సభలో క్షమాపణల పర్వం
తమ వ్యాఖ్యలపై మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, కేటీఆర్ విచారం
మైకు విరిచినందుకు క్షమాపణ కోరిన డీకే అరుణ
తన మాటలకు వివరణ ఇచ్చుకున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి క్షమాపణ
మూడు రోజులుగా సభలో క్షమాపణలపైనే రభస
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం క్షమాపణల పర్వమే కొనసాగింది. గ్రామాల్లో రచ్చబండల వద్ద మాట్లాడే మాటలు కుదరవని, సభలో గౌరవ ప్రదమైన భాషనే వాడాలన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సభలో మంత్రులు, ఇతర సభ్యులు ప్రవర్తించిన తీరుపై అన్ని రాజకీయ పక్షాల నేతలతో స్పీకర్ మధుసూదనాచారి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ జరిగిన తీరును వీడియో ఫుటేజీల ద్వారా పరిశీలించారు. మాటలు తూలిన వారు క్షమాపణ చెప్పాల్సిందేనని నిర్ణయించారు. అటు శాసనమండలిలోనూ ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. సభ ప్రారంభంలోనే టీఆర్‌ఎస్ సభ్యులు వేసిన ప్రశ్నకు సమాధానం చెబుతున్న విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్ సభ్యుల కామెంట్లతో సంయమనం కోల్పోయి మాట్లాడారు.
అయితే మంత్రి వ్యాఖ్యలపై సీఎం కూడా అభ్యంతరం తెలపడంతో జగదీశ్‌రెడ్డి తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి విచారం వెలిబుచ్చారు. ఏ ఒక్క సభ్యుడినో ఉద్దేశించి మంత్రి మాట్లాడకున్నా... సీఎల్పీ నేత జానారెడ్డి ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకురావడంతో సీఎం కల్పించుకున్నారు. మరోవైపు పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ మధ్య జరిగిన మాటల యుద్ధం చివరకు స్పీకర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు దారితీసింది. తాను మాట్లాడుతున్న సమయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ డి.కె.అరుణ ఊగిపోయారు.
మైకు విరగ్గొట్టి సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత ఉద్రిక్తతకు దారితీశాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు వీడియో ఫుటేజీల పరిశీలన కోసం సభ 15 నిమిషాలపాటు వాయిదా పడింది. అయితే స్పీకర్ సమావేశం ఏకంగా గంటన్నరపాటు జరిగింది. సభలో రికార్డయిన వీడియోను అన్ని పార్టీల నేతలు పరిశీలించి మంత్రి కేటీఆర్, డీకే అరుణ ఇద్దరూ క్షమాపణలు కోరాలని నిర్ణయించారు. తీరా సభ ఆరంభమయ్యాక తానెందుకు ముందు క్షమాపణ చెప్పాలంటూ అరుణ భీష్మించారు. దీంతో ఆయా సభ్యుల విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేసి సభను నడుపుదామని స్పీకర్ అన్నారు. అయితే టీడీపీ సభ్యులకు ఒక నీతి, ఇతరులకు మరో నీతి ఎలా కుదురుతుందని బీజేపీ నేత లక్ష్మణ్ ప్రశ్నిం చారు. చివరకు అధికారపక్షమే మొదట క్షమాపణ చెబుతుందని సీఎం పేర్కొనడంతో కేటీఆర్ తన మాటలపై విచార ం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డీకేఅరుణ కొద్దిసేపు తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. మైకు విరగ్గొట్టినందుకు క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో ఏ సభ్యుడు ఇలా చేసినా ఇదే తరహాలో క్షమాపణ కోరాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తనను చూసి మహిళలు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఈ సందర్భంగా అరుణ నిలదీశారు. దీంతో కడియం తాను మిహ ళలను కించ పరచలేదని, ఆమె సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకోవైపు శాసనమండలిలోనూ మాటలు హద్దులు దాటాయి. రాష్ట్ర విభజన సమయంలో టీఆర్‌ఎస్ నేతలు గాజులు తొడుక్కుంటున్నారా అని టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి వ్యాఖ్యానించారు. విభజన చట్టం మేరకు రావాల్సిన విద్యుత్ కోటాను ఏపీ సీఎం చంద్రబాబు ఇవ్వడం లేదన్న టీఆర్‌ఎస్ సభ్యుల ఆరోపణలై నర్సారెడ్డి ఆవేశంగా స్పందించారు. చివరకు మహిళలంటే తనకు చులకన భావన లేదని, క్షమాపణ చెబుతున్నానని పేర్కొనడంతో వివాదం సద్దు మణిగింది. జాతీయ గీతాన్ని అవమానపరిచారంటూ తొలి రెండు రోజులూ రభస జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై క్షమాపణలు చెప్పాలని అధికార, విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో టీడీపీ నేతలు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సోమవారం క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలో మూడోరోజు కూడా క్షమాపణల పర్వమే కొనసాగింది.