4. బంజారాహిల్స్ రోడ్డు నెం. 1, 2, 3 5. సైఫాబాద్, అసెంబ్లీ పరిసరాలు 6. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే 7. ఆరాంఘర్- శంషాబాద్ (జీహెచ్ఎంసీ పరిధి వరకు)