
బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం
ఎనిమిది నెలల్లోనే రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం.. రూ.2.68 లక్షలకు తలసరి ఆదాయం పెరిగింది
ఎనిమిది నెలల్లోనే 1.14 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాం
పేదరిక నిర్మూలనకే పీ–4 విధానం అమలు
కరువు రహిత రాష్ట్ర లక్ష్యసాధనకే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు
10 పోర్టులను ప్రపంచస్థాయి ఓడరేవులుగా తీర్చిదిద్దబోతున్నాం
మేడ్ ఇన్ ఏపీ పేరిట ప్రతీ వస్తువుకూ భౌగోళిక గుర్తింపు కోసం కృషి
2027 కల్లా పోలవరం, 2029 నాటికి విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
సాక్షి, అమరావతి: ‘సమ్మిళిత ప్రగతి, సుస్థిరాభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర–2047 సాధన కోసం పది సూత్రాలతో సమగ్ర రోడ్‌మ్యాప్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ‘పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధి–జనాభా నియంత్రణ, నైపుణ్యం పెంపుదల–ఉపాధి కల్పన, నీటిభద్రత, రైతు–అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ–విద్యుత్–ఇంధన వినియోగం.. ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర, విస్తృత సాంకేతికత ఏకీకరణ వంటి పది సూత్రాలతో బ్రాండ్ ఆంధ్ర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది’ అన్నారు. గవర్నర్ ఇంకా ఏమన్నారంటే..
12.94 శాతం వృద్ధి రేటు సాధించాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దుచేశాం. 16,347 టీచర్ పోస్టులతో డీఎస్సీ, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయ అనుబంధ రంగాలు 15.86 శాతం, పరిశ్రమలు 6.71 శాతం, సేవా రంగం 11.70 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. 2024–25 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.14.22 లక్షల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు విస్తరించడం ద్వారా 12.94 శాతం వృద్ధి రేటు సాధించాం.
ఫలితంగా.. తలసరి ఆదాయం 2.37 లక్షల నుంచి రూ.2.68 లక్షలకు పెరిగింది. ఎనిమిది నెలల్లోనే రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. తద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. ఎస్సీ వర్గీకరణ అమలుకోసంæ విధి విధానాల రూపకల్పనకు ఏకసభ్య సంఘాన్ని ఏర్పాటుచేశాం. శాసనసభలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తీర్మానం కేంద్రానికి పంపించాం. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులలో 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నాం. ప్రత్యేక బీసీ పరిరక్షణ చట్టం కోసం రోడ్ మ్యాప్‌ను రూపొందించాం.
త్వరలోనే ‘తల్లికి వందనం’..
పిల్లల చదువుల భారం కుటుంబంపై పడకుండా తల్లులకు ఆర్థిక చేయూతనిస్తూ ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరలో అమలుచేయబోతున్నాం. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ కళాశాలల్లో 200 స్కిల్హబ్లను ఏర్పాటుచేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రూ.78 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం. 2029 చివరి నాటికి రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గత 8 నెలల్లో రూ.642.38 కోట్లు ఖర్చుచేసి 1.14 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాం. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల భూమిని సమకూరుస్తూ, నిర్మాణంలో ఉన్న 6.34 లక్షల ఇళ్లను పూర్తిచేయడానికి ప్రణాళిక రూపొందించాం. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజలు–పార్టనర్‌షిప్ (పీ–4) అనే ఒక వినూత్న విధానాన్ని అమలుచేస్తున్నాం. అలాగే, హైబ్రీడ్ బీమా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ప్రతి శానససభ నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేస్తున్నాం.
2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ తదితర నీటి అవసరాల కోసం కొత్తగా రాష్ట్ర జలవిధానాన్ని రూపొందించాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరానికి అనుసంధానం చేస్తున్నాం. కరువు రహిత రాష్ట్ర లక్ష్య సాధన కోసం గోదావరి–బనకచర్లను అనుసంధానిస్తున్నాం. అమృత్–జల్‌జీవన్ మిషన్ 95.44 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీరు అందించాలని నిర్ణయించాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల హెక్టార్లకు విస్తరించడం ద్వారా 50 లక్షల మంది రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ధాన్యం సేకరణలో సవాళ్లను అధిగమించి 48గంటల్లో రైతుల ఖాతాలకు డబ్బులు జమచేస్తున్నా. నిర్మాణంలో ఉన్న 10 పోర్టులను ప్రపంచస్థాయి ఓడరేవులుగా తీర్చిదిద్దుతున్నాం. అలాగే, రూ.22,507 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో చేపడుతున్న విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జాతీయ రూర్బన్ మిషన్ కింద గ్రామీణ–పట్టణ అనుసంధానం చేయాలన్న సంకల్పంతో 13 క్లస్టర్లలో 2,933 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తిచేశాం. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం.
ఆర్టీసీ బస్సులన్నీ విద్యుదీకరణ
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్య ప్రాజెక్టు ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. 7.5 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ (4.0) కింద ఆర్టీసీ వాహనాలన్నింటినీ వంద శాతం విద్యుదీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. 2025–26లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల లేకుండా కట్టడి చేయగలిగాం. హైడ్రోజన్ వ్యాలీ కింద 1,200 టీపీడీ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఉత్పన్నమైన గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్), గ్రీన్ యూరియా వంటి వాటిని ఉత్పత్తి చేయడం ద్వారా గ్లోబల్ బెంచ్ మార్కును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వ సహాయంతో టమాటా, మిరప పంటల కోసం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ ద్వారా కనీస మద్దతు ధర కల్పనకు కృషిచేస్తున్నాం. వస్త్రాల నుంచి వ్యవసాయోత్పత్తుల వరకు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రతీ వస్తువుకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం కృషిచేస్తున్నాం. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర మిషన్‌లో భాగంగా 5,948 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించాం. 70 శాతం గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ అమలుచేస్తున్నాం. 7,559 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి, 2025–26లో 40వేల ఇంకుడు గుంతలు, 20 లక్షల గృహాల్లో కంపోస్ట్ గుంతల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం.
దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 161 పౌరసేవలు అందిస్తూ ‘మన మిత్ర’ అనే వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించాం. ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, రియల్ టైం గవర్నెన్స్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా లక్షలాది ప్రైవేట్ సీసీటీవీ కెమెరాలను అనుసంధానిస్తూ సుమారుగా 20 వేల సీసీటీవీ కెమెరాలతో రాష్ట్రవ్యాప్త క్లౌడ్–ఆధారిత ఐపీ సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నాం.
‘నరేంద్ర చంద్రబాబు’ అంటూ
గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు సీఎం పేరు ప్రస్తావించే సమయంలో నారా చంద్రబాబు నాయుడుకు బదులుగా నరేంద్ర చంద్రబాబునాయుడు అంటూ మాట్లాడారు. దీంతో సభ్యులందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment