నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
రెండ్రోజులపాటు సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: పది రోజుల విరామం తర్వాత అసెంబ్లీ, శాసనమండలి తిరిగి సమావేశం కానున్నాయి. గత నెల 16న మొదలైన ఉభయ సభలు ఇప్పటికే పదహారు రోజుల పాటు జరిగాయి. ఈ నెల 6న స్పీకర్ మధుసూదనాచారి సభను 17వ తేదీకి వాయిదా వేశారు. మొత్తం పది రోజుల పాటు అసెంబ్లీకి సెలవులు ఇచ్చారు. రెండు రోజుల పాటే సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 18వ తేదీతో సమావేశాలు ముగించి, కేంద్ర బడ్జెట్ తర్వాత, తిరిగి ఫిబ్రవరి చివరి వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిరోజు ఒక లఘు చర్చ రూపంలో ప్రభుత్వం చర్చకు పెట్టింది. మంగళవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హైదరాబాద్ అభివృద్ధిపై లఘు చర్చ చేపట్టనున్నారు. బుధవారం (18వ తేదీ) ఎస్సీ, బీసీ సంక్షేమంపై చర్చ జరపాలని ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. మరో రెండ్రోజుల పాటు సమావేశాలను పొడిగించే వీలుందని చెబుతున్నా, ఇప్పటి దాకా పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. ప్రతిపక్షాలు కోరిన దానికంటే ఎక్కువ రోజులే సభను నడిపామని, అర్థవంతమైన చర్చ జరిపామని, ఇంకా సమావేశాలను పొడిగించాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీతో పాటు మండలి కూడా రెండ్రోజుల పాటు సమావేశమవుతుంది.