ముగిసిన 2016-17 బడ్జెట్ సమావేశాలు
♦ 17 పనిదినాల్లో 89.42 గంటలు పనిచేసిన శాసనసభ
♦15 పనిదినాల్లో 56.21 గంటలు పనిచేసిన శాసన మండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులు, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ తదితర అంశాలపై చర్చ ముగిశాక సభాపతి ఎస్.మధుసూదనాచారి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 10వ తేదీన గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో మొదలైన శాసనసభా సమావేశాలు గురువారం దాకా పదిహేడు రోజుల పాటు కొనసాగాయి. వాస్తవానికి పద్దెనిమిది రోజుల పాటు సమావేశాలు జరిగినా, 11వ తేదీన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణానికి సంతాపం తెలిపేందుకు మాత్రమే సభ జరిగింది. దీంతో పదిహేడు రోజులు మాత్రమే సభ జరిగినట్లు ప్రకటించారు. 14వ తేదీన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా, మరునాడు బడ్జెట్‌పై చర్చలో పాల్గొనేందుకు వెసులు బాటు కల్పిస్తూ ఒక రోజు (15వ తేదీ) సెలవు ఇచ్చారు. ఆ తర్వాత 23, 24, 25 తేదీల్లో వరుసగా మూడు రోజులు సెలవు ఇచ్చారు. కాగా, మొత్తం 17 పనిదినాల్లో సభ 89.42 గంటల పాటు పనిచేసింది. 120 మంది సభ్యులున్న శాసన సభలో 161 ప్రసంగాలను సభ్యులు ఇచ్చారు. వివిధ అంశాలకు సంబంధించిన 9 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.
ప్రతిపక్షాలకే ఎక్కువ అవకాశం
శాసనసభ అధికారుల గణాంకాల మేరకు సభ పనిచేసిన 89.42 గంటల్లో ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం దక్కింది. అధికార టీఆర్ ఎస్ 41.49 గంటలపాటు చర్చల కోసం సమయం తీసుకుంటే, ప్రతిపక్షాలకు ఏకంగా 47.55 గంటల పాటు సమయం ఇచ్చారు. కాగా, పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ 19.35 గంటలు, ఎంఐఎం 6.31 గంటలు, బీజేపీ 7.12 గంటలు, టీడీపీ 6.14 గంటలు, వైఎస్సార్ కాంగ్రెస్ 3 గంటలు, సీపీఐ 3.07 గంటలు, సీపీఎం 2.07 గంటలు వినియోగించుకున్నాయి. ఇక సభలో సీఎం 9.08 గంటలు, ప్రధాన ప్రతిపక్ష నేత (కాంగ్రెస్) 4.14 గంటలు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత 4.17 గంటలు, బీజేపీ శాసనసభాపక్ష నేత3.40 గంటలు, టీడీపీ పక్ష నేత 1.57 గంటల పాటు సభలో మాట్లాడారు. సభలో కాంగ్రెస్ 25 నిమిషాలు, ఎంఐఎం 5 నిమిషాలు, బీజేపీ 2 నిమిషాలు, టీడీపీ 1 నిమిషం పాటు సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి.
శాసన మండలి నిరవధిక వాయిదా
శానస మండలిని చైర్మన్ స్వామి గౌడ్ నిరవధికంగా వాయిదా వేశారు. మండలి పదిహేను పనిదినాల్లో 56.21 గంటలపాటు పనిచేసింది. ఇందులో అధికార టీఆర్‌ఎస్ 37.34 గంటలు, కాంగ్రెస్ 12.32 గంటలు, ఎంఐఎం 2.44 గంటలు, బీజేపీ 2.01 గంటలు పీఆర్‌టీయూ 2.06 గంటలు, నామినే టెడ్ సభ్యులు 4.04 గంటల పాటు మాట్లాడారు.
అసెంబ్లీ నిరవధిక వాయిదా
Published Fri, Apr 1 2016 2:32 AM | Last Updated on Mon, Oct 8 2018 3:41 PM
Advertisement
Advertisement